కోదండరాముని(జెఎసి)పై చంద్రశేఖరుడు (తెరాస) – నాడు / నేడు

తెలుగు భాషలో ఉన్న సామెతల్లో రాజకీయాల్లో ఎక్కువగా ఉపయోగించేది, ప్రయోగించేది ఏదైనా ఉందంటే అది – “ఏరు దాటే దాంక ఏటిమల్లన్న.. ఏరు దాటినంక బోడిమల్లన్న” అనేదే. వెన్నుపోట్లకు, నమ్మకద్రోహాలకు నిలయమైన రాజకీయాల్లో నేటి మిత్రులెవరో, రేపటి శత్రులెవరో ఎవరికీ అంతుచిక్కదు. ఇతనికి మించి మొనగాడు లేడని (అవసరార్థమే కావచ్చు – కానీ ఆ సందర్భంలో మనకు తెలియకపోవచ్చు) నెత్తిన పెట్టుకున్న జనమే పనికిమాలినోడు, శతకోటి లింగాల్లో బోడిలింగం అని తీసిపారేస్తే ఆ వేదనేంటో ఇప్పుడు తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం గారికి తెలిసి వచ్చి ఉంటుంది.

కెసిఆర్ అసలు రంగేంటో, అతని అంతిమగమ్యం ఏంటో తెలుసుకోకుండా దొరికిందే ఛాన్సనుకుని ఫోలోమంటూ వెంటబడి, ఆత్మార్పణలు, బలిదానాల పేరుతో వేరుబాట ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఫలితంగా దొరికిన బంగారు గుడ్డుని తీసుకెళ్లి కెసిఆర్ కుటుంబం చేతుల్లో పెడితే.. తాడు, బొంగరం లేనోడు, తెలంగాణ వ్యతిరేకి అంటూ ఆయన ముఖ్యమంత్రి హోదాలో రెచ్చిపోయి డైలాగులేస్తుంటే అవాక్కైపోవడం ఈయన వంతైంది.

ఇవన్నీ చూస్తున్న సాధారణ ప్రజానీకం నవ్వేసుకుని ఊరుకున్నా, సామాజిక మాధ్యమాల్లో మాత్రం కెసిఆర్‌పై ఓ రేంజిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్‌కు ఉండే డిజార్డరేదో కెసిఆర్‌కి సైతం ఉంది సుమా అంటూ వీడియోలను తయారుచేసి పెట్టేస్తున్నారు. అలాంటి శతకోటి …ల్లో ఈ వీడియో ఒకటి.. ఓ లుక్కేయండి –

 

Posted by Political Hunt on Wednesday, October 11, 2017

RTS Perm Link

అక్కడ రాహుల్ గాంధీ… ఇక్కడ లోకేశ్ (చినబాబు)… రచ్చ రచ్చే…!

కాలు జారినా పర్లేదు కానీ, నోరు జారకూడదు అంటుంటారు పెద్దలు. కానీ కాంగ్రెస్, తెదేపా అధినేతల పిల్లలు మాత్రం కాలు సంగతేమో కానీ, నోరు మాత్రం పదే పదే జారేసి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. రాహుల్ ప్రసంగాల గురించి, పార్లమెంటులోను, బహిరంగ సమావేశాల్లోనూ ఆయన పండించిన కామెడీ గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఇ(ఎ)ప్పటికీ యువనేతగానే ఉన్న ఆయన వాక్చాతుర్యం(?)పై ఎన్నో వీడియోలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్‌లో లోకేశ్ వంతు …

ఎన్నికల ప్రచారంలోనే పొరపాటున తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే, మనకు మనం ఉరి వేసుకున్నట్లేనని ఉవాచించేసిన చినబాబు ఇప్పుడు ఏకంగా మంత్రివర్యులు అయిపోయారు. ప్రమాణస్వీకార సమయంలోనే సార్వభౌమాధికారాన్ని ఉచ్చరించలేకపోయిన ఈ ఎంఎల్‌సికి ముందుగా తెలుగు భాష మరియు సంస్కృతి పోర్ట్‌ఫోలియోని కట్టబెట్టాలనుకున్నా, ఆయనకు భాషపై ఉన్న పట్టుని చూసో, పక్క రాష్ట్రపు చంద్రశేఖర తనయుడు కెటిఆర్‌ని చూసి ఫాలో అయిపోదామనుకున్నారో కానీ అవే శాఖలను కేటాయించారు.

తాజాగా విజయవాడలో అంబేద్కర్ జయంతి నాడు ఇచ్చిన ప్రసంగంలో జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అనబోయి, యథావిథిగా పొరబడి వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు అనేసారు. వ్రాసుకొచ్చిన ప్రసంగ పాఠాన్ని చదవడంలో పొరపాటు పడి ఉంటారని అనుకున్నా, వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పరు అనే కనీస అవగాహన కూడా ఈ నూతన మంత్రివర్యులకు లేకపోవడమే ఇక్కడ విడ్డూరం.

ఈ విధమైన పొరబాట్లతో ప్రత్యర్థుల విమర్శనాస్త్రాలకు గురవ్వడమే కాక, సోషల్ మీడియాలోనూ నవ్వులపాలవుతున్నారు నారా లోకేశ్. ఇకనైనా తెలుగు భాషపై పట్టు సాధించి, తెలుగులో అనర్ఘళంగా ప్రసంగించి, ఉచ్ఛారణతో, స్పష్టతతో తెలుగు భాషకు గౌరవాన్ని, ఓ స్థాయిని తెచ్చిన మహనీయుడు, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు లోకేశ్ తగ్గ మనవడు అనిపించుకోవాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

RTS Perm Link

బూటకమా, నాటకమా…!!

 

అక్షరాలే తప్ప
భావాలు కనిపించని
చాటింగ్ మహామాయలో

చూసేది, చేసేది – అంతా బూటకమే..!

 

పైసలే తప్ప
మనస్సులతో పని లేని
మాయా ప్రపంచంలో

కోరేది, పొందేది అంతా నాటకమే..!

(2009 సంవత్సరాంతంలో వ్రాసినది…)

RTS Perm Link

బబ్లూ బోధ. .. బాబాయ్ బాధ…!!!

సీన్ 3:
ఓ పేరొందిన ఆస్పత్రి..

డాక్టర్ల పెదవి విరుపులు, మా పిన్నమ్మ బిత్తరచూపులు.. మా అమ్మ ఆందోళన, మా వదిన కంగారు…
అక్కడ మా బాబాయ్ ‘అహ నా పెళ్లంట’ సినిమాలో సుత్తి వీరభద్రరావులాగా చొక్కా చించేసుకుంటూ చిందులేసేస్తున్నాడు… 2, 3 చొక్కాలు చించినప్పటికీ, ఆయన కసరత్తు కమ్ కండల కమ్ దృఢమైన కమ్ హెర్క్యులెస్ శరీరాన్ని అక్కడి నర్సుల చూపుల నుండి తప్పించేందుకు శతవిధాల ప్రయత్నించి విసిగిపోయి నీరసించిన మా పిన్ని ఆపై ఓపికలేక అలా బిత్తరచూపులతో సెటిలైపోయింది.

ఇంతకీ ఈ సందడి(??)కి కారణమేంటో…!!

 

సీన్ 2:

వేదిక – స్వగృహం
పండుగ – దీపావళి

మదనపల్లి సమీపంలోని అమ్మగారింట్లో గౌరీవ్రతాన్ని చేసుకునేందుకు మా పిన్నమ్మ, అక్కడి బామ్మర్దులకు దీపావళి సందర్భంగా తన తడాఖా చూపేందుకు మా బాబాయ్ ఓ వారం పది పదహైదు రోజుల ముందే చెక్కేసారు. (మనకేం తక్కువలెండి, చెన్నపట్నంలో హోటళ్లకు కొదవా? మొబైల్, ఇంటర్నెట్ ఉంటే స్నేహితులకు కొదవా? ఇద్దరికీ టాటా చెప్పేసి ఆఫీసుకి అంకితమైపోయా..)

తిరుగు ప్రయాణంలో తిరుపతి నుండి చెన్నై రైలెక్కవలసిన దంపతులిద్దరూ సమయాభావం వల్ల రిజర్వేషన్ చేయించుకోలేకపోవడంతో దారితప్పి, ఖర్మకాలి మా ఇంటికొచ్చిపడ్డారు. ఆ సమయానికి నేనూ ఊరెళ్లిపోయి ఇంట్లోనే ఉన్నా…

బంధువులింటికొస్తే ‘ఖర్మకాలి’ ఏంటి అని మీరు అనుకోవచ్చు.. తప్పు లేదు…
చెప్పబోయేది ఆ స్టోరీనే..

దిగ్విజయంగా అన్ని టపాసులు, చిచ్చుబుడ్లు, రాకెట్లు, జాఠర్ ఢమాల్‌లను బామ్మర్దులతో తొడగొట్టి సవాల్ చేసి మీసం తిప్పి మరి పేల్చి, కాల్చి పారేసిన మా బాబయ్య అన్యాయంగా నా అల్లుడి ధాటికి ఆస్పత్రిపాలయ్యాడు…

అదెలా….

 

 సీన్ 1:

దీపావళి సందడి ఇంకా తగ్గలేదు.
కొవ్వొత్తుల కాంతి, పిండివంటల ఘుమఘుమలు పోటాపోటీగా ఇల్లువాకిళ్లు వ్యాపిస్తూనే ఉన్నాయ్..
అసలే మనం (అంటే నేనే) ఇంటికొచ్చామంటేనే ఓ రకమైన సందడి ఉంటుందంటుంటారు మన ఫ్యాన్స్ (అంటే ఎవరో కాదు – అమ్మ, వదిన, అన్న ఇత్యాది కుటుంబ సభ్యులు, బంధువులే) అంతా… అన్న కూతురు మోక్షిత కేరింతలు, అక్క పిల్లలు బుడిగి, బబ్లూల అల్లర్లు, అలకలు, ఆటలు..
పండగంటే ఇంకేం కావాలి??

ఇంతలో ఇంటిలో పిన్ని, బాబాయ్‌ల ఎంట్రీ…

పెద్ద పిల్లలిద్దరికీ వాళ్ల దగ్గర కాస్తా చనువెక్కువే.

ముఖ ప్రక్షాళనాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత పిల్లలతో చదువుల సంగతి ఎత్తితే వాళ్లెక్కడ దూరమైపోతారనే ఆదుర్దాతో కూడిన అనుమానం వల్ల వచ్చిన డోలాయమన స్థితిలో చిక్కుకున్నాడో – మా బాబాయ్ – మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడో, లేకుంటే మనవడి వరుస పిల్లాడిని ఆట పట్టిద్దామనుకున్నాడో కానీ మా మా వాడినో ప్రశ్న వేసేసాడు ఇలా…

“ఏంటి బబ్లూ, జుట్టు అలా పెంచేసుకున్నావ్? చక్కగా క్రాఫ్ చేయించుకుంటే బాగుండేది కదా” అని!!

ఇక మొదలైంది మా వాడి బోధ, మా బాబాయ్యకి బాధ….

“మనిషి జీవితమంటే ఇంతే తాతా.. మనం పెరగాలనుకునేవి ఏవీ పెరగవు (ద్వంద్వార్థాలకి తావు లేదిక్కడ), పెరగకూడదనుకునేవేవి పెరగక మానవు. కోరుకున్నదేదీ దొరక్కపోవడమే మానవ జన్మకి శాపమేమో కదా. ఉదాహరణకి మీ అందరికీ బొజ్జలు తగ్గాలనుకుంటుంటారు, తగ్గుతాయా??? లేదే… నాకేమో జుట్టు పెరగకూడదనుకుంటుంటా, ఆగుతుందా??? లేదే… జీతానికి ఖర్చులకు పొంతన కుదరనట్లే, కోరికలకు వాస్తవాలకు లంకె కుదరదేమో. ఐనా వద్దన్నా పెరుగుతున్నదాన్ని, మనం నిరోధించలేని కొన్ని విషయాలను ప్రేమించడం అలవర్చేసుకుంటే ఇక బాధలు ఉండవుగా… %^&(&(&$%^ &(&$#$$ &(&^$%^$&(&*() %&%&*^(*)(* %*&(*&(&… $%^$&)(*)* ^%$^%&*^ ^*$^%##)*…. వగైరా వగైరా వగైరా వగై… వగై… వగై… వ…. వ….. వ….. … …”

మా వాడి వేదాంతం మాకు అలవాటే కాబట్టి అందుబాటులోని గోడలు, బల్లలు, కిటికీ ఊచలు పట్టుకుని నిలబడగలిగాం కానీ, ఎప్పుడో పండగకో పబ్బానికో కలుసుకునే మా బాబాయికి మా వాడి వేదాంత మహోత్కృష్ట విశ్వ రూపం గురించి ఎక్కువ వివరాలు తెలియనందున కూలబడిపోయాడు. ఆ ఛండ ప్రచండ వేదాంత అగ్నికీలల్లో మాడి మసైపోయాడు. వాడి ప్రసంగం అలా కొనసాగుతుండగానే పెద్ద పెట్టున బల్లులు పాడినట్లు, కాకులు ఏడిచినట్లు, నక్కలు నవ్వినట్లు వింతగా, సరికొత్తగా సకిలింపు ధ్వనులు వెలువరించసాగాడు….

కట్ చేస్తే….

 

నాకు ఓపిక లేదు
“సీన్ 3” — చదువుకోండి….

RTS Perm Link

జీవితం-1


RTS Perm Link

అంతేలేని ఆరంభం ఇది..!!

అంతేలేని ఆరంభం ఇది
గమ్యం తెలియని ప్రయాణమిది
అలుపు సొలుపు దరిచేరనివ్వక
విసుగు విరామం ఊసే ఎత్తక

ప్రతి అణువు నిలువెల్లా
తపించి తపించి తపములు చేసి
ఎదురుచూసి ఎదురుచూసి
ఎన్నో జన్మలు వేచి చూసి

బంధాల బంధనాలను సడలించి అదిలించి
ఉప్పొంగి పొంగు గంగా ఝరిలా ప్రవహించి
ప్రవహించి ప్రవహించి నీ దరికే వస్తున్నా

నీ పాద పద్మములకే అర్పిస్తున్నా…….!!!!

RTS Perm Link

గౌరవనీయులైన *** *** వారికి…!!

ఇటీవల నాయకులు చేస్తున్న ఓ అత్యంత సాధారణమైన పని – “నిరాహార దీక్ష

మరి ఇంతకు ముందు ఫ్యాషనేంటి?? – “బహిరంగ లేఖ

ఆ పాత పంథాలోనే నేను కూడా ఓ బహిరంగ లేఖ వ్రాసేద్దామని నిన్న రాత్రి ఫిక్సయిపోయా.
విశాఖపట్టణంలోని గాజువాకలో ఉన్న ఓ ప్రముఖ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులను నిన్న రాత్రి రైల్లో చూసిన తర్వాత.

ఈ లేఖ ముఖ్యోద్దేశం – ఆ కళాశాలను రచ్చకీడ్చేయాలన్న కుత్సిత బుద్ధి కానే కాదు.

ఇలాంటి కాలేజీల్లో చేరిన పిల్లలు బహు జాగ్రత్తగా ఉంటున్నారు, చక్కగా చదివేసుకుంటున్నారు… కళాశాల యాజమాన్యం, సిబ్బంది వారి గురించి తగు జాగ్రత్తలు తీసుకుని వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటారనే అపోహలో, ఆ కాలేజీ ఫీజులను కట్టేందుకు, వాళ్ల పిల్లల గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లిదండ్రుల్లో కొందరైనా ఇది చదివి తగు రీతిన జాగ్రత్తపడితే చాలు.

ఫీజులు కట్టేసాము, కావలసిన పుస్తకాలు, బట్టలు తీసిచ్చేసాము.. ఇక మనకేంలే అనుకుంటూ హ్యాపీగా సెటిలైపోయిన పేరెంట్స్ కొంచెమైనా నేలకు దిగి, వాస్తవ పరిమాణాలను అర్థం చేసుకోవాలనే.

ఈ సంవత్సరాన్ని ఇలాంటి టపాతో ముగిస్తున్నందుకు కించిత్ చింతిస్తూ..
అదే సమయంలో – ఈ టపా కొందరు తల్లిదండ్రులకు, కళాశాలల యాజమాన్యాలకు కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తూ..

బ్లాగ్ మిత్రులకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలతో!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

గౌరవనీయులైన *** *** కళాశాల యాజమాన్యానికి,

నేను నిన్న రాత్రి (అనగా 29వ డిసెంబర్ 2010 రాత్రి సుమారు 8 గంటలకు) నెల్లూరు నుండి చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలులో వెళ్తుండగా, మీ కళాశాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థినీ విద్యార్థులు తడ స్టేషనులో అదే రైల్లో ఎక్కారు.

స్వతహాగా విద్యార్థులంటే నాకున్న అభిప్రాయం ఆ వెంటనే మార్చుకోవలసి వస్తుందని నాకు అప్పుడు తెలియలేదు.

కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునేందుకే వస్తున్నారో, ఏదైనా విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికే వస్తున్నారో తెలియదు గానీ, వారి ఆగడాలు శృతి మించి పాకాన పడ్డాయి. వారి వేషాలు, చేష్టలను ఇక్కడ విశదపరిచేందుకు నాలోని సభ్యత, సంస్కారం అడ్డుపడుతున్నందున మీకు తెలియచేయలేకపోతున్నందుకు బహుదా చింతిస్తున్నాను.

కనీసం బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని, తెలిసినా అందుకు తగిన విధంగా ప్రవర్తించే బుద్ధి, జ్ఞానం లేని విద్యార్థులను ఇలా ఊళ్ల మీదికి వదిలివేయడం మీకు, మీ కళాశాలకు ఉన్న మంచి పేరును చెడగొడుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంత మంది పిల్లలను విహార యాత్రకు విశాఖపట్టణం నుండి చెన్నై వరకు పంపేటప్పుడు కనీసం వారిని ఆజమాయిషీ చేసేందుకు పంపే వ్యక్తి/ వ్యక్తులకు తగిన జాగ్రత్తలు చెప్పవలసిన ధర్మం కళాశాల యాజమాన్యానికి ఉన్నదనడం కాదనలేని విషయం. మరి కేర్‌టేకర్ అనబడే సదరు వ్యక్తి తనతో పాటే వచ్చిన మరో ఉపాధ్యాయురాలితో మరో కంపార్టుమెంటులో సరస సల్లాపాలు సాగిస్తున్నాడేమోనన్న నా సహ ప్రయాణీకుని మాటలను నేను కాదనలేకపోయాను కూడా.

ఇంతా చేసి మీ విద్యార్థుల్లో కొందరికి ఉన్న బహు మంచి లక్షణం ఏంటయ్యా అంటే –
వాళ్ల మెడల్లో నుండి మీ కళాశాల గుర్తింపు కార్డులను తీయకపోవడం.

ఈ క్రింది తెలిపిన వాటిల్లో నుండి మీ సౌకర్యాన్ని బట్టి మీరో పని చేయండి –

1. ఇకపై ఇలాంటి విహార యాత్రలకు మీ కళాశాల నుండి విద్యార్థులను పంపేటప్పుడు వారి వారి ఐడి కార్డులను స్వాధీనం చేసుకోండి. అప్పుడు ఆ కోతిమూక మీ కళాశాలకు చెందినదనే విషయం బయటికి పొక్కదు. ఆ విధంగా మీ కళాశాల పరువు ప్రతిష్టలను కొంతవరకు నిలబెట్టుకోవచ్చు.

2. ఎలిమెంటరీ స్కూలు పిల్లలే ప్రేమలేఖలు వ్రాసేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంత మందిని సామూహిక యాత్రకు ప్రోత్సహించిన పెద్దమనిషి ఎవరో పట్టుకుని, నాలుగు దులిపి సంజాయిషీ కోరండి.

3. ఒకవేళ ఈ యాత్ర మీకు తెలియకుండా జరిగి ఉంటే, ఈ మొత్తం లేఖలో మిమ్మల్ని ఉద్దేశించి ఆశీర్వదించిన పదాలను పక్కనపెట్టి, ఈ సంఘటనకు మూలకారణాన్ని అన్వేషించి, వాటిని రూపుమాపేందుకు తగు చర్యలను చేపట్టండి.

ఇవేవీ కాదనుకుంటే, మీకు స్వంతంగా ఆలోచించి ఇంతకంటే మాంఛి నిర్ణయాలు తీసుకునే మానసిక పరిపక్వత ఉంటే – అలానే చేయండి.

ఇట్లు,
‘శ్రీచరితం’ మాధవుడు

RTS Perm Link

కొడుకు ప్రతిరూపం…!

నా పుట్టినరోజును గుర్తు పెట్టుకుని మరీ ఓ బహుమతి పంపాడు. చాలా విలువైందే. ఈ వయస్సులో నాకు అవసరమైందే. వాడు అంత దూరాన ఉన్నప్పటికీ నాకు ఎందులోనూ తక్కువ చేయలేదు. చేతినిండా డబ్బులుంటే ఈ రోజుల్లో దొరకంది ఏముంది? వాడు డాలర్లు సంపాదించి, వాటిని రూపాయల్లోకి మార్చి నెలనెలా నా అవసరాలకు అవసరమైన దానికంటే ఎక్కువే పంపుతుంటాడు.

ఏమో.. దూరంగా ఉంటే ప్రేమ ఎక్కువవుతుందేమో..

వాడు పంపే డబ్బును ఖర్చు పెట్టేస్తుంటే చాలా బాధగా ఉంటుంది. నాకు అది డబ్బులా అ(క)నిపించదు. వాడికి నాపై ఉండే ప్రేమలా అనిపిస్తుంది. డబ్బులైపోతూ ఉంటే నా కొడుకు నాకు దూరమవుతున్నట్లే ఉంటుంది. అలాగని డబ్బును చూసుకుంటూ కూర్చుంటే ఈ వయసులో నాకు గడిచేదెలా. ప్రభుత్వం ఇవ్వజూపిన పెన్షన్‌ను ప్రజల మీద ప్రేమతో, కొడుకుపై నమ్మకంతో వదులుకుంటిని. ముక్కుసూటి వైఖరి కారణంగా సర్వీసులో ఉన్నప్పుడూ కూడబెట్టుకున్నదేమీ లేదు. దానికి నేనేమీ బాధపడటం లేదు కూడా…

నాకున్న ఆస్థంతా నా కొడుకే. పుట్టిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడే కదా తండ్రి గర్వపడేది. చదువులోనూ చురుకైన వాడు కావడంతో జీవితంలో త్వరగానే సెటిల్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి కొన్ని వందల మందికి జీవనోపాధి కలిగించే స్థాయికి ఎదిగాడు. అంత మంచి బిడ్డను కన్న నా అదృష్టానికి బంధువులు, మిత్రులు పొగుడుతుంటే నాలో నేనే సంబరపడిపోతుంటాను – చిన్నపిల్లాడిలా.

అందరికీ వాడంటే ఇష్టమే, వాడికీ అందరూ ఇష్టమే. ఇక్కడికి వచ్చే ప్రతిసారీ అందరికీ బహుమతులు తెస్తుంటాడు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు వాకబు చేస్తుంటాడు.

నా పుట్టినరోజు బహుమతి గురించి చెప్పనే లేదు కదూ… ఈ వయస్సులో నాకు అంత పనికొచ్చేది, అవసరమైంది ఏముంటుంది??

వయసు మీరిపోయావు, తూలిపడగలవు జాగ్రత్త అంటూ గుర్తు చేసే చేతికర్ర..

నేను వేలు పట్టుకుని నడిపించిన నా కొడుకు, తను నా చేయి అందుకుని ఆసరాగా నిలవలేకపోయినా – తన గుర్తుగా ఉంచుకోమని అపురూపంగా పంపాడు.

RTS Perm Link

ఇంజినీర్లమా.. డాక్టర్లమా!!

మనం రోజుకు ఎన్నో (ఫైళ్లు, ప్రాజెక్ట్‌లు) డెలివరీలు చేస్తుంటాము కదా..

ఏయే సమస్యలున్నాయో (ఫైల్‌లో బగ్‌లు)  వెతికి పట్టుకుని మరీ పరిష్కరించేస్తుంటాం..

ఇంటికి వెళ్లే దారిలో ఉన్నా, లేకుంటే ఇంటికెళ్లాక కూడా అర్జెంట్ కేస్ (అదే – డెడ్‌లైన్) అని ఫోనొస్తే అంతే వేగంగా తిరిగొచ్చేసి దాని సంగతి చూసి గానీ వెళ్లం..

అంతెందుకు..

అసలు ఒకసారి పనిలో దిగాక, అంటే ఉదయాన ఇంటి నుండి బయల్దేరి కార్యాలయానికి చేరుకున్నాక తిరిగి ఆరోజు ఇంటికి పోతామా పోమా, ఆ రాత్రి పనిలోనే తెల్లారిపోతుందా వంటివి తెలియవు కదా..??

మనం తెల్లని కోట్లు వేసుకోం గానీ, మనదీ వైట్ కాలర్ జాబేగా..

ఇన్ని పోలికలున్నా మనల్నెందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అంటారు..

సాఫ్ట్‌వేర్ డాక్టర్లు అనాలి గానీ!!!

RTS Perm Link

Next Page »

RTSMirror Powered by JalleDa

css.php