కొడుకు ప్రతిరూపం…!

నా పుట్టినరోజును గుర్తు పెట్టుకుని మరీ ఓ బహుమతి పంపాడు. చాలా విలువైందే. ఈ వయస్సులో నాకు అవసరమైందే. వాడు అంత దూరాన ఉన్నప్పటికీ నాకు ఎందులోనూ తక్కువ చేయలేదు. చేతినిండా డబ్బులుంటే ఈ రోజుల్లో దొరకంది ఏముంది? వాడు డాలర్లు సంపాదించి, వాటిని రూపాయల్లోకి మార్చి నెలనెలా నా అవసరాలకు అవసరమైన దానికంటే ఎక్కువే పంపుతుంటాడు.

ఏమో.. దూరంగా ఉంటే ప్రేమ ఎక్కువవుతుందేమో..

వాడు పంపే డబ్బును ఖర్చు పెట్టేస్తుంటే చాలా బాధగా ఉంటుంది. నాకు అది డబ్బులా అ(క)నిపించదు. వాడికి నాపై ఉండే ప్రేమలా అనిపిస్తుంది. డబ్బులైపోతూ ఉంటే నా కొడుకు నాకు దూరమవుతున్నట్లే ఉంటుంది. అలాగని డబ్బును చూసుకుంటూ కూర్చుంటే ఈ వయసులో నాకు గడిచేదెలా. ప్రభుత్వం ఇవ్వజూపిన పెన్షన్‌ను ప్రజల మీద ప్రేమతో, కొడుకుపై నమ్మకంతో వదులుకుంటిని. ముక్కుసూటి వైఖరి కారణంగా సర్వీసులో ఉన్నప్పుడూ కూడబెట్టుకున్నదేమీ లేదు. దానికి నేనేమీ బాధపడటం లేదు కూడా…

నాకున్న ఆస్థంతా నా కొడుకే. పుట్టిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడే కదా తండ్రి గర్వపడేది. చదువులోనూ చురుకైన వాడు కావడంతో జీవితంలో త్వరగానే సెటిల్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి కొన్ని వందల మందికి జీవనోపాధి కలిగించే స్థాయికి ఎదిగాడు. అంత మంచి బిడ్డను కన్న నా అదృష్టానికి బంధువులు, మిత్రులు పొగుడుతుంటే నాలో నేనే సంబరపడిపోతుంటాను – చిన్నపిల్లాడిలా.

అందరికీ వాడంటే ఇష్టమే, వాడికీ అందరూ ఇష్టమే. ఇక్కడికి వచ్చే ప్రతిసారీ అందరికీ బహుమతులు తెస్తుంటాడు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు వాకబు చేస్తుంటాడు.

నా పుట్టినరోజు బహుమతి గురించి చెప్పనే లేదు కదూ… ఈ వయస్సులో నాకు అంత పనికొచ్చేది, అవసరమైంది ఏముంటుంది??

వయసు మీరిపోయావు, తూలిపడగలవు జాగ్రత్త అంటూ గుర్తు చేసే చేతికర్ర..

నేను వేలు పట్టుకుని నడిపించిన నా కొడుకు, తను నా చేయి అందుకుని ఆసరాగా నిలవలేకపోయినా – తన గుర్తుగా ఉంచుకోమని అపురూపంగా పంపాడు.

RTS Perm Link

5 Comments so far

 1. kaarunya on November 25th, 2010

  బాగుంది… ఆసరాగా నిలవాల్సిన కొడుకు, తనకు బదులుగా చేతికర్రను పంపించటం… చాలా చక్కగా, హృద్యంగా మీ భావాలను వ్యక్తీకరించారు. మనసుకు హత్తుకునేలా ఉంది.

  ఏంటండీ ఈ మథ్య మీ నుంచి ఎలాంటి పోస్టులు రావటం లేదు.. బ్లాగ్లోకంపై వైరాగ్యమా ఏంటి?

 2. anigalla on November 25th, 2010

  చాలా బాగుంది. క్లుప్తంగా చెప్పినా చాలా చక్కగా చెప్పారు. keep it up.

 3. chavakiran on November 25th, 2010

  Nice One.
  Waiting for your telanagana post 🙂

 4. Sree on November 25th, 2010

  @kaarunya gaaru –
  బ్లాగ్లోకంపై వైరాగ్యం ఏమీ కాదండీ.. తీరికలేని పనులు అని అబద్ధమాడలేను గానీ, ఆఫీసులో పనులు, ఇంట్లో గేమ్‌లతో బ్లాగ్‌ను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. ఇకపై పునరావృతం కాకుండా చూసుకుంటాను..!

  @anigalla gaaru –
  ధన్యవాదాలు మహాశయా..!

  @chavakiran gaaru –
  మళ్లీ తెలం’గానమా’.. ఐతే కొన్నాళ్లు ఆగాల్సిందే..!

 5. రాధిక on November 26th, 2010

  బావుంది..మంచి ప్రయత్నం….ఇలానే కొనసాగించండి
  కనీసం డబ్బులైనా పంపుతున్నాడు.. కొడుకులందరూ ఇలా ఉంటే బావుండు అనిపించింది!!

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php