Archive for December 29th, 2009

తెలంగాణా విభజన – ఆత్మహత్యా సదృశమే!!

మిత్రులు రాజుగారు commented – “తెలంగాణాను దోచుకునేందుకు..!” on December 29th, 2009 –

సినీ రంగంలో దాదాపు 20 సంవత్సరాలు వెకిలి కామెడీలు చేసిన ఆలిండియా అందగాడు బాబూమోహన్ మీకు గుర్తున్నాడా? కొడుకు హఠాన్మరణంతో అతని వెండితెర జీవితం ఒక్కసారిగా కుదేలైపోయింది. మరో కొడుకుతో తీసిన సినిమా కూడా తూతూమంత్రంగా చీదేసేటప్పటికీ అతను ఒక సరిక్రొత్త వివాదానికి తెరతీసాడు… – ఏమని.. తాను “దళితుడు” అయినందువల్లనే దర్శక నిర్మాతలు తనతో వెకిలి కామెడీలు చేయించారని, గాడిదకు తాళి కట్టే సీన్లు, కాలితో తన్నించుకునే సీన్లను తనపై చేసారని పెద్ద దుమారమే రేపాడు. (ఇంచుమించు ఆ సమయంలోనే స్వర్గీయ శోభన్‌బాబు గురించి మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చకెక్కాడనుకోండి..)

ఈ సమయానికే తెలంగాణా రామాయణంలో బాబూమోహన్ పిడకలవేట ఏమిటనే సందేహం మీకొచ్చే ఉంటుంది..

తెలంగాణావాదుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే సందర్భాలు, సంఘటనలు సంభవించినప్పుడే వాటిని ఎదుర్కొనే తీరులో ఎదుర్కొని ఉంటే సమస్యకు అంతిమ పరిష్కారం విడిపోవడం అనేది అయ్యి ఉండేది కాదు. ఇన్ని దశాబ్దాలుగా దాన్ని నాన్చి, నాన్చి ఇక్కడ వరకు తెచ్చారు. అంతెందుకు – మన పొరుగున ఉండే తమిళనాడులో ప్రముఖ హీరో విజయ్ నటించిన ఓ సినిమాలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలున్నాయని అక్కడి న్యాయవాదులందరూ రచ్చకెక్కారు. ఆ హీరో క్షమాపణలు చెప్పాడనుకోండి. ఆ తర్వాత అలాంటి సన్నివేశాలను చిత్రీకరించేందుకు మిగతావారు వెనుకడుగు వేసారు, వేస్తారు కూడా. అంతేగానీ, ఇలాంటి సంఘటనలను తక్షణమే స్పందించకుండా దాని గురించే ఓ 40, 50 ఏళ్లు ఆలోచిస్తూ ఉపేక్షించడం తప్పని మాత్రమే నా భావన. వీటన్నింటికీ పరిష్కారంగా ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టడం అని వాదించడం సరికాదు కదా.

మన బాబూమోహన్‌నే చూడండి – వేషాలు వచ్చినన్ని రోజులూ చేసాడు, సంపాదించాడు, చక్కగా స్థిరపడ్డాడు. గతంలో అతను ఇలాంటి వేషాలు నేను చేయను అంటూ వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయా? అవసరార్థం, స్వప్రయోజనార్థం అప్పుడు ఒప్పేసుకుని, చేసేసి ఇప్పుడేమో “దళిత” మాస్క్ వేసుకుని ప్రకటనలు గుప్పించేయడం సరి కాదు.

ఇప్పుడేమో మన ఓయూ విద్యార్థులు, తెలంగాణా వేర్పాటువాదులు అందరూ నిరాహార దీక్షలు చేస్తున్నారు – దేని కోసం.. రాష్ట్రాన్ని విడగొట్టమని. అంతేగానీ, వీళ్లల్లో ఏ ఒక్కరైనా, ఎప్పుడైనా మా కోసం ఒక డ్యామ్ కట్టండి, మా కోసం ఒక ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయండి, మా ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టండి అని ఎప్పుడైనా దీక్షలు చేసినట్లు చరిత్ర ఉందా? (ఇది తెలంగాణాకే కాదు, యావద్భారతానికి వర్తిస్తుంది..) విడిపోవడం సమస్యలకు పరిష్కారమా? చేతనైతే అలాంటి దీక్షలు చేపట్టమనండి. అప్పుడు మనస్సుండే ప్రతి తెలుగువాడూ వాళ్ల దీక్షకు సంఘీభావం ప్రకటిస్తారు. కాదని మీరు, మరొకరు వ్యతిరేకించగలరా?

మీరన్నట్లు – తెలంగాణా ఆత్మగౌరవార్థం ప్రత్యేక రాష్ట్రాన్ని మంజూరు చేసారనే అనుకుందాం.. అప్పుడు సినిమాల్లో వాళ్ల యాసను కించపరిచే సన్నివేశాలుండవని ఎవరైనా హామీనివ్వగలరా? ఇప్పటికీ మన తమిళ సినిమాల్లో తెలుగు భాష, యాసతో పాటు అక్షరాలను సైతం కించపరుస్తూనే ఉంటారే – జిలేబీలు చుట్టినట్లుగా గందరగోళంగా ఉంటాయని.. తమిళనాడు నుండి మనం విడిపోయి ఎన్ని సంవత్సరాలు గడిచాయి మరి?

మీ వ్యాఖ్యలో –
1. ‘మీ నాయకుల చేతకానితనాన్ని మీరు ప్రశ్నించరెందుకు’ అంటూ వారిని దెప్పడం సమస్యకు పరిష్కారం కానేకాదు.
2. తెలంగాణాలో నిజమైన బాధితుల సమస్యను పట్టించుకోకుండా కేవలం అక్కడి రాజకీయ నేతల స్వార్థం మీద మాత్రమే బాణం ఎక్కుపెడితే మరింత ఆవేశకావేషాలు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఒరగదు.

మొదటిదానికి నా జవాబు –
ఇప్పుడు తెలంగాణాను విడగొట్టడానికి చేతులు కలిపిన నాయకుల్లో ఎన్నో ఏళ్లు ఎన్నో హోదాల్లో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పదవులు వెలగబెట్టిన వారున్నారు. వారు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంత కృషి చేసారు.. అలాంటి వారి దొంగ దీక్షలకు తలొగ్గి ఇప్పుడు తెలంగాణా అనే ప్రాంతాన్ని విడగొడితే ఆ ప్రాంతాన్ని వీరు అభివృద్ధి చేయగలరా? అసలు ఆ నాయకులకు తెలంగాణా ఇమ్మని అడిగే నైతిక హక్కు ఉందా?

అక్కడి అక్షరాస్యతా శాతం ఎంత? పన్నుల రూపంలో లభించే ఆదాయమెంత? అక్కడి సగటు జీవి తలసరి ఆదాయమెంత? తెలంగాణా ఇచ్చేస్తే రాత్రికి రాత్రి అల్లా ఉద్దీన్ కథలోలా ఏమైనా అద్భుతాలు జరిగిపోతాయా?

జల వనరులను వినియోగించుకోవడానికి రోడ్ల మీద గోడలు కట్టినట్లు ప్రాజెక్టులు కట్టెయ్యలేరుగా? ఆ అనుమతులను వారు పొందగలరా? పొందగలిగితే అదేదో కలిసి ఉండే చేసుకోవచ్చుగా. అందుకే మీ నాయకులను ప్రశ్నించండి అని నేను వారికి వారు మర్చిపోయిన వాళ్ల హక్కును గుర్తుచేసానే తప్ప దెప్పలేదు, దెప్పను, దెప్పడం నా అభిమతం కాదు.

ఇక రెండోది –
నా మొత్తం బ్లాగ్ పోస్ట్ సారాంశం అదే మహాశయా.. నిజమైన బాధితుల సమస్యలను పట్టించుకోండి అనే. నీతిమాలిన రాజకీయులను నమ్మి మోసపోవద్దనే. బాధితుల సమస్యలను పట్టించుకోవడమంటే రాష్ట్ర విభజనకు సై అనడం కాదు కదా. అక్కడ సర్వతోముఖాభివృద్ధికి బీజాలు వేయమనే కానీ కపట దీక్షలకు పొంగిపోయో, లొంగిపోయో అనవసర ఆవేశాలకు లోనయ్యో ప్రాణాలు తీసుకోవద్దనే.. అభివృద్ధిపరచమని అడిగేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది, ఆత్మగౌరవానికి భంగం కలిగితే తిరగబడే హక్కూ ఉంది, కానీ – విడిపోవడమే పరిష్కారమా..?

తెలంగాణాను విడగొట్టడమనేది నూటికి నూరు శాతం ఆత్మహత్యా సదృశమే తప్ప మరొకటి కానే కాదు…!

మీ స్పందనకు నా ప్రతిస్పందన సముచిత రీతిలో ఉందనే భావిస్తూ..

RTS Perm Link

RTSMirror Powered by JalleDa

css.php