అక్కడ రాహుల్ గాంధీ… ఇక్కడ లోకేశ్ (చినబాబు)… రచ్చ రచ్చే…!

కాలు జారినా పర్లేదు కానీ, నోరు జారకూడదు అంటుంటారు పెద్దలు. కానీ కాంగ్రెస్, తెదేపా అధినేతల పిల్లలు మాత్రం కాలు సంగతేమో కానీ, నోరు మాత్రం పదే పదే జారేసి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. రాహుల్ ప్రసంగాల గురించి, పార్లమెంటులోను, బహిరంగ సమావేశాల్లోనూ ఆయన పండించిన కామెడీ గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఇ(ఎ)ప్పటికీ యువనేతగానే ఉన్న ఆయన వాక్చాతుర్యం(?)పై ఎన్నో వీడియోలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్‌లో లోకేశ్ వంతు …

ఎన్నికల ప్రచారంలోనే పొరపాటున తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే, మనకు మనం ఉరి వేసుకున్నట్లేనని ఉవాచించేసిన చినబాబు ఇప్పుడు ఏకంగా మంత్రివర్యులు అయిపోయారు. ప్రమాణస్వీకార సమయంలోనే సార్వభౌమాధికారాన్ని ఉచ్చరించలేకపోయిన ఈ ఎంఎల్‌సికి ముందుగా తెలుగు భాష మరియు సంస్కృతి పోర్ట్‌ఫోలియోని కట్టబెట్టాలనుకున్నా, ఆయనకు భాషపై ఉన్న పట్టుని చూసో, పక్క రాష్ట్రపు చంద్రశేఖర తనయుడు కెటిఆర్‌ని చూసి ఫాలో అయిపోదామనుకున్నారో కానీ అవే శాఖలను కేటాయించారు.

తాజాగా విజయవాడలో అంబేద్కర్ జయంతి నాడు ఇచ్చిన ప్రసంగంలో జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అనబోయి, యథావిథిగా పొరబడి వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు అనేసారు. వ్రాసుకొచ్చిన ప్రసంగ పాఠాన్ని చదవడంలో పొరపాటు పడి ఉంటారని అనుకున్నా, వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పరు అనే కనీస అవగాహన కూడా ఈ నూతన మంత్రివర్యులకు లేకపోవడమే ఇక్కడ విడ్డూరం.

ఈ విధమైన పొరబాట్లతో ప్రత్యర్థుల విమర్శనాస్త్రాలకు గురవ్వడమే కాక, సోషల్ మీడియాలోనూ నవ్వులపాలవుతున్నారు నారా లోకేశ్. ఇకనైనా తెలుగు భాషపై పట్టు సాధించి, తెలుగులో అనర్ఘళంగా ప్రసంగించి, ఉచ్ఛారణతో, స్పష్టతతో తెలుగు భాషకు గౌరవాన్ని, ఓ స్థాయిని తెచ్చిన మహనీయుడు, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు లోకేశ్ తగ్గ మనవడు అనిపించుకోవాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

RTS Perm Link

1 Comment so far

  1. Anonymous on April 17th, 2017

    Nice one!!!

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php