Archive for November, 2012

బబ్లూ బోధ. .. బాబాయ్ బాధ…!!!

సీన్ 3:
ఓ పేరొందిన ఆస్పత్రి..

డాక్టర్ల పెదవి విరుపులు, మా పిన్నమ్మ బిత్తరచూపులు.. మా అమ్మ ఆందోళన, మా వదిన కంగారు…
అక్కడ మా బాబాయ్ ‘అహ నా పెళ్లంట’ సినిమాలో సుత్తి వీరభద్రరావులాగా చొక్కా చించేసుకుంటూ చిందులేసేస్తున్నాడు… 2, 3 చొక్కాలు చించినప్పటికీ, ఆయన కసరత్తు కమ్ కండల కమ్ దృఢమైన కమ్ హెర్క్యులెస్ శరీరాన్ని అక్కడి నర్సుల చూపుల నుండి తప్పించేందుకు శతవిధాల ప్రయత్నించి విసిగిపోయి నీరసించిన మా పిన్ని ఆపై ఓపికలేక అలా బిత్తరచూపులతో సెటిలైపోయింది.

ఇంతకీ ఈ సందడి(??)కి కారణమేంటో…!!

 

సీన్ 2:

వేదిక – స్వగృహం
పండుగ – దీపావళి

మదనపల్లి సమీపంలోని అమ్మగారింట్లో గౌరీవ్రతాన్ని చేసుకునేందుకు మా పిన్నమ్మ, అక్కడి బామ్మర్దులకు దీపావళి సందర్భంగా తన తడాఖా చూపేందుకు మా బాబాయ్ ఓ వారం పది పదహైదు రోజుల ముందే చెక్కేసారు. (మనకేం తక్కువలెండి, చెన్నపట్నంలో హోటళ్లకు కొదవా? మొబైల్, ఇంటర్నెట్ ఉంటే స్నేహితులకు కొదవా? ఇద్దరికీ టాటా చెప్పేసి ఆఫీసుకి అంకితమైపోయా..)

తిరుగు ప్రయాణంలో తిరుపతి నుండి చెన్నై రైలెక్కవలసిన దంపతులిద్దరూ సమయాభావం వల్ల రిజర్వేషన్ చేయించుకోలేకపోవడంతో దారితప్పి, ఖర్మకాలి మా ఇంటికొచ్చిపడ్డారు. ఆ సమయానికి నేనూ ఊరెళ్లిపోయి ఇంట్లోనే ఉన్నా…

బంధువులింటికొస్తే ‘ఖర్మకాలి’ ఏంటి అని మీరు అనుకోవచ్చు.. తప్పు లేదు…
చెప్పబోయేది ఆ స్టోరీనే..

దిగ్విజయంగా అన్ని టపాసులు, చిచ్చుబుడ్లు, రాకెట్లు, జాఠర్ ఢమాల్‌లను బామ్మర్దులతో తొడగొట్టి సవాల్ చేసి మీసం తిప్పి మరి పేల్చి, కాల్చి పారేసిన మా బాబయ్య అన్యాయంగా నా అల్లుడి ధాటికి ఆస్పత్రిపాలయ్యాడు…

అదెలా….

 

 సీన్ 1:

దీపావళి సందడి ఇంకా తగ్గలేదు.
కొవ్వొత్తుల కాంతి, పిండివంటల ఘుమఘుమలు పోటాపోటీగా ఇల్లువాకిళ్లు వ్యాపిస్తూనే ఉన్నాయ్..
అసలే మనం (అంటే నేనే) ఇంటికొచ్చామంటేనే ఓ రకమైన సందడి ఉంటుందంటుంటారు మన ఫ్యాన్స్ (అంటే ఎవరో కాదు – అమ్మ, వదిన, అన్న ఇత్యాది కుటుంబ సభ్యులు, బంధువులే) అంతా… అన్న కూతురు మోక్షిత కేరింతలు, అక్క పిల్లలు బుడిగి, బబ్లూల అల్లర్లు, అలకలు, ఆటలు..
పండగంటే ఇంకేం కావాలి??

ఇంతలో ఇంటిలో పిన్ని, బాబాయ్‌ల ఎంట్రీ…

పెద్ద పిల్లలిద్దరికీ వాళ్ల దగ్గర కాస్తా చనువెక్కువే.

ముఖ ప్రక్షాళనాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత పిల్లలతో చదువుల సంగతి ఎత్తితే వాళ్లెక్కడ దూరమైపోతారనే ఆదుర్దాతో కూడిన అనుమానం వల్ల వచ్చిన డోలాయమన స్థితిలో చిక్కుకున్నాడో – మా బాబాయ్ – మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడో, లేకుంటే మనవడి వరుస పిల్లాడిని ఆట పట్టిద్దామనుకున్నాడో కానీ మా మా వాడినో ప్రశ్న వేసేసాడు ఇలా…

“ఏంటి బబ్లూ, జుట్టు అలా పెంచేసుకున్నావ్? చక్కగా క్రాఫ్ చేయించుకుంటే బాగుండేది కదా” అని!!

ఇక మొదలైంది మా వాడి బోధ, మా బాబాయ్యకి బాధ….

“మనిషి జీవితమంటే ఇంతే తాతా.. మనం పెరగాలనుకునేవి ఏవీ పెరగవు (ద్వంద్వార్థాలకి తావు లేదిక్కడ), పెరగకూడదనుకునేవేవి పెరగక మానవు. కోరుకున్నదేదీ దొరక్కపోవడమే మానవ జన్మకి శాపమేమో కదా. ఉదాహరణకి మీ అందరికీ బొజ్జలు తగ్గాలనుకుంటుంటారు, తగ్గుతాయా??? లేదే… నాకేమో జుట్టు పెరగకూడదనుకుంటుంటా, ఆగుతుందా??? లేదే… జీతానికి ఖర్చులకు పొంతన కుదరనట్లే, కోరికలకు వాస్తవాలకు లంకె కుదరదేమో. ఐనా వద్దన్నా పెరుగుతున్నదాన్ని, మనం నిరోధించలేని కొన్ని విషయాలను ప్రేమించడం అలవర్చేసుకుంటే ఇక బాధలు ఉండవుగా… %^&(&(&$%^ &(&$#$$ &(&^$%^$&(&*() %&%&*^(*)(* %*&(*&(&… $%^$&)(*)* ^%$^%&*^ ^*$^%##)*…. వగైరా వగైరా వగైరా వగై… వగై… వగై… వ…. వ….. వ….. … …”

మా వాడి వేదాంతం మాకు అలవాటే కాబట్టి అందుబాటులోని గోడలు, బల్లలు, కిటికీ ఊచలు పట్టుకుని నిలబడగలిగాం కానీ, ఎప్పుడో పండగకో పబ్బానికో కలుసుకునే మా బాబాయికి మా వాడి వేదాంత మహోత్కృష్ట విశ్వ రూపం గురించి ఎక్కువ వివరాలు తెలియనందున కూలబడిపోయాడు. ఆ ఛండ ప్రచండ వేదాంత అగ్నికీలల్లో మాడి మసైపోయాడు. వాడి ప్రసంగం అలా కొనసాగుతుండగానే పెద్ద పెట్టున బల్లులు పాడినట్లు, కాకులు ఏడిచినట్లు, నక్కలు నవ్వినట్లు వింతగా, సరికొత్తగా సకిలింపు ధ్వనులు వెలువరించసాగాడు….

కట్ చేస్తే….

 

నాకు ఓపిక లేదు
“సీన్ 3” — చదువుకోండి….

RTS Perm Link

RTSMirror Powered by JalleDa

css.php