శైవక్షేత్రంలో కాంగీయుల తిరుగుబాటు..

Election Special

Election Special

చిత్తూరు జిల్లాలో అదొక చిన్న అసెంబ్లీ నియోజకవర్గం.

అక్కడ దాదాపు ఇరవయ్యేళ్లుగా నిరవధికంగా తెదేపా అభ్యర్థినే విజయం వరిస్తుండేది. అతని బలమైన సామాజిక వర్గంతో పాటు, చంద్రబాబుతో ఉన్న అత్యంత సాన్నిహిత్యం మూలంగా అతను గెలిస్తే క్యాబినెట్ మంత్రి కూడా అవుతాడు కనుక, తద్వారా మరిన్ని ‘ప్రయో’జనాలను పొందవచ్చు కనుక ప్రజలు గుడ్డిగా అతడికే ఓట్లు గుద్దేవారు.

కానీ, ఆ పెద్దాయన సంవత్సరంలో 300 రోజులూ భాగ్యనగరంలో తిష్ట వేసి, ఇక్కడి ప్రజల గోడును పట్టించుకునేవాడు కాదు. ఆ ఊరిలో అతన్ని ఓడించే సత్తా మరొక ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌కు లేకపోయింది. మనోడికి ఎదురులేకపోయింది. ఆటోమేటిక్‌గా కళ్లు అతని బట్టతలపైనెక్కి కూర్చున్నాయి.

అదే తేదేపాలో మరొక బలమైన సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుండేవాడు. ఆర్థికంగానూ బలమైనవాడు కావడంతో పార్టీలో చేరిన కొన్ని రోజుల్లోనే రాష్ట్రస్థాయి నేతగా ఎదిగాడు. ఓ శుభముహూర్తాన పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డాడు. ఖేల్ ఖతం.. జెండా, కండువా రెండూ మార్చేశాడు. అతగాడి వైఖరితో మొహం మొత్తిన జనం ఇతనికి పట్టం కట్టారు.

ఇదంతా ఎందుకంటే –

కాంగ్రెస్ పార్టీలో అన్ని సంవత్సరాలుగా ఉన్నవారెవ్వరూ అతనిపై గెలవలేకపోయారు.
జిల్లాలో ఏ చిన్న పదవిని అనుభవించలేకపోయారు.
రాబడి, పరపతి రెండూ లేకపోవడంతో ఇతనికి జైకొట్టేసారు.

తిరుగుబాటు నాయకునికి అధికారం చేజిక్కగానే, అందరినీ చక్కగానే గమనించాడు. పదవ తరగతి తప్పి, పొట్టకూటి కోసం కేబుల్ వైర్లు చుట్టుకునే ఓ స్థానిక ‘నేతన్న’కు ఆ ఊరి గుడిని రాసిచ్చేసాడు. తన స్వంత లోకల్ ఛానెల్‌లో అతి శ్రద్ధాభక్తులతో పదవులు నిర్వర్తించిన మరొక ముఖ్యడికి పార్టీ పదవిని కానుకిచ్చేసాడు. అయినవారికి అందరికీ తాను తినగా మిగిలినది అంతో ఇంతో విదిల్చేవాడు.

కథ సాఫీగా జరిగితే ఇక వింతేముంది..

ఎదిగేకొద్దీ ఒదగమని పెద్దలు చెప్పారు గానీ, అది రాజకీయాల్లో పనికిరాదుగా. అడ్డమొచ్చినవాడిని, ముందున్నవాడినీ తొక్కుకుంటూ, తన్నుకుంటూ దూసుకెళ్లిపోకుంటే వెనుకే ఉండిపోతారు మరి. కాసింత పలుకుబడి రాగానే, కేబుల్ వైర్లోడికి ఆశ పుట్టింది. గుడికి వచ్చే కొందరు పెద్దలతో తెర వెనుక రాజకీయాలు నెరిపి, వారసత్వాలకు పెట్టింది పేరు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో శక్తివంతమైన యువనేతగా ఎదిగిన ఓ పత్రికాధిపతి(??)కి దగ్గరైపోయాడు.

ఇంతటికీ కారణం ఆ గుడి, ఈ తిరుగుబాటు ఎమ్మెల్యే పెట్టిన ఛైర్మన్‌గిరీ అనే భిక్ష.

అంతే ఇక చూస్కోండి.. నేను సైతం అంటూ టిక్కెట్ కోసం ఎగబడ్డాడు. ఇతనికి తోడు ఓ బేరాల్లేని డాక్టరు. గతంలో వీరిద్దరూ ఆ గుడి పదవి కోసం పోటీ పడ్డారు, దాదాపు వీధి పోరాటలకూ దిగారు. గుడి పదవే దక్కని ఆ పెద్ద డాక్టరు, ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్‌నే ఆశిస్తున్నాడు ఇప్పుడు. అతను, ఇతను ఏకమైపోయి ప్రస్తుత ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించేస్తూ ఓట్లను చీల్చి, ఉన్నది కాస్తా ఊడగొట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కొసమెరుపు:
స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగిన ఎన్నికల్లో గెలుపు కోసం వీరపాట్లు పడిన ఔత్సాహిక యువనేత ఒకరున్నారు. ఇతగాడి పుణ్యమా అని, అప్పటి నుంచి ఆ కాలేజీలో ఎన్నికలే బందైపోయాయి. ఇప్పటికి కూడా.. చాన్నాళ్ల క్రితమే పొట్టకూటి కోసం కర్ణాటకలో సెటిలైపోయిన ఆ పెద్దమనిషి ఇప్పుడు మళ్లీ స్వంత ఊరిలో పార్టీ అభి’వృద్ధి’ పనులు చేపట్టేస్తూ, సంక్షేమ కార్యక్రమాలకు, పీడిత తాడిత, అణగారిన వర్గాలకు దగ్గరైపోతున్నాననే భ్రమలో కొట్టుకుంటున్నాడు. ఈయన కూడా కాంగీయుడే. టిక్కెట్ కోసం ముచ్చటపడుతున్నవాడే. ఈయన అభిమానులెవరో, ఎంతమందో తెలియదుగానీ, వారి కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించేసాడు.

ఇవన్నీ చూడబోతే, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించడానికి గతంలో ఓడిపోయిన తెదేపా పెద్ద మనిషే తెర వెనుక ఉండి వీళ్లని పురికొల్పుతున్నాడని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు..

మరి మీరు??!

RTS Perm Link

5 Comments so far

 1. ఓ పీడితుడు on March 28th, 2009

  వేరే అనుకోవడానికేముందీ… ఊసరవెల్లులు ఇదివరకు అడవిలో ఉండేవి. ఇప్పుడు ఏకంగా రాజకీయాలలో తిష్ట వేశాయి.

 2. vasudevan on April 10th, 2009

  i think this is purely single sided judgement

 3. sree on April 12th, 2009

  అయ్యా.. దేన్ని మీరు ఏకపక్ష నిర్ణయం అంటున్నారో నాకు బోధపడటం లేదు. తెదేపా పెద్దమనిషికి కళ్లు నెత్తికెక్కాయి అని వ్యాఖ్యానించాను.. ఆ పార్టీలోంచి టికెట్టు కోసం మరో పెద్దమనిషి కాంగ్రెసులోకి దూకేసి కండువాని, జెండాని మార్చేసాడని తేల్చేసాను..

  ఇక “గుడి” మాజీ ఛైర్మన్ గురించే మీ ఆవేదన అని నేనర్థం చేసుకోగలను…

  నేటి కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో అసలు ఎలాంటి నీతికి కట్టుబడని కొందరు పెద్దల గురించి మనమిరువురం ఒకరిపై ఒకరం కత్తులు దూసుకోవడం అనవసరం అని భావించి, నేను ఈ అంశాన్ని ఇక్కడితో ముగించదల్చుకున్నాను.

  ఏమైనప్పటికీ, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లడించినందుకు ధన్యవాదాలు సోదరా…

 4. పేర్లుకూడా జెప్పేసుంటే ఒక పనైపోయేది గదా!

 5. sree on April 12th, 2009

  గుప్పిట తెరిచి చూపించేస్తే ఇక మజా ఏముంటుంది మిత్రమా..

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php