నా రైలు వెళ్లిపోయింది…!

sreecharitham

కావాలని నేనెప్పుడూ ఏదీ చేయలేదు..

(అది చదువైనా, తిరుగుళ్లయినా, ఉద్యోగాలైనా)

కావాలనుకున్నదేదీ నాకు దక్కలేదు..

(ఇది ఇక్కడ ప్రస్తావించడం తగదేమో)

నన్ను కావాలనుకున్న వారికెవరికీ నేను అందుబాటులో లేను..

(ఉద్యోగరీత్యా పరాయి రాష్ట్రంలో అమ్మకు దూరంగా ఉండటం మాత్రమే కాకపోవచ్చు)

నేను కావాలనుకున్నవారెవరూ నా కనుచూపు మేరలో లేరు..

(ఇది గానీ చెప్పానంటే గొడవలైపోతాయంతే)

జరిగిపోయిన రణానికి కారణాలను, అయిపోయిన ఎన్నికలపై సమీక్షలను వ్రాయడం ఎంత టైమ్ వేస్టో తెలిసిందే అయినప్పటికీ అనుక్షణం నేనున్నానంటూ లోనుండి తన్నుకొచ్చే ఆ బాధతో కూడిన విచారం వల్ల కలిగిన దిగులు ఉంది చూశారూ.. దాన్ని ఆపడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు.

అవసరం కొద్దీ అన్ని పురాణాలను, వేదాలను, సామెతలను మనకనుగుణంగా వాడేసుకోవడం ; దాని మూలంగా ఏదైనా పొరపాటు సంభవించినప్పుడు, ఎవరైనా మనల్ని వేలెత్తి చూపినప్పుడు – నేరం నాది కాదు – అంటూ తప్పించేసుకోవడం అలవాటైపోయిన సగటు జీవినే కనుక నేనూ ఈ సందర్భంగా నాకు తోచిన ఓ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నానన్నమాట.

కష్టాలను పంచుకుంటే తరిగిపోతాయి, సుఖాలను పంచుకుంటే రెట్టింపు అయిపోతాయి.

నాలుగేళ్ల క్రితం నేనూహించిన, నేను తెద్దామనుకున్న విప్లవం, నేను ఎంతగానో ప్రయత్నించి భంగపడిన ఓ మహా కార్యం ఈ మధ్యే మా ప్రజా మండలిలో విజయవంతంగా చోటు చేసుకుంది.  ఏ మాటైతే మా సభ్యుల నోట వెంట వస్తుందని అహర్నిశలూ శ్రమించానో, ఏ ఒక్క చిన్న అనుమతి కోసం నిరంతరం తపించానో, ఉపవాసాలు, మౌనవ్రతాలు, జాగరణలు, బహిష్కరణలు లాంటి విభిన్న దీక్షలకు పూనుకున్నానో, అది అలాంటి మార్పు ఇప్పుడు జరిగింది.

కానీ,

నేనెక్కవలసిన రైలు ఎప్పుడో వెళ్లిపోయింది..!

RTS Perm Link

5 Comments so far

 1. Harsha on June 11th, 2008

  నువ్వు రాసిన ఇది నిజంగా విచారకరం… కాదనను

  నువ్వు చెప్పిన సామెత చెప్పిన పెద్దలే “జరిగింది, జరగబోయేది అంతా మన మంచికే” అని కూడా చెప్పారు… అందువలన నేను నిన్ను బాధపడవద్దు అని చెప్పడం లేదు… ఎందుకంటే ఆ బాధ నాకు తెలియదు కాబట్టి.. కాని ఒక మిత్రుడుగా మాత్రం నిన్ను ఓదార్చగలను కాబట్టి చెబుతాను ఈ పై వాక్యం….

 2. Raju on June 11th, 2008

  ఆరుద్ర ఎప్పుడో అన్నారు.. నువ్వెక్కవలసిన రైలు జీవితకాలం లేటు అని..
  నీకు దక్కాల్సింది ఏడు సముద్రాల అవతల ఉన్నా దక్కితీరుతుంది. నీకు దక్కనిది, నీది కానిది ఆరడుగుల అవతలే ఉన్నా నీ అందుబాటులోకి రాదు, దక్కదు..

  రజనీకాంత్ తత్వం బాగానే ఉంది కదూ…

  ఒకటి మాత్రం నిజం..
  ఇంతటితో జీవితం అంతం కాలేదు. కాదు కూడా..
  శోకాలా జలనిధిలోనా సుఖమున్నదిలే..ఏదీ తనంత తానై నీ దరికి రాదు..

  ఇకపై నాకు పాట గుర్తులేదు..
  కాని ఇదే జీవితం….
  నీకు దక్కని దానికి నువ్వు కారణం కానప్పుడు విచారపడడం దేనికీ…
  వదిలేయి..
  నీకు దక్కబోయేదాన్ని వెతుక్కో చాలు.. ఇకనైనా .. భద్రంగా పట్టుకో చాలు…

  నిజ…మే…

 3. sujata on June 11th, 2008

  ఏం పర్లేదు. ఇంకో రైలు ఉందేమో కనుక్కోండి. మీరు చేరాల్సింది మీ గమ్యాన్ని గానీ.. ఏ రైల్ అయితె ఏముంది..? ఒక్కటి నిజం రైలు – ఎప్పుడూ మన గమ్యం కాదు. ‘నేనూ – నా దురదృష్టం’ అనుకుంటూ – మనం అందరం ఫీల్ అవుతూనే ఉంటాం. నిరాశ చాల బోర్ చేసేస్తుంది. అందుకే – జీవితం వెనుక పరుగూ మామూలే.

 4. pinni on July 1st, 2008

  శ్రీ…

  Sorry….. నాన్నా…!

  చాలా రోజుల నుండి తీరుబడి దొరకక నీ బ్లాగు చదవడమేగానీ, నా స్పందనను నీకు పంపలేకపోయాను. ఈరోజు పనిస్థలంలో నా వర్క్ అయిపోయి కాస్తంత తీరుబడి దొరికింది. ఇంకేముంది నీ బ్లాగ్ లోకంలోకి అలా విహారానికి వెళ్ళిపోయాను.

  పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను అర్థం చేసుకోకపోవడం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ భయాలను, సందేహాలను అర్థం చేసుకోకపోవడం అనే అంతరం ఆది నుండి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. దీనికి నువ్వూ, నేనూ ఎవరూ మినహాయింపు కాదు. అందులో భాగమే నువ్వెక్కాల్సిన రైలును నువ్వు అందుకోలేక పోవడం.

  “జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని” అంటూ ఏదో పాత పాటలో విన్నట్లు గుర్తు నాకు. అలా అనుకుని మనసుకు సర్ది చెప్పుకోవడం తప్ప వెళ్లిపోయిన కాలాన్ని, గడచిపోయిన తీపి గుర్తులను తిరిగి తెచ్చుకోలేము కదా…!

  కాబట్టి…గడచిన కాలాన్ని తలుచుకుని బాధపడేకన్నా.. భవిష్యత్తును దర్శించు. నువ్వు కోల్పోయిన గడచిన కాలం కంటే, సుందరమైన జీవితం నీకోసం కాచుకుని ఉందేమో…!

  మనిషి జీవితంతో రాజీపడటం ఎంత ముఖ్యమో, ఆశ కూడా అంతే ముఖ్యం… కాబట్టి ఆశతో ఉండు… నీదైన నీకు మాత్రమే సొంతమైన ఓ మంచి జీవితం నీకు చేరువవుతుంది… GOD BLESS YOU MY CHILD

 5. రాధిక on February 24th, 2020

  మహా బాగా రాశావు! కోల్పోయిన దాని విలువ నీకు కాక మరెవరికీ తెలియదు…

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php