Archive for December 28th, 2009

తెలంగాణాను దోచుకునేందుకు..!

Telangana

 

మిత్రుడు KRISHNAMRAJU commented – “ఆంధ్ర రాష్ట్ర విభజనకు నిరసనగా..” on December 27th, 2009

మీ ఘాటు స్పందనకు అంతే ఘాటుగా నేనూ స్పందించగలను మిత్రమా.. కానీ మీకు నాకు ఉండే తేడా సభ్యతే కాబట్టి మర్యాదపూర్వకంగానే స్పందిస్తున్నాను!

మీరు ఇందులో పరాన్న జీవులు, నాటక రంగ పెద్దలు వంటి చాలా ఆరోపణలే చేసారు..

సరే – “హైదరాబాద్ లేకుండా తెలంగాణా అడిగితే” అని అంటున్నారుగా.. అసలు హైదరాబాద్‌ను అంతలా అభివృద్ధి పరచకపోయి ఉండి ఉంటే మీరు ఏ ధైర్యంతో ప్రత్యేక తెలంగాణా అడిగేవారని ప్రశ్నిస్తే మీ సమాధానమేంటి?

ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, అదిలాబాదు, మెదక్ , హైదరాబాదు అనే జాబితాలో కాసేపు హైదరాబాద్ అనే పేరును తొలగిస్తే ఏమవుతుంది?

నాకు ముల్కీ కమీషన్, 610 జివో గురించి తెలియదనుకుందాం..

మీకు పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలుసా… మీ ప్రాంత నాయకులు తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మీ భవిష్యత్తును ఎలా పణంగా పెట్టారో తెలుసా? “తెలంగాణా ఇవ్వకపోతే ప్రతి తెలంగాణా వాడు ఒక మానవ బాంబ్ అవుతాడు” అనే దమ్మున్న మీరో, మరొకరో ఆ నాయకుల కాలర్ పట్టుకుని ప్రశ్నించలేకపోయారే? ఎవరు పరాన్న జీవులు. పదవుల మోహంలో, అమాయక ప్రజలనే సమిధలుగా చేసే యజ్ఞంలో బలిపశువులు అవుతుండేది మీరు కాదా?

పెద్ద మనుషుల ఒప్పందం – మీ కోసం – ఇదిగో:

1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి – కోస్తా, రాయలసీమ, తెలంగాణా – అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19న ఒక ఒప్పందానికి వచ్చారు. దీనినే “పెద్దమనుషుల ఒప్పందం” అన్నారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:

1. కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి
2. తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్ధులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.
3. సివిల్ సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
4. ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగంలోనూ ఉర్దూ వినియోగం కొనసాగాలి.
5. రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.
6. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.
7. తెలంగాణాలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.
8. తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.
9. కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.

ఈ ఒప్పందం తరువాత తెలంగాణా నాయకులలో ఉన్న సందేహాలు తొలగి, ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

దీన్ని బట్టి మీకేం అర్థమవుతోంది?? ముఖ్యమంత్రి పదవితోనో, ఉప ముఖ్యమంత్రి పదవితోనో మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన వెసులుబాటును ఆనాటి పెద్దలు మీకు ఇచ్చారు. కానీ మీ ప్రాంత నాయకులు ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని పొందగలిగారా? పోనీ, దాన్ని ఉల్లంఘించిన ఆంధ్ర నేతలు ఇన్నేళ్లుగా ఉప ముఖ్యమంత్రి పదవి కాకపోయినా, తత్సమాన హోదా ఉండే హోం మంత్రి పదవిని మీ ప్రాంత నాయకులకేగా కట్టబెట్టారు. జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మీ ప్రాంత నాయకులేగా? అంతెందుకు… –

ఇప్పటి కెసిఆర్ గారు తెదేపాను వీడి, తెరాసను స్థాపించింది ఎప్పుడు? నారావారి క్యాబినెట్‌లో పదవిని ఆశించి భంగపడినప్పుడు కాదా? అప్పటిదాకా చెంచాగిరీ చేసిన కెసిఆర్‌కు పదవి రాకపోయేసరికి అకస్మాత్తుగా ప్రత్యేక రాష్ట్ర సాధన గుర్తుకొచ్చేసిందా? మొన్నటికి మొన్న కార్మిక శాఖా అమాత్యులుగా ఆయన మీ ప్రాంతానికి ఏమి వెలగబెట్టాడో మీరు వివరించగలరా?

చెన్నారెడ్డి”గారు” మీకు గుర్తున్నారా? ప్రత్యేక రాష్ట్రం కోసం స్థాపించిన “తెలంగాణా ప్రజా సమితి”ని ఆయనే 1971లో ఎందుకు రద్దు చేసారో తమరు సెలవివ్వగలరా? పోనీ, ఆయన రాష్ట్ర సాధన అనే తపన అంతా తత్ఫలితంగా పొందిన ముఖ్యమంత్రి పదవితో అటకెక్కేసిందనే నిజం గుర్తుందా? పోనీ, ఇందిరా పార్క్‌లోని సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెళ్లి అడిగి చూడండి – రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణాకు నువ్వు ఏం చేసావని? ఇప్పుడేమో ఈ కెసిఆర్, జెఎసి అంటూ ప్రాంతీయవాదాన్ని పట్టుకుని వేలాడుతున్నారు.

ఒక్కసారి – ఆ 10 జిల్లాలు తెలంగాణా పేరుతో విడిపోయాయా.. పుత్రుల్లారా – గుర్తెట్టుకోండి.. అప్పుడు జరిగే పదవుల పందేరంలో, కుహనా రాజకీయవాదుల విశృంఖల రాక్షస మాయలో తెలంగాణా ప్రాంతం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అప్పుడు నెత్తీనోరు లబలబలాడించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు మీరు, మీలోని ప్రతి ఒక్కరూ మీ భావి తరాలకు జవాబుదారీ అవుతారు.

“అనవసరంగా ఆవేశపడకు. అన్నీ తెలుసుకుని కామెంట్ చెయ్యి” అని నాకు హితబోధ చేసావ్ సోదరా.. మంచిదే.. కానీ నువ్వు ఆవేశపడుతున్నావుగా.. ఆ ఆవేశాన్ని సరైన దిశలో, సరైన మార్గానికి మళ్లించు.. వెళ్లి ఆ కెసిఆర్, జెఎసి నాయకులను కాలర్ పట్టుకుని ప్రశ్నించు.. ఇన్ని రోజులుగా మీరు ఊడబొడిచింది (సంస్కారం కానప్పటికీ, ఇన్నిసార్లు కెసిఆర్, కెసిఆర్ అని జపం చేసేటప్పటికీ అతని పదజాలం నాకూ వచ్చేస్తోంది..) ఏమిటి అని! ఇప్పుడు తెలంగాణా అనే రాష్ట్రం ఏర్పడితే మీ పాలన పంథా ఏమిటి అని.

అప్పుడు కెసిఆర్ ఇలా అంటాడు — (“బాబా” సినిమాలోలా)
“ప్రతి ఐదేళ్లకోసారి ఎలక్షన్ల పేరతో బోలెడు ప్రజాధనం వృథా అయిపోతోంది. మనదసలే వెనుకబడిన ప్రాంతం. ఇహ ఇప్పుడిప్పుడే మనల్ని మనం అభివృద్ధిపరచుకోవాలి. కాబట్టి ముందుగా నేను, నా తర్వాత నా కొడుకు కెటిఆర్, ఆ తర్వాత వాడి కొడుకు ఇలా వారసత్వ పాలనను తిరిగి అమలు చేస్తే.. ఎలక్షన్లకు ఖర్చు చేసే ధనాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించవచ్చు” – అని..

చివరిగా – ఆలస్యం అమృతం విషం అనేది అన్ని సందర్భాల్లోనూ వర్తించదు. నిదానమే ప్రధానం అని కూడా గుర్తుంచుకోండి! మిమ్మల్ని దోచుకునేందుకు ఇతర ప్రాంతాల వాళ్లే అవసరం లేదు, మీ ఆవేశం అనే బలహీనతను అడ్డుపెట్టుకునే మీ ప్రాంత నాయకులే చాలు..

RTS Perm Link

RTSMirror Powered by JalleDa

css.php