హృదయ ద్రవితపు అంజలి

Uncategorized 2 Comments »

రాజులుండే కోట విడిచి

పేద ప్రజలకు అండ దండగ

వెతల బ్రతుకుల కథలు మార్చగ

రచ్చబండకు బయలు దేరిన

అన్నయా ఓ అమర వీర..

హృదయ ద్రవితపు అంజలిదిగో

కన్నీట తడచిన పుష్పమిదిగో..!

పంచ కట్టుకు ప్రాఱమిచ్చి

తెల్లతుండును తలకుచుట్టి

చిరు నగవుని చెదరనీయక

రాజ టీవిగ అడుగులేస్తూ

చేయి గాలిలో ఊపినంతనె

పులకరించని మనస్సు ఉందా..?

నేడు..పగలకుండిన హృదయముందా..?

బీదవాడి ఆరోగ్య రక్షఱ

పేద ముసలి పెన్షన్ ల జాతర

లేనివాన్ని దైవంగ  తలచి

సేవ చేచిన ధన్య జీవివి

పరిమళించిన పుఱ్యమూర్తివి..!

రైతు కంట కన్నీరు చూచి

గంగమ్మనాపిన భగీరధుడవి

అటక ఎక్కిన హలము చూచి

నదుల నీటికి నడక నేర్పీ

పొలము దున్నిన పోటుగాడివి …!

పంచభూతముల సాయమడిగి

యముడు మాయలు చేచినాడె..

భౌతికంగ మనకు మనకు

దూరములనే పెంచినాడే..

హౄదయమడుగును మాటి మాటికి

అన్న ఏడని, ఏడవుండని ..

ఏమిచెప్పెద అన్నయా

భోరుమని విలపించుచుంటిని

కన్నీటి వరదను ఆపకుంటిని

హృదయ భారము పెరుగుచున్నది

గాజుముక్కలె పగలనున్నది

ఏమిచెప్పెద అన్నయా…..!

-శ్రీనివాస్ ప్రభు


RTS Perm Link

నాకింత చోటివ్వు

Uncategorized 3 Comments »

మేడి పండ్లను తింటు మైమరచి పాడేటి

కోకిలమ్మ పాట కళ్ళార జూచితిని

వడుపుగా వృక్షాల మాను వలిచేస్తున్న

వడ్రంగి పిట్టల వాలు గాంచితి నేను

నురగ పొంగులమ్మ గౌడ గంగమ్మనే

కమ్మని రుచివున్న కల్లు తాగితి నేను

బురద నీటిలోన బుడబుడా తలదూర్చు

మట్టగుడెస పులుసు మధురంగ తిన్నాను

జొన్నకంకులు కోసి ఊసబియ్యము చేసి

వేరుశనగను కాల్చి వలిచిపెట్టినారు

దోసకాయను కోసి ఉప్పుకారము జల్లి

పెసర బొబ్బర కాయలనుడికించి పెట్టారు

కమ్మరి కొడవళ్ళూ కుమ్మరుల కుండలు

వడ్రంగి ఉలితోటి పల్లెపనిచేస్తుంది

నాపల్లె అందాలు మనసులో దాచాను

వారిచ్చు దైర్యాన్ని గుండెలో నింపాను

మనసు గాయమైన మరితిరిగి వస్తాను

నాకింత చోటివ్వు ననుకన్న నాయమ్మ ….!

                       -శ్రీనివాస్ ప్రభు             

RTS Perm Link

మరోఉదయం మొలిచింది.!

Uncategorized 1 Comment »

కష్టాన్ని కడిగేసుకొని కుక్కిమంచంపై కూలబడ్డాను

మ్మ ఇచ్చిన బువ్వ కంచాన్ని తీసుకొని

కాళ్ళునాకే కుక్కపిల్లతొ పంచుకున్నాను

నక్షత్ర పువ్వుల పందిరైన ఆకాశాన్ని తిలకిస్తూ

గుబురు కొమ్మల కొప్పుమాటున నక్కిఎక్కే

చందమామ వెన్నెల సోయగాలని ఆరాదిస్తూ

సంపంగి సిగనుంచి వచ్చే సువాసనల మాధుర్యాన్ని ఆశ్వాదిస్తూ

వంటిపై వయ్యారంగ సాగి సయ్యాటలాడె

చల్లగాలి కౌగిళ్ళకు పరువశించాను..

మనస్సు తేలికై గుండెలనిండుగా గాలినిబిగించి

దాచుకున్న చిరునవ్వుని దోచిళ్ళకొద్దే పొంగిస్తున్నను

దోచుకునే వాడెవ్వడు లేడని ..

గడచిన గతం గరళం

మింగేస్తున్నాను కఠినంగా కష్టంగా

రేపనే ఆశలలోకాన్ని ఆవిస్కరిస్తూ

నిద్రమ్మ ఒడిలోకి నింపాదిగ ఒరిగిపోతున్నాను

చెట్టుకొమ్మలపైనున్న హిమబింధు తోరణాలనుంచి

చిరుచినుకులు జారిపడుతుంటే

అడుగులుచేస్తున్న అలడులకు

పక్షుల పాటల కేరింతలకు

మరోఉదయం మొలిచింది.!

బ్రతుకుబండిని మెడకువేసుకొని

గతుకురోడ్లను చదునుచూచుకొని

మదికితోచిన పాటనందుకొని

తూగిపోతున్నాను ..వడివడిగా

సాగిపోతున్నాను ..!!

                 – శ్రీనివాస్ ప్రభు

RTS Perm Link

నీటి బింధువు

Uncategorized 5 Comments »

తామరాకుల మీద తళతళా మెరిసేటి

 నీటిబింధువ నీదు జీవమెంతే…?

అటునిటూ కదిలేవు అబ్బురము పరిచేవు

వజ్రకాంతులతోటి మనస్సులను దోచేవు

 అందాల ప్రకృతికి కాపలా కాసేటి

తుమ్మెదీగలజూచి విరగబడి నవ్వేవు

నాచుమొక్కలు తింటు పూటలను గడిపేటి

చేపపిల్లల వంక చులకనగ చూచేవు

ఏపాటి బ్రతుకమ్మ ఓ నీటి చుక్కమ్మ

మా మనుజులనుజూచి నేర్చుకొనబోకమ్మ..

గాలివీచినపుడు గంగమ్మ పంపేటి

అలల తాకిడి తోటి అదృష్యమౌతావు ./.

         -శ్రీనివాస్ ప్రభు

RTS Perm Link

స్నేహపు మొలకలు

Uncategorized 1 Comment »

కమ్మని కబురులు ఎన్నో చెప్పే

రమ్మని పిలిచే నేస్తాలుండగ

బంజరు భూమిలొ స్నేహపు మొలకలు

 సుగంధాలతో ఆహ్వానించగ

మధుర ఙ్ఞాపికలు మనసున తొలచి

మూగగ నిలిచిన మనిషిని నేను

 స్నేహలతలతో నిండిన తోటలొ

పరిభ్రమించే మాలిని నేను

ఎన్నో హద్దులు ఎన్నో బుద్దులు

 అల్లరి పనులకు అలిగిన వేళలు

మీకన్నులలొ మీమనస్సులలొ

చెరగని ముద్రలు సందడి చేయగ

కళ్ళముందరె కాలం కదిలే

ఎన్నో ఊళ్ళకు స్నేహం తరలె

మరలా కలిసే భాగ్యం వస్తే

ఏమని చెప్పద నాఉల్లాసం

 స్నేహపు వారది పునాది రాయిని

చేస్తానంటె ఎంతధృష్టం….!

శ్రీనివాస్ ప్రభు

(ఎన్నో వసంతాలు ఎవరు ఎక్కడో తెలియకుండ బ్రతికి, మరలా మేము చుదువుకున్న స్కూలు వి.యం.బంజరులో నా ప్రాణ మిత్రులను కలుసుకున్న మధుర క్షణంలో) 

RTS Perm Link

విరుల విరహాలు

Uncategorized 1 Comment »

నీలికన్నులబాల నిద్రలోనీవుండ
తొంగిచూచినాను తెరలచాటునుండి
మన్మధుడు మంత్రించి మాపైకిపంపెనా..?
సురలోక సౌదాన్ని మాచెంతనుంచెనా
కనులు మూసుకోవు కాళ్ళుకదలలేవు
చూపుచుట్టుకుంది మరితిరిగి రానంది
విశ్వఖర్మ నీఅన్నయా ఏమిచెలి
కాంతిరేఖను చుట్టి కమనీయ మోముతొ
ఇంత సుందరరూపు చెక్కిపంపించాడు
వాయుదేవుడు నీతమ్ముడా ఏమిసఖి
పైటకొంగునుతీసి వింజామరనుచేసి
చల్లగాలి తోటి సేవ చేస్తున్నాడు
నీమేను ముద్దాడ నీక్రింద నలగంగ
విరులన్ని విరహాల గీతాలు పాడంగ
నలిగిన పూలన్ని నాబ్రతుకు ధన్యమని
నలగని విరులన్ని నావంతు ఎప్పుడని
వాసనల వూసులతొ వెన్నెలకు తెలిపాయి
ఎరుపు చీరలోని యదపొంగు అందాలు
కుచ్చిళ్ళ పైనునున్న సొగసైన ద్రుశ్యాలు
ఆహొయల వొంపులు రసరాజ్యకెంపులు
తళుకుమని మెరవంగ తారలా నిలవంగ
నీశయన మందిరపు దాసిగా మారనా
నీకాళ్ళ పారాణి పూతగ చేరనా….
           –శ్రీనివాస్ ప్రభు

RTS Perm Link

నవ్వు

Uncategorized 3 Comments »

గిరిన విరులు జూచి గిరిరాజు నవ్వంగ

పంట వన్నె జూచి పొలము నవ్వ

 తొణకు తళుకులు చూచి సాగరుడు నవ్వంగ

కవుల కలము చూచి కాగితము నవ్వ

 మేఘ వర్ణము చూచి ఆకసుడు నవ్వంగ

 మధుర భావము చూచి మనసు నవ్వ

 సిరుర రాసులు చూచి శ్రీపతి నవ్వంగ

నీదు అందము చూచి నేను నవ్వ

నువ్వు నవ్వి నవ్వు నగిషీలు దిద్దంగ

నవ్వుతూ వుండాలి నువ్వెప్పుడూ

అందుకే వస్తాను మళ్ళెప్పుడూ…

         -శ్రీనివాస్ ప్రభు

RTS Perm Link

సత్యాలు రాలాయి

Uncategorized 1 Comment »

దాచుకునే వాడెవ్వడు దానిని దోచుకునే వడెవ్వడు

భాద్యుడెవ్వడు వీర భోజ్యుడెవ్వడు 

“సత్యాలు”ముక్కలై రాలిపడుతుంటే

హైటెక్కు మోసాలు బయటపడుతుంటే

రాజులే రాజ్యన్ని దోచేచి దాస్తుంటె

రక్షించు వాడెవడు దండుదొంగలనుండి

ఈనాడు చెప్పెదరు హితభోద పద్యాన్ని

ఆనాడు కనలేని అవినీతి బంధాన్ని

అధికార చట్టాల చుట్టలు వీరురా…

 కోట్ల చాటున వేల కోట్లు దాచేస్తారు

సూట్లు, సూట్కెసులతొ స్విస్ బ్యాంకు తతారు…

కమిటీలు వస్తాయి కన్నీళ్ళూతుడవంగ

మదుపుదారుల మదిలొ భ్రాంతులే నింపంగ

 ఏ అయ్య ఇచ్చేను ఏ అమ్మ పెట్టేను

కరిగిపోయిన సొమ్ము కలతచెందిన దమ్ము

కీచకులు వంచకులు భూభక్ష్య హంతకులు

భరత భూ వృక్ష్యాన్ని పీడించు చీడరా

లెమ్మురా సోదరా నీజాతి రక్షణగ

 రాజకీయపు రంగు దులిపేయ కడిగేయ

 పోరాడు వీరుడా ప్రాణములె హద్దుగా

-శ్రీనివాస్ ప్రభు

 ( లోక్ సత్తా జయప్రకాష్ నారయణ గారికి అంకితమిస్థూ )

RTS Perm Link

పాముకాటుకు మరణమొందిన మిత్రునికి అంజలి ఘటిస్తూ

Uncategorized 1 Comment »
గుట్టల పుట్టల మాటున
కట్టెలు కొట్టే చోటున
కనిపించని పామొక్కటి కాటేసింది..
ఎండల వేడికి గాలులు
వంటికి మంటలు రేపుతు
కనిపించే కళ్ళల్లొ దుమ్మేసింది..
పిడసలు కట్టిన నోటికి
చలములు చేరే దారికి
అడ్డంగ ముళ్ళపొదా అల్లేసింది..
మనసున పిల్లలు చేరగ
పెళ్ళము ప్రేమను కోరగ
దరిచేరే దారినన్ను వదిలేసింది..
భయమున బ్రాంతులు చేరగ
నోటిలొ నురగలు కారగ
మత్తుగ మైకం నన్ను కమ్మేసింది..
ఏదో అడుగుల సవ్వడి
నాదరి చేరిన అలికిడి
మృత్యువుతో పోరాటపు వేళయ్యింది..
రేపిక లేదని తెలిసి
నాతో రాదని తలసి
కంటిలోని నీటిచుక్క వరదయ్యింది….
-శ్రీనివాస్ ప్రభు

RTS Perm Link


WordPress Theme & Icons by N.Design Studio. Theme pack from WPMUDEV by Incsub. Distributed by Dedicated Servers
Entries RSS Comments RSS Log in

RTSMirror Powered by JalleDa

css.php