Archive for February, 2010

నలుగురికీ నచ్చినది..!!

నాకు చిన్నప్పట్నుంచీ ఇంట్లో చాలా ముద్దుపేర్లే ఉన్నాయి..

ఇంట్లో చిన్నవాడిని కావడం మూలాన చిన్నా, మున్నా, నాన్నా అంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు పిల్చుకుంటూ ఉంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే తల్లికి దూరమై, పెంపుడు తల్లి యశోదకు దగ్గరైతే, నేను ఉద్యోగరీత్యా మా అమ్మకు తాత్కాలికంగా దూరమై, పిన్ని ఇంటపడ్డాను. గత నాలుగేళ్లుగా ఆమె కూడా నాకో కొత్త ముద్దుపేరు తగిలించేసిందనుకోండి..

కానీ చాన్నాళ్ల తర్వాత మా అన్న నాకీరోజు ఓ కొత్త పేరు పెట్టాడు… – టక్కరి దొంగ అని. అలాగని నేనేదో మా అన్న పర్సులో నోట్లు దొంగిలించాననుకునేరు… “నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో” అంటూ చిన్నగా హమ్ చేస్తున్నాడు కూడా. అలాగని నేను ప్రిన్స్ మహేష్‌బాబులా ఉన్నానని మీరు అనుకుంటే అది మీ పొరపాటే.

ఆయన నాకా పేరు తగిలించడానికి గల ఏకైక కారణం – మొన్న నేను బ్లాగ్‌లో ఉంచిన “వైష్ణవి హత్య – మరో కోణం” అనే పోస్ట్ మాత్రమే. ఈ రెండింటికీ గల లింక్ ఏమిటి అని మీరనుకోవచ్చు.

ఇదిగో… నాకు మా అన్నకు జరిగిన వాగ్యుద్ధం:

ఎందరో బ్లాగ్ మిత్రులు కూడలి, జల్లెడ, హారం వంటి వాటి ద్వారా బ్లాగ్ పెట్టిన వెంటనే చదివేస్తే మా అన్న మాత్రం నేను బ్లాగ్ పెట్టిన ఏ మూడు నాలుగు రోజులకు గానీ చూడడు. ఆయన ఓ పేద్ద ఎంఎన్‌సికి మేనేజర్ మరి. సరేలే ఎంతైనా అన్న కదాని ఫోన్ చేసి ఇలా అన్నా.. “అన్నా, నేనో బ్లాగ్ వ్రాసాను “వైష్ణవి హత్య” గురించి. చూసి నీ అభిప్రాయాన్ని తెలియజేయి” అని.. ఇలా అన్నానో లేదో వెంటనే – “నేనసలు ఆ పాప గురించి వార్తలు కూడా చదవడం మానేసాన్రా.. మనస్సంతా ఏదోలా ఉంది.. మళ్లీ నీ సోదొకటా.. నేను చదవను పో” అనేసి ఫోన్ పెట్టేసాడు.

అన్నాడేగానీ, వీడెలా వ్రాసాడో, ఏమి వ్రాసాడోననే కుతూహలంతోనే కావచ్చు.. నా బ్లాగ్ తెరిచినట్లున్నాడు..

ఈ రోజు మొదలెట్టడమే “ఎంతైనా నువ్వో పెద్ద టక్కరి దొంగవిరా” అనేసాడు.. అదేంటి అని నేనడిగేలోపే “నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో” అని తన సినిమా పరిజ్ఞానాన్ని ప్రదర్శించాడు.

ఇక నేరుగా రంగంలోకి దిగిపోతూ –
“పాపం ఆ ప్రభాకరాన్ని ఇంతలా ఏకేశావేంట్రా.. తన కూతురు చనిపోయిందనే బాధతో గుండె ఆగి మరణించాడన్న జాలైనా లేకుండా.. ప్రపంచమంతా అతనంత గొప్ప తండ్రి లేడని, ఫాదర్స్ డేని తను చనిపోయిన రోజుకు బదలాయించాలనీ కోడై కూస్తుంటే ఈ సరికొత్త కోణమేంటి మధ్యలో. నీ లాజిక్కుల మ్యాజిక్‌కి అంతంటూ లేదా..” అని తనకున్న వాగ్దాటిని ప్రదర్శించాడు.

ఎంతైనా వయస్సులో పెద్దవాడు.. పూర్తిగా మాట్లాడనిచ్చానీసారికి.. ముగించాక నేనొకే ప్రశ్న వేసాను..

“నేను వ్రాసినదాంట్లో ఏమైనా అసంబద్ధంగా ఉందా?” – ఆ వైపు నుండి నిశ్శబ్దం..
“వాస్తవదూరం అనిపించిందా?” – ఆ వైపు నుండి చిన్న శబ్దం – “కాదనుకో” అంటూ..

“అనుకో ఏంటి.. కాదు.. మందలో గొర్రెలా ఉండలేకే కదా ఈ అవస్థలు. ఎవడో ఎక్కడో ఏదో చేసి దేనికో చస్తాడు.. అయ్యో పాపం అంటూ ఏ ఒక్క పేపరోడో, టీవీ చానెలోడో మొదలెడతాడు బాకా (చంద్రబాబుకు ఈనాడులా, వైఎస్‌కో, కాంగ్రెస్‌కో సాక్షిలా, మరికొందరికి ఆంధ్రజ్యోతిలా).. ఇంక అంతే… పోలోమంటూ వెంటపడతారు జనం.. చేసిన తప్పులన్నీ గాలికి పోతాయి.. పోయినోళ్లందరూ మంచోళ్లేనంటూ మెట్ట వేదాంతాన్ని వల్లిస్తారు.. జరిగిన అనర్థానికి, తప్పుకు మూలకారణాన్ని వదిలేసి చెత్తంతా మాట్లాడేస్తారు”

భార్యాభర్తల సంబంధం గురించి, మనస్పర్థలతో కాపురాలను చెల్లాచెదురు చేసుకున్న వారి గురించి, అక్రమ సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకున్న వారి గురించి నేనీ బ్లాగ్ వ్రాసిన రోజు రాత్రే బాబాయి ఒక క్లాస్ పీకాడు. గోడకు కొట్టిన బంతిలా నేను ఓ పెద్ద క్లాసే పీకాననుకో.

భార్యకు తెలీకుండా భర్త, భర్తకు తెలీకుండా భార్య ఎన్నో తప్పులు చేస్తుంటారు. పగిలిన అద్దం అతకదు, రగిలిన చిచ్చు ఆరదు అని శోభన్‌బాబు డైలాగులన్నీ వల్లించాడు కూడా. దొరకనన్నాళ్లు ప్రతివాడూ దొరే అని ఆయన రెచ్చిపోయాడు.. ఈ విషయాన్ని పిన్నీకి చెప్పాలి ముందు.. ఆయనేమేమి చేస్తున్నాడో ఏంటో.. 🙂 గురుడు.. ప్లాట్‌ఫామ్ తయారు చేసుకుంటున్నట్లున్నాడు.

నేను ఏదో ఉలిపికట్టె చందాన విడ్డూరంగా ప్రవర్తించాలి, బ్లాగాలి అనే దుగ్ధతో ఆ పోస్ట్ వ్రాయలేదు.. అలాగని ఆ ప్రభాకరం పట్ల  సానుభూతి కురిపించిన వాళ్లను తప్పు పట్టడం లేదు.. ఎవరి అభిప్రాయాలు వారివి..

ఎవరి ప్రభావంతోనో అభిప్రాయాలను మార్చుకోవడం నాకు చేతకాదు. ఓ సంఘటన జరిగిందని చదివినప్పుడో, చూసినప్పుడో దాని మూలాలేంటి అనే విషయాన్ని గాలికి వదిలేయడం చాలా తప్పు. మా మేనేజర్‌లా పక్కనోడి ద్వారా పని చేయిస్తూ, ఇష్టమైన వాడి బుర్రతో ఆలోచిస్తూ గడిపేస్తే ఎలా. స్వంత బుర్రను కూడా ఉపయోగించాలి కదా…

మనం అసలు స్పందించేదే చాలా తక్కువ విషయాలకు..
కొన్ని విషయాలకు తక్షణమే మాటలతోనో, చేతల ద్వారానో స్పందిస్తాం..
చాలా చాలా కొన్ని విషయాలకే మనస్సుతో స్పందిస్తాం..
చాలా విషయాలకు అసలు స్పందించమనుకో.. అసలే స్పీడు యుగం కదా
మనం స్పందనల్లో మునిగి తేలుతుంటే, మరొకడెవడో మనకంటే ముందుకెళ్లిపోతాడనే బెంగ, ఆదుర్దా, భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి..

ఆ స్పందించే కొన్ని విషయాలకు కూడా మరొకడి పంథాలోనే సాగితే ఎందుకు బ్రతుకు…

మా అన్న అర్థం చేసుకున్నట్లున్నాడు..

మరి మీరు??

RTS Perm Link

వైష్ణవి హత్య – మరో కోణం!

వైష్ణవిని చంపింది ఎవరు!?

మామ (సవతి తల్లి సోదరుడు) కాదు, కిరాయి హంతకులు కాదు…

ఇంకెవరు…
మరెవరో కాదు – సాక్షాత్తూ ఆమె తండ్రే..!

ఆ చిన్నారిని ప్రాణప్రదంగా ప్రేమించాడు, ఆ చిన్నారి మరణించందన్న ఘోరమైన వార్త విని తట్టుకోలేక చనిపోయాడు అని అందరూ సానుభూతి కురిపిస్తున్న ఆమె తండ్రే..

నమ్మ(లే)కపోయినా అదే నిజం.

ఒకామెని పెళ్లి చేసుకుని, ఆమె ద్వారా ఓ బిడ్డను కూడా కని ఆపై మరొక స్త్రీపై (వ్యామోహంతోనో, ప్రేమతోనో – అది ప్రస్తుతానికి అప్రస్తుతం) మనసుపడి ఆమెనూ వివాహం చేసుకుని పిల్లలను కని, అంతటితో ఆగకుండా అసలు ఆ మొదటి భార్య ఊసే పట్టించుకోకుండా ఆమె ముఖం చూడకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ప్రభాకరే పరోక్షంగా ఈ దారుణానికి కారకుడు.

ఈ తప్పులన్నింటితో పాటు అతను మరికొన్ని తప్పులు చేసాడు..

కుటుంబం పరువు కోసమో ఏమో గానీ తనకెవరూ శత్రువుల్లేరంటూనే కాలయాపన చేసాడు. ఒకవేళ ఆ చిన్నారి మొదటిసారి అపహరణకు గురైనప్పుడే తగిన సమాచారం అందించి ఉంటే అప్పుడే ఈ నిందితులు శిక్షించబడి ఉంటే.. .. పోనీ, ఈ దఫా అయిన పోలీసులతో అతను సరిగ్గా సహకరించాడా అంటే అదీ లేదు.

బహుశా తన చిన్నారి అపహరణకు గురైన రెండ్రోజులు తాను చేసిన తప్పులను సమీక్షించుకున్న అతని గుండె తట్టుకోలేకపోయిందేమో.. ఆ చిన్నారినే చేరుకునేందుకు ప్రభాకరాన్ని సిద్ధం చేసేసింది.

ఈ వైష్ణవి ఉదంతం పెళ్లయ్యినప్పటికీ పరస్త్రీలపై మోజు పడే ప్రభాకరం లాంటి ప్రతి పురుషుడికి గుణపాఠంగా మిగిలిపోతుంది..
పెళ్లయ్యి, అందునా పిల్లలున్న ఓ పురుషుడి పట్ల ఆకర్షితురాలు కాకుండా ప్రతి స్త్రీకి పీడకలగా మిగిలిపోతుంది..

తమ ఇంట అల్లారుముద్దుగా పెరిగిన సోదరి లేదా ఆమె సంతానం ఎక్కడ దిక్కులేనివారైపోతారోననే భయం, అభద్రతాభావం కారణంగానే కావచ్చు వెంకట్రావ్ అతి నీచమైన ఓ దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేయడానికి సిద్ధపడినవాడు తన అక్కను వదిలి మరొక స్త్రీని ప్రభాకరం పెళ్లి చేసుకున్నాడన్న నిజం తెలిసిన వెంటనే తన బావనే హత్య చేసి ఉండవచ్చు. అప్పుడు అతను చేసిన హత్య పట్ల ఇంత వ్యతిరేక భావం ప్రజల్లో కూడా ఏర్పడి ఉండకపోవచ్చు. కాదు.. తన అక్క సౌభాగ్యాన్ని తన చేతులారా చెరపలేకపోయాడనుకుంటే…. పెళ్లయ్యి, పిల్లలున్న ఓ పురుషుడిని ఆకర్షించిన లేదా అతని పట్ల ఆకర్షితురాలైన ఆ స్త్రీనే హత్య చేసి ఉండాల్సింది. అతడిని ఆమె నిజంగానే ప్రేమించి ఉండవచ్చు.. లేదా అతని మాయమాటలకు వంచించబడి ఆపై మరొక దారి లేక అతనితోనే జీవనం సాగిస్తూ ఉండవచ్చు.. లేదా ఆస్థి కోసం పన్నాగం పన్ని అతడినే వలలో వేసుకుని ఉండవచ్చు కూడా.

ఏది ఏమైనా ఇక్కడ అన్ని సందర్భాల్లోనూ నష్టపోతుండేది స్త్రీయే.
కాకపోతే వాళ్ల పేర్లు, సంఘంలో వాళ్ల హోదాలే వేర్వేరుగా ఉంటాయి..
ఒకరు మొదటి భార్య, మరొకరు రెండవ భార్య.

హత్యలు ఎలా చేయాలో, ఎవరిని చేయాలో, చేస్తే ఏ కారణాలతో చేయాలి అని బోధించడమో ఈ పోస్ట్ సారాంశం కాదు.

పెద్దలు చేసిన తప్పులకు పిల్లలను దండించకండి అనే..
ఆస్థుల కోసం అన్నెం పున్నెం ఎరుగని పసిమొగ్గలను తుంచెయ్యకండి అనే..

RTS Perm Link

RTSMirror Powered by JalleDa

css.php