Archive for February 2nd, 2010

వైష్ణవి హత్య – మరో కోణం!

వైష్ణవిని చంపింది ఎవరు!?

మామ (సవతి తల్లి సోదరుడు) కాదు, కిరాయి హంతకులు కాదు…

ఇంకెవరు…
మరెవరో కాదు – సాక్షాత్తూ ఆమె తండ్రే..!

ఆ చిన్నారిని ప్రాణప్రదంగా ప్రేమించాడు, ఆ చిన్నారి మరణించందన్న ఘోరమైన వార్త విని తట్టుకోలేక చనిపోయాడు అని అందరూ సానుభూతి కురిపిస్తున్న ఆమె తండ్రే..

నమ్మ(లే)కపోయినా అదే నిజం.

ఒకామెని పెళ్లి చేసుకుని, ఆమె ద్వారా ఓ బిడ్డను కూడా కని ఆపై మరొక స్త్రీపై (వ్యామోహంతోనో, ప్రేమతోనో – అది ప్రస్తుతానికి అప్రస్తుతం) మనసుపడి ఆమెనూ వివాహం చేసుకుని పిల్లలను కని, అంతటితో ఆగకుండా అసలు ఆ మొదటి భార్య ఊసే పట్టించుకోకుండా ఆమె ముఖం చూడకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ప్రభాకరే పరోక్షంగా ఈ దారుణానికి కారకుడు.

ఈ తప్పులన్నింటితో పాటు అతను మరికొన్ని తప్పులు చేసాడు..

కుటుంబం పరువు కోసమో ఏమో గానీ తనకెవరూ శత్రువుల్లేరంటూనే కాలయాపన చేసాడు. ఒకవేళ ఆ చిన్నారి మొదటిసారి అపహరణకు గురైనప్పుడే తగిన సమాచారం అందించి ఉంటే అప్పుడే ఈ నిందితులు శిక్షించబడి ఉంటే.. .. పోనీ, ఈ దఫా అయిన పోలీసులతో అతను సరిగ్గా సహకరించాడా అంటే అదీ లేదు.

బహుశా తన చిన్నారి అపహరణకు గురైన రెండ్రోజులు తాను చేసిన తప్పులను సమీక్షించుకున్న అతని గుండె తట్టుకోలేకపోయిందేమో.. ఆ చిన్నారినే చేరుకునేందుకు ప్రభాకరాన్ని సిద్ధం చేసేసింది.

ఈ వైష్ణవి ఉదంతం పెళ్లయ్యినప్పటికీ పరస్త్రీలపై మోజు పడే ప్రభాకరం లాంటి ప్రతి పురుషుడికి గుణపాఠంగా మిగిలిపోతుంది..
పెళ్లయ్యి, అందునా పిల్లలున్న ఓ పురుషుడి పట్ల ఆకర్షితురాలు కాకుండా ప్రతి స్త్రీకి పీడకలగా మిగిలిపోతుంది..

తమ ఇంట అల్లారుముద్దుగా పెరిగిన సోదరి లేదా ఆమె సంతానం ఎక్కడ దిక్కులేనివారైపోతారోననే భయం, అభద్రతాభావం కారణంగానే కావచ్చు వెంకట్రావ్ అతి నీచమైన ఓ దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేయడానికి సిద్ధపడినవాడు తన అక్కను వదిలి మరొక స్త్రీని ప్రభాకరం పెళ్లి చేసుకున్నాడన్న నిజం తెలిసిన వెంటనే తన బావనే హత్య చేసి ఉండవచ్చు. అప్పుడు అతను చేసిన హత్య పట్ల ఇంత వ్యతిరేక భావం ప్రజల్లో కూడా ఏర్పడి ఉండకపోవచ్చు. కాదు.. తన అక్క సౌభాగ్యాన్ని తన చేతులారా చెరపలేకపోయాడనుకుంటే…. పెళ్లయ్యి, పిల్లలున్న ఓ పురుషుడిని ఆకర్షించిన లేదా అతని పట్ల ఆకర్షితురాలైన ఆ స్త్రీనే హత్య చేసి ఉండాల్సింది. అతడిని ఆమె నిజంగానే ప్రేమించి ఉండవచ్చు.. లేదా అతని మాయమాటలకు వంచించబడి ఆపై మరొక దారి లేక అతనితోనే జీవనం సాగిస్తూ ఉండవచ్చు.. లేదా ఆస్థి కోసం పన్నాగం పన్ని అతడినే వలలో వేసుకుని ఉండవచ్చు కూడా.

ఏది ఏమైనా ఇక్కడ అన్ని సందర్భాల్లోనూ నష్టపోతుండేది స్త్రీయే.
కాకపోతే వాళ్ల పేర్లు, సంఘంలో వాళ్ల హోదాలే వేర్వేరుగా ఉంటాయి..
ఒకరు మొదటి భార్య, మరొకరు రెండవ భార్య.

హత్యలు ఎలా చేయాలో, ఎవరిని చేయాలో, చేస్తే ఏ కారణాలతో చేయాలి అని బోధించడమో ఈ పోస్ట్ సారాంశం కాదు.

పెద్దలు చేసిన తప్పులకు పిల్లలను దండించకండి అనే..
ఆస్థుల కోసం అన్నెం పున్నెం ఎరుగని పసిమొగ్గలను తుంచెయ్యకండి అనే..

RTS Perm Link

RTSMirror Powered by JalleDa

css.php