నిద్ర లేచిన సంది నీకొరకు వేచాను

 ఓ సూర్యుడా నువ్వొచ్చి వాలయ్య

చీకటిని చిదిమేయ హిమగాలి తరిమేయ..

మంచుబింధువు తెరలొ మసకగ చూపుంది

 నిద్ర మత్తుచెలియ మరికాస్త వుండంది

కోడిపుంజుల కూత పరుగెత్తి లెమ్మంది

ఆవుదూడరుపులకు అమ్మ మేలుకుంది

నాన్నతొ చెప్పింది నువ్వెళ్ళి చూడమని

తాత కాల్చిన చుట్ట ఘాటైన వాసనకు

 పొంగి పొర్లి వచ్చె కడుపునుంచి కక్కు

విసుగెత్తి అరిచాను ఆవలికి పొండని

నాన్న నవ్వుతు పోయె తాతొచ్చి ముద్దాడె

 ఒదిగాను ఒడిలోన ఒయ్యారి వంకలతొ

అమ్మొచ్చి అరిచింది సంబరం చాలని

బయటికొచ్చి చూస్తె బారెడు ప్రొద్దెకింది

 రిబ్బనుతొ జడకట్టి బంతి పూలను పెట్టి

సద్ది అన్నము పెట్టి సంచి చేతికిచ్చి

తోలినారు బడికి తొందరగ పొమ్మని

తెలుగు పంతులయ్య త గుణింతము చెప్పె

ఆట పాటలు నేర్పె అందులోనొక గురువు

ఎక్కాల లెక్కలతొ ఎరుపెక్కె నా కళ్ళు

సూర్యుడా పొమ్మని చురచురా చూచితిని

ఇంటి గంట మోత ఇంపుగా వినిపించె

పలక బలపాలను పదిలంగ సర్దుకొని

వడివడిగ వచ్చి వాలిపోతిని ఇంట

బొంగరము బంతులతొ వచ్చారు స్నేహితులు

మట్టిలొ దొర్లుతూ ధూళిలొ ఎగురుతూ

గోలలతొ గెంతాము ఆటలతొ అలిశాము

 వేడి నీటితొ చేస్తి స్నానాల సందడులు

అమ్మమ్మ కంచంతొ అరుగుమీదికి వచ్చి

చంద్రుడిని చూపించి చల్లంగ తినిపించె

కథలు కబురలతోటి కాల రాత్రుడు సాగె

నిద్ర మత్తు తోటి నీరశించె కనులు

అమ్మ వద్దకు చేరి ఆదమరిచినాను

 రాకయ్య సూర్యుడా రాకయ్య ఇప్పుడే

నా చిన్ని మోముపై నిద్రలను చెరిపేయ…!

       -శ్రీనివాస్ ప్రభు

RTS Perm Link