“రాఖీ” చెల్లెమ్మలు – (రక)రకాలు!!

sree-1

కొన్ని దశాబ్దాల క్రితం కేవలం ఉత్తరాదికే పరిమితమైన రక్షా బంధన్ కొన్నేళ్లుగా దేశం మొత్తం ప్రాచుర్యం పొందింది. కొరియర్లు, ఆన్‌లైన్ షాపింగులు వచ్చాక నేరుగా వెళ్లి రాఖీ కట్టాల్సిన అవసరమేమీ లేదు. ఒక్క క్లిక్‌తో నేరుగా సోదరుల చేతుల్లోకే రాఖీలు బట్వాడా అయిపోతాయి. ఎలాగూ మొబైళ్లలో శుభాకాంక్షలు అందిపోతాయనుకోండి. అది వేరే విషయం.

ఈ రాఖీల్లో పలు రకాలు, డిజైన్‌లు ఉన్నట్లే, రాఖీలు కట్టే చెల్లెమ్మల్లోనూ విభిన్నమైన మనస్తత్వాలు స్వంతం చేసుకున్న వారూ ఉంటారు.

మొదటి రకం – (సావిత్రమ్మలు)
వీళ్లు తోబుట్టువులకే (అంటే స్వంత అన్న గానీ, స్వంత తమ్ముడు గానీ కావచ్చు) పరిమితం అవుతుంటారు. తమకు తోచిన తరహాలో రాఖీ కట్టేసి, మిగతా రోజుల్లో ఎలాంటి గిల్లికజ్జాలు పెట్టుకున్నా ఆ రోజు మాత్రం పెద్దమనుష్యుల తరహాలో త్యాగాలు చేసేస్తూ ఉంటారు. చివరాఖరికి, వాళ్లకిష్టమైన టీవీ సీరియళ్లను కూడా తమ్ముడి క్రికెట్ ప్రేమకు బలిచ్చేస్తారు. ఈ బంధాన్ని చూసి ఆ రోజు వాళ్లమ్మగారికి సీరియల్ చూడకుండానే కన్నీళ్లు కారిపోతాయనుకోండి.

రెండవ రకం – (విశాల’క్షమ్మలు)
వీరు మొదట ఇంట్లో తోబుట్టువుల తంతు ముగించేసి, త్వరత్వరగా పిన్ని, పెద్దమ్మల ఇంటికి ప్రయాణమైపోతారు. కొండొకచో, ఇంట్లో వారి మీద కంటే ఆ పెద్దమ్మ కొడుకో, పిన్నమ్మ కొడుకో అంటేనే బోలెడు ప్రేమ కురిపిస్తారు. “దూరపు కొండలు నునుపు కదా” అందుకన్నమాట. ఆ సోదరుడితో వీరికి తగాదాలు, పేజీల కొద్దీ పేచీలు ఉండనే ఉండవు. వారికి వీరికి అసలు లావాదేవీలు ఉంటేనే కదా, సమస్యలు రావడానికి. తల్లిదండ్రుల ప్రేమ నుండి అన్నింట్లోనూ వాటా కాజేసే స్వంత సోదరుల కంటే, ఎప్పుడో కనిపించి బోలెడు అభిమానం కురిపించి, ఆ జల్లులో తడిసి ముద్దయిపోయిన సోదరి తల తుడుచుకునేలోపే మాయమైపోయే సోదరుడంటేనే ఎక్కువ ఆప్యాయత కనబర్చడంలో తప్పేమీ లేదు కూడా.

sree-2

మూడవ రకం – (సాంఘిక చెల్లెమ్మలు)
వీరు ఇంట గెలిచి, రచ్చ గెలుస్తుంటారు. రాఖీ కట్టేందుకు వీరికి, వారు వీరు అనే తేడా ఏమీ ఉండదు. అన్న అని పిలిపించుకున్న పాపానికి ఆ రోజు ఆ సోకాల్డ్ బ్రదర్లకి చేతి చమురు వదలకా తప్పదు. ఇదెక్కడి తంటారా బాబూ అనుకుంటూనే మొహాన మాంచి గిల్టు నవ్వు పులుముకుని చెల్లెమ్మకు బహుమతులు, కానుకలు సమర్పించుకుంటుంటారు. ఆ తర్వాత రోజు వీళ్లకి ఆ చెల్లెమ్మలు కనిపించరనుకోండి. ఇవి ఇన్‌స్టంట్ సోదరీమణుల వర్గం అన్నమాట.

నాల్గవ రకం – (తెలివైన చెల్లెమ్మలు)
ప్రతి కాలేజీలో ఎవడో ఒక బండ వెధవ తగలడతాడు. తనకు తానే ఓ షారూఖ్, సల్మాన్ అని ఊహించేసుకుని ఆ కాలేజీ బ్యూటీ వెంటపడి, కవిత్వాలు వినిపించేస్తుంటాడు. ఆ కవిత్వాల గోల వదిలించుకునేందుకు ఆ బ్యూటీ కాస్తా ఉదయాన్నే మనోడి ఇంటి బెల్లు కొట్టి మరీ రాఖీ కట్టేసి, వాళ్లమ్మ చేతి ఫిల్టర్ కాఫీ తాగేసి ఆ మరుసటి రోజు నుండి స్వేచ్ఛా వాయువులు పీల్చేసుకుంటూ కాలేజీలకు పోతుంటారు. ఎలాగూ ఇంటిదాకా వచ్చి రాఖీ కట్టాక మన హీరోగారు కూడా మరో బ్యూటీ కోసం దేవులాడతాడనుకోండి. మరో రాఖీ పండుగలోపే ఆ వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటాడు, లేదా ఆ ఒక్కరోజు ఏ అండమాన్‌కో పారిపోతాడు.

sree-31

ఐదవ రకం – (రాజకీయ చెల్లెమ్మలు)
వీరి కేరాఫ్ అడ్రస్ అసెంబ్లీ. సమావేశాల్లోనూ, న్యూస్ ఛానెళ్లలోనూ దుమ్మెత్తిపోసుకుంటూనే ఆఫ్‌లైన్‌లో అన్నా, తమ్మీ అంటూ ఆప్యాయతానురాగాలు కురిపించేస్తారు. ఆమె ఏ పార్టీలో ఉన్నా నాకు చెల్లెమ్మే అని ఓ అన్న ఆపరేషన్ ఆకర్షకు తెరదీస్తే, ఆయన ఎంత వెధవైనా (అధికారంలో లేడుగా మరి) నన్ను స్వంత చెల్లెమ్మలా చూసుకుంటాడు అని ఈ చెల్లెమ్మ గారాలు పోతుంది. మన కేసీఆర్, లేడీ సూపర్ స్టార్ ఇలాంటి ఘనతను స్వంతం చేసుకున్న ప్రముఖుల్లో ఉన్నారు.

ఆరవ రకం – (అవసరార్థ చెల్లెమ్మలు)
రాఖీ పండుగ రోజున అధికార పార్టీ కార్యాలయంలో గానీ, అధికారంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీల ఇంటి ముందుగానీ చూస్తే తెలిసిపోతుంది వీరి గురించి. ఇంకా కావాలంటే, రిటైర్ కాని టాప్ పొజిషన్‌లోని ప్రభుత్వాధికారుల గుమ్మాల్లో కూడా పడిగాపులు పడే చెల్లెమ్మలు ఈ కోవలోకి వస్తారు. వీరు ఈ రోజు రాఖీ కట్టారంటే రేపు వారికి మీతో ఏదో అవసరం ఉందన్నమాటే. ఈ చెల్లెమ్మలు రిటైర్ అయిపోయిన గత ఏడాది అన్నయ్యలను పట్టించుకోరు. “అవసరార్థం ఇదం రాఖీ” అన్నమాట.

కాస్తా ఆగండి…
కాలింగ్ బెల్ మోగుతోంది..

ఏ రకం చెల్లెమ్మో ఏంటో.. మళ్లీ కలుద్దాం..

RTS Perm Link

2 Comments so far

 1. మధురవాణి on August 5th, 2009

  బావున్నాయండీ మీ కేటగిరీలు 🙂
  నేను మాత్రం మీరు చెప్పిన ఏ కేటగిరీలోకీ రావట్లేదు…ఇవేవీ కాకుండా సాధారణ అక్కయ్యలు అని ఒకటి పెడితే అందులో వస్తానేమో 😉
  తమ్ముడు చిన్నోడు కదా అని నేనెప్పుడూ గిఫ్టులు అడగనండీ.. వీలైతే నేనే ఇస్తుంటాను 🙂

 2. కారుణ్య on August 5th, 2009

  మధురవాణిగారి వ్యాఖ్యతో ఆమోదిస్తూ…

  నేను కూడా మా తమ్ముళ్లను ఏమీ అడగనండి. అలాంటిది ఈరోజు మా పెద్దాడిని ఏమిస్తున్నావురా అని అడిగితే, ఏదైనా ఉద్యోగం రానియక్కా అన్నాడు. ఏదో సరదాకు అడిగానంతేలేరా అన్నా…!

  అయినా , నా ఇద్దరు తమ్ముళ్లనే పెద్ద బహుమతిగా భావిస్తుంటానెప్పుడూ…!! 🙂

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php