Apr 06 2009

భలే..భలే..మాటలు…

Published by

” శ్రవణ సాయినేని” “కాన్వెంటు నుండి…….”

మా ఊరి వాగులా
స్వేచ్ఛగా
యాసలు పోవాల్సిన
నా నాలుకకు
ఫొనేటిక్స్ స్ప్రింగులు తగిలించారు

అప్పటిదాకా
వేలుపట్టుకొని
నడిపించిన అమ్మా నాన్నలు
ఏ విష పురుగు
మెదళ్ళను తొలిచిందో
అక్కడి నుంచి
ఇక్కడి దాకా
మమ్మీ డేడిలై
బరబరా ఈడ్చుకు వచ్చారు

చిన్నప్పుడే
నా భాషకు అంటుకట్టి
అవిటితనం ప్రసాదించారు

హాలిడేస్లో నాతో
ఎగరేసిన పతంగుల్లా
కేరింతలు కొట్టిన
కమ్మని పల్లె పదాలన్నీ
స్కూళ్ళు తెరిచే రోజున మాత్రం
మూగబోయేవి
కాన్వెంటు గేటు దగ్గరకు రాగానే
క్యాంపస్ అంతా కలెదిరుగుతున్న
ఇంగ్లీషు పులిని చూసి
లేడి పిల్లల్లా
బెదిరిపోయేవి

తట్టు తగిలినప్పుడో
తట్టుకోలేని
ఆనందం కలిగినప్పుడో
రక్తంలోంచి
ఓ తెలుగు పదం
ఎదురీదుకు రాగానే
ఫైన్ కొక్కానికి
వ్రేళ్ళాడుతున్న మిస్ బెదిరింపు
చటుక్కున గొంతుకు బిగుసుకునేది

చప్పరించీ చప్పరించకుండానే
నేలకు జారిపడే
షక్కర్ గోళీలు
కాన్వెంట్లో
తెలుగు పదాలు

ఆనందపుటంచులు తాకినప్పుడు
కాకెంగిలి చేసి పక్కవాడితో
పంచుకుందామన్నా
ధుఃఖంతో
గొంతు జీరలు పోయినప్పుడు
దోస్తు భుజాన్ని
ఆసరా అడుగుదామన్నా
దేశ ద్రోహిలా
క్లాస్ లీడరు
భాష మీద నిఘా పెట్టేవాడు

పరాయి భాషలో
పత్తి కాయ పగిలినట్టు
మనసునెలా తెరిచి చూపించాలో
తెలిసేది కాదు
రెక్కలు తెగిన పక్షుల్లా
భావాలన్నీ
గుండె గూటిలోనే
కొట్టుకునేవి

ఇంగ్లీషు రూళ్ళ వాతలకు
తెలుగు పీరియడ్ ను
అద్దుకునే వాన్ని

డోంట్ టాక్ టెలుగు అంటూ
కేరళ నాలుకలు
ఎగిరి పడ్డప్పుడల్లా
తలొంచుకొని
మా తెలుగు మాష్టారు
మబ్బు చాటుకు జారుకునే
చంద్రుడయ్యేవాడు

ఇంగ్లీషుతో ఇప్పుడు
చెడుగుడు ఆడుకుంటున్నా
తెలుగు కవిత్వాన్ని
అంతో ఇంతో
గుండెల్లోకి వొంపుకుంటున్నా
చిన్నప్పుడే తినాల్సిన
నువ్వులుండలాంటి
పెద్దబాలశిక్ష
ఇంకా ఊరిస్తూనే వుంది

. . . . . . 17.11.14

*ఉడుం పట్టు*(poetry)
—————–
అసోమో ఆయపట్ల మోలిసిన
నిర్బంధపు రేగు తుప్పలు
మణిపుర మనుగడల మోపిన
రక్కీస రాళ్ళ గూళ్లు
పొద్దుపొడుపు తోటే పోటీ
పొద్దు గూట్లె వడె దనుక
తోలు బొమ్మల బువ్వ కూరాటల్ల
సుల్కుసుల్కున పచ్చిపుండ్ల సల్పుడు
మొండి చేతుల జన వనంల
పస్క పిందెల చిదిమే పాశవికం
గొర్రెంకల గొడగొడ యేడుపుల
గువ్వల గూడు చిక్కురు బొక్కురు
అరిగోసపడే అమాయకుల తండ్లాటల్ల
అమాంతం ఉడుగేసిన అరాచకం
బక్క పచ్చుల బొక్కలిరిసే కావురం
పచ్చ ఉచ్చులు పొందిచ్చిన నరకం
హక్కుల చిక్కు ముళ్ల దారం
పోరిన పొర్లు దండాలే బదునాం
ఏగలేక ఎగిరి దున్కిన ఎనుగుల్ల
దుబ్బ బుక్కుడే యినాం
గవాయిల తన్నుకపోయే గద్దలు
ఢిల్లీ చెవి కెక్కని గల్లీల సోల్తులు
బొమ్మరాతి బండల బత్కుల్ల
బొండిగె పిస్కిన కసాయి పెత్తనం
పిసరంతయిన చీము నెత్తురు
సలసల కాగిన పెయ్యిల
రోమాలు నిక్కపొడిచే రేషం
పుట్టిన మట్టిని పులుంకొన్న మమకారం
మానవతను నినదించిన గొంతుక
తున్కల్తున్కలుగ తూరుపు
బిగిసిన పౌరహక్కుల ఉక్కు పిడికిలి
ఇరోమ్ చాను షర్మిల
ఇనుప చెట్టు కు
శాంతి పూల వాసన
యిగురుకచ్చిన ఆశలు
ఆజాదికయి అన్న పానాదుల మానిన
మానిని పద్నాలుగేండ్లుగ ఉడుం పట్టు
ఆ సమరశీలి గుండెల పయి
గుదిబండ నేరం
పహారా పడారి గోడల
దవాఖాన్ల జీవిత ఖైదు
బండ బారిన బాటల పొంటి
మొద్దు వారిన మొగసాలలు
పౌర హక్కుల
బొక్కల గూడుకు ఇరోమ్ ఎనగర్ర
ఆమె ముక్కు తాగు గంజినీళ్లు
మానవతకు జీవగర్ర
(నూతన సాహితి-హుస్నాబాద్ .కవి సాయంత్రం లో గానం చేసిన కవిత. తేది 12.10.2014)
– కూకట్ల తిరుపతి
తేది:15.10.2014

||”వాడు”..||
నాకోస౦ ఎదురుచూసీ చూసీ నిదురపోయిన
వాడి కళ్ళల్లోనూ నేనే
వాడి నిద్దురను భ౦గ౦చేయకు౦డా
వాడి కళ్ళము౦దు నిలబడి౦దీ నేనే
నేను వాడి గుమ్మాన్ని…
రెక్కలను మెడచుట్టూ వేళాడదీసి వాడు నవ్వుతు౦టే
వాడితోపాటూ మరో వ౦ద స౦వత్సరాలపాటూ బతకాలని
అనుకు౦టానా…
ఉన్నట్టు౦డి వాడు ఆడుకోడానికి పరిగెట్టినప్పుడు
నేనక్కడ ఒక్కడినే మిగిలిపోతాను
పాలుతాగిన తరువాత వాడిమూతిమీద
మొలిచిన స్వచ్చమైన‌ పాలమీస౦ము౦దు
నా కోరమీస౦ చిన్నదై బోసిపోతు౦ది
వాడు అడిగే ప్రశ్నలకి సమాధాన౦చెప్పలేక‌
నెరిసిన నాజుట్టు అక్కడికక్కడే నల్లబడిపోతు౦ది
వాడు చిన్నోడేకానీ, నా గు౦డెల్లో గడ్డకట్టుకుపోయిన‌
జ్ఞాపకాలనన్నిటినీ వాడి నవ్వులకవ్వ౦తో చిలికి
నా కళ్ళను౦డి కన్నీటివెన్న తీస్తాడు
వాడి వెనుకనే నన్ను పరిగెత్తి౦చి పరిగెత్తి౦చి
కాలాన్ని వెనక్కి తిప్పి నా బాల్య౦లోకి
నన్ను ఎలాగో లాక్కెళ్ళిపోతాడు
వాడికి నేను తాతనేగానీ
వాడు నాకు నాన్న‌
నా శేషజీవితానికి వాడో అరుదైన కాలక్షేప౦
వాడికి నేనో అపురూపమైన ఆటబొమ్మ…
నేను లేనప్పుడు ఏ౦ చేస్తావూ…అని అడిగితే
ని౦గివైపు తలఎత్తి చూస్తాడు…
నేను తిరిగిరానప్పుడు ఏ౦చేస్తావని అడిగితే
తలవ౦చి నేలని చూస్తాడు
మన౦ ఎక్కడున్నా ఆ రె౦డే మన హద్దులని
వాడు మౌన౦గా చెప్పి…
ఒక్కసారిగా…నా గు౦డెను
వాడిగు౦డెతో..గట్టిగా…హత్తుకు౦టాడు
పనసకర్ల‌
29/12/2014
**************

||ఇల్లు||
ఇంటికెళ్లటం ఒక వ్యసనం
LSD ట్రిప్ కోసం పక్షులన్నీ
సాయింత్రానికల్లా
ఠంచనుగా గూళ్లకు చేరుకొంటాయి.
ఇంటికెళ్లలేకపోవటం ఒక విషాదం
పెద్దపులిని
నమ్మించలేకపోయిన ఆవు కోసం
లేగదూడ జీవితాంతం
అరుస్తూంటుంది.
బొల్లోజు బాబా
************
అనిల్ డ్యాని II ప్రవాహం II
సగం కురిసిన వానొకటి నిన్ను ఆపేస్తుంది ఎక్కడికి పోకుండా
మేఘాల్నుంచి వచ్చిన చినుకులు చెట్లను హత్తుకుని మెరుస్తుంటాయి
అప్పుడపుడు ఓ చల్లని గాలి మొహన్ని తాకి వెళ్తుంది
చూరు కప్పు నుండి ఒక్కో చినుకు మెల్లగా కిందకి జారుకుంటుంది
మెదడు లోనుండి ఉసుళ్ళలా జ్ఞాపకాలు ముసురుకుంటాయి
చెదరగొట్టబడిన పావురాల గుండెల్లో భయం నీ కళ్ళలో కనబడుతుంది
ఖాళీ సమయాలలో నువ్వు మాట్లాడిన మాటలన్ని ఇప్పుడు ద్రుశ్యాలుగా అగపడుతుంటాయి
నెమలీకలు , రంగులు అద్దేసుకుని దేవుడిలా నువ్వుకట్టిన వేషం ఇప్పుడు నీకు నవ్వు తెప్పిస్తుంది
కాలాన్ని గడియారంలోకి నెట్టేసి ముళ్ళని కాపలాగా పెట్టి
పగటికి చీకటిని పూసేసి కొన్ని అబద్దాల్ని పోగేసి అమర్త్యానదం పొందుతూ
నీతో నువ్వే రమించిన రోజులు నిన్ను పిలుస్తుంటాయి
మీసం మెలేస్తూ నీ పౌరుషాన్ని ప్రదర్శనకు పెట్టిన జ్ఞాపకం నిన్ను హత్తుకు పోతుంది
ఎంతకీ తెగని బంధంలా ఒక్కోటి అలా ప్రదర్శనకి పెట్టిన చిత్రాల్లా అగపడుతుంటాయి
వాన పూర్తిగా కురిసి వెలిసిపోతుంది
నువ్వు లేచి వెళ్ళేందుకు ఎవరో ఆసరా గా వస్తారు
భయాలు , ఆనందాలు , సంభ్రమలు ,రసాత్మక సంశయాలు వాన ప్రవాహం లో కొట్టుకు పోతూ కనబడతాయి
యధావిధిగా చీకటిపడుతుంది అందరిలానే నువ్వు నిద్రకి ఉపక్రమిస్తావ్
కొన్ని సంశయాల నడుమ ఈ ప్రపంచమంతా నిద్రించాక నీకు నువ్వు కవిత్వమై వినబడతావ్
తేది : 17.01.2015
**************
అనువాదము: “నా కావ్యము” | ఉష
పచ్చిక అంటే ఏమిటి? చేతుల నిండా పట్టి నాకు తెచ్చిస్తూ ఒక బిడ్డ అడిగాడు
ఎలా ఆ పిల్లవాడికి జవాబివ్వగలను?….వాడికి తెలిసినదాని కన్నా నాకు అదనంగా యేమీ తెలియదు
ఇది ఆశాజనకమైన పచ్చని పదార్థంతో నేసిన నా స్వభావానికి సూచిక అనుకుంటున్నాను
లేదా ఇది ప్రభువు చేతిరుమాలు అనుకుంటున్నాను
మూలల్లో ఎలాగోలా సొంతదారు పేరు కలిగి,
మనము చూసి గుర్తించి, ఎవరిదో చెప్పగలిగేలా
జ్ఞాపకార్థం గా విడిచిపెట్టబడిన సుగంధభరిత కానుకా?
లేదా, ఈ పచ్చికే శిశువు కావచ్చనుకుంటున్నా…పైరుపచ్చల నుంచి పుట్టిన బిడ్డని
లేదా ఏకరీతిగా ఉన్న గూఢ లిపి అక్షరాలనుకుంటున్నా
మరి దీనికర్థం, విశాలమైన భూముల్లోను ఇరుకైన మండలల్లోను మొలకెత్తడం ఒకలానే ఉంది
నల్లజాతి వారి నడుమ, తెల్లవారు, కెనడావారు, టుకాహో వారు, కాంగ్రెసు వారి నడుమ ఎదుగుతూ
సంబంధాలు నడుపుతూ నేను అందరినీ ఒకేలా ఆదరించాను, స్వీకరించాను
మరిప్పుడు సమాధుల మీద కత్తిరించబడని రోమముల వలె కనిపిస్తుంది
చుట్టలుగా ఉన్న పచ్చిక, నిన్ను మృదువుగా వాడతాను
యువకుల వక్షస్థలము నుంచి బయల్పడ్డావేమో
వారు నాకు తెలిసిఉండి ఉంటే నేను వారిని ప్రేమించి ఉండేవాడిని
వృధ్ధుల వనితల నుంచి వచ్చావేమో, మరి
అమ్మ ఒడి నుంచి త్వరితంగా తీసుకుపోబడిన శిశువుల నుంచి వచ్చావేమో
మరిక్కడ నువ్వే తల్లుల ఒడివి
ముదుసలి స్త్రీల నెరిసిన తలల నుంచి రావడానికి ఈ గడ్డి చాలా ముదురు వర్ణం లో ఉంది
రంగు వెలిసిన వృధ్ధుల గడ్డం కన్నా గాఢమైనరంగులో ఉంది
లేత ఎరుపు అంగిళ్ళ లో మొలకెత్తడానికీ చిక్కనైన రంగుకలది
ఓ! నేను చాలా స్వరాలను గుర్తిస్తున్నాను
అవన్నీ అంగిళ్ళ నుంచి ఊరకనే వెలికిరావడం లేదని గ్రహిస్తున్నాను
ముసలివారివి, తల్లులవి, వారి ఒడి నుండి త్వరితంగా తీసుకుపోబడిన శిశువుల సైగలు,
చనిపోయిన స్త్రీల యువకుల సూచనలను తర్జుమా చేయగలగాలని అభిలషిస్తున్నాను
యువకులు వృధ్ధుల నుంచి యేమి వచ్చిందని అనుకుంటున్నావు?
స్త్రీలు శిశువుల నుంచి యేమి అయిందని అనుకుంటున్నావు?
వారంతా సజీవులుగా క్షేమంగా ఎక్కడనో ఒకచోట ఉన్నారు
అన్నిటికన్నా చిన్నదైన అంకురం నిజమైన మరణం అంటూ లేదని చూపుతుంది
మృత్యువు ఉన్నా జీవితాన్ని ముందుకు నడిపించింది తప్పా ముగింపు వద్ద బందీ చేయడానికి వేచి ఉండలేదు
జీవము కనపడగానే ముగిసిపోయేది
అన్నీ ముందరికీ వెలుపలికి వెళ్తాయి, మరేదీ పతనమవదు
ఎవరెలా అనుకున్నా చనిపోవడమన్నది చాలా వేరు, ఒక భాగ్యము
*****
Song of Myself
——————-
A child said What is the grass? fetching it to me with full hands;
How could I answer the child? I do not know what it is any more than he.
I guess it must be the flag of my disposition, out of hopeful green stuff woven.
Or I guess it is the handkerchief of the Lord,
A scented gift and remembrancer designedly dropt,
Bearing the owner’s name someway in the corners, that we may
see and remark, and say Whose?
Or I guess the grass is itself a child, the produced babe of the vegetation.
Or I guess it is a uniform hieroglyphic,
And it means, Sprouting alike in broad zones and narrow zones,
Growing among black folks as among white,
Kanuck, Tuckahoe, Congressman, Cuff, I give them the same, I receive them the same.
And now it seems to me the beautiful uncut hair of graves.
Tenderly will I use you curling grass,
It may be you transpire from the breasts of young men,
It may be if I had known them I would have loved them,
It may be you are from old people, or from offspring taken soon out of their mothers’ laps,
And here you are the mothers’ laps.
This grass is very dark to be from the white heads of old mothers,
Darker than the colorless beards of old men,
Dark to come from under the faint red roofs of mouths.
O I perceive after all so many uttering tongues,
And I perceive they do not come from the roofs of mouths for nothing.
I wish I could translate the hints about the dead young men and women,
And the hints about old men and mothers, and the offspring taken soon out of their laps.
What do you think has become of the young and old men?
And what do you think has become of the women and chil- dren?
They are alive and well somewhere,
The smallest sprout shows there is really no death,
And if ever there was it led forward life, and does not wait at the end to arrest it,
And ceas’d the moment life appear’d.
All goes onward and outward, nothing collapses,
And to die is different from what any one supposed, and luckier.
(Walt Whitman’s “Song of Myself” is the great American epic poem. The poem means so many things to so many different people, and its diversity and openness are its greatest strength. It has influenced almost every major American poet of the 20th century, including T.S. Eliot, Wallace Stevens, William Carlos Williams, Langston Hughes, Allen Ginsberg, and John Ashbery. It has also been profoundly important to writers of other nationalities, especially Latin American writers like Pablo Neruda and Jorge Luis Borges. In many ways, “Song of Myself” represents the best that American poetry has to offer. As the poem has taken on new life in other languages, it has been read less as a distinctly “American” poem and more as a universal evocation of a human self searching for definition in a quickly changing world.)
Ref: http://iwp.uiowa.edu/whitmanweb/en/section-6#
***************************************************
చాంద్ || కొందరు ఆడవాళ్ళు అంతే ..! ||
కొందరు ఆడవాళ్ళు అంతే
నిజమైన అందగత్తెలు వాళ్ళు
నాకు ప్రతీ ఉదయం
వెలుగుతున్న మోములో
నిజాన్ని చూపిస్తూ
ఇప్పటికీ నా జీవితానికి
కావలసినంత జ్ఞాణాన్ని
ఆ సౌందర్యంలో
మూట గట్టి ఇస్తూనే ఉన్నారు
నేను మొదటి కేక పెట్టినపుడు
చచ్చి బ్రతికిన శరీరాన్ని జరుపుకొని
ప్రక్కకు వచ్చి నవ్వుతూ నుదుటి మీద
ముద్దు పెట్టిన అమ్మ ఎంత అందగత్తో
కూడూ గుడ్డా లేకున్నా
చిరిగిన బట్టల్లో చెట్టు క్రింద ఒక అందం
కాలిన కడుపులో మాతృత్వాన్ని
పసిపాప నోటికి అందిస్తుంటే
ఆమె ముందు మోకరిల్లాల్సిందే
మా ఇంట్లో పాచి పని చేస్తూ
ఒక అందం అద్దంలా కనిపిస్తుంది
భుజాన వేసుకున్న బాధ్యతలే
ఆమె రాసుకున్న కాస్మోటిక్స్ అనుకుంట
దారిలో చెత్త ఏరుకుంటూ
కొండల్లో రాళ్ళు కొట్టుకుంటూ
ఇటుకలు మోసుకుంటూ…
రోజూ ఇంతమంది అందగత్తెలు
జీవించడంలో దాగిన గొప్పతనాన్ని
పరదా తెరచి చూపిస్తున్నారు
అంతెందుకు తాళి కట్టానని
నన్ను ఒక ప్రపంచంగా చేసుకొని
ప్రతీ క్షణం నాకోసం ఖర్చు పెడుతూ
తాను కరుగుతూ నన్ను వెలుగిస్తున్న ఆమె
నిత్య నూతన అందం అద్దింది నా జీవితానికి
కొందరు ఆడవాళ్ళు అంతే
నిజమైన అందగత్తెలు వాళ్ళు
అందాన్ని వాళ్ళు పులుముకోరు
వాళ్ళనే అందం పులుముకుంది మరి..!
****************
మరువం ఉష | అనాదిగా ఇదే ఉగాది
————————————-
గగనాలు పోసిన చినుకుల తలంబ్రాలు-
సెలయేటి కాంతకి ఒడిబియ్యాలు,
ఊటనేలలో ఎదిగిన చెరుకు బెల్లాలు అవుతాయి.
కోయిలమ్మ చివురులతో సరిపెట్టుకుంటే,
చిలుకమ్మ పిందెలు చిదిమి వదిలితే,
మామిడికొమ్మ మళ్ళీ కాయలు కానుకిస్తుంది.
చింతలెరుగని బతుకుండదని,
ఈదులాడనంటే ఒడ్డు ఆమడదూరాన్నే ఆగిపోతుందని,
పులుపు మేళవింపు చింతచెట్టు తన వంతుగా పంపుతుంది.
కాకమ్మ ఎత్తుకెళ్ళిన పళ్ల లెక్కలడగని,
గాలిగాడు రాల్చిన ఆకుల అజ పట్టని,
వేపమ్మ చేదుమందే శాస్త్రమని పువ్వులో పెట్టి చెప్తుంది.
కారాలు చెపుతాయి ఊరూపేరూ వివరాలు-
ఆరబోసిన మిరప మిలమిలలే
ఉగాది నోటికి కారాలు, కంటికి నీరూను.
ఏడేడు సంద్రాలు ఎన్ని యుగాల కన్నీటి కాలువలో?
శోకాలు లేనిదే శ్లోకాలు పుట్టవనేమో,
రవ్వంత ఉప్పు కలపని ఉగాదికి నిండుదనం రానేరాదు.
గులకరాయంత కష్టానికి ఫలం,
బండరాయంత సుఖం…
కష్ట సుఖాల కలబోతల జీవితాలు
ఉగాదికి ఉగాదికీ నడుమ షడ్రుచుల విస్తర్లు.
31/03/14
*************

చాంద్ ॥ వంట గది ॥
బియ్యంలో రాళ్లు వెతుకుతుంటే
కురుస్తున్న కళ్ళు అడ్డువస్తున్నాయి
ఈ రాళ్ళను తీసిపారేయడం
అమ్మైనా నేర్పలేదు
ఉడుకుతున్న బియ్యం నుండి ఆవిరి
స్వేచ్చగా ఎగురుతుంటే ఎందుకో ఈర్ష్య
సూర్యచంద్రులు అస్తమించే ఈ గదిలో
నాకెప్పుడూ వెన్నెల ఎదురవ్వలేదు
ఊడ్చిన చెత్త పడేసినంత తేలిగ్గా వేదనను
చేతులు కడిగినట్లు గతాన్నీ కడగలేక
నేనూ ఈ మాసిన గుడ్డ
వేడి పాత్రలను మోయడానికే ఉన్నాం
ఈ పొగలాగే నేనూ కిటికీ గుండా వెళ్లి
మరలా సెగకు పుట్టాల్సిందే
పాత్రలు కడుగుతున్నపుడే
మనసునూ కడిగేయడం అలవాటైపోయింది
***
ఈ వంటగది సాక్షిగా
ఆకలి తీర్చడానికి
కంచం మీదో మంచం మీదో జీవశ్చవాలు సిద్దం
మీ చాంద్ ** 07.11.2014

సమీక్షించు//శ్రీనివాస్ మద్దాలి//03/08/2014
——————————————————————
సమీక్షిస్తావా?
సమీక్షించు సమీక్షించు
రుధిరాక్షరాలతో సమీక్షించి
సజీవ చ్చవాలని
నిర్జీవాత్మలని
పురుడు పోసుకుంటున్న పుటపై
ఘనీభవించి నిక్షేపించబడనీ
కరడు గట్టిన పాశవికాన్ని
మరల కింద నలుగుతున్న మృదుత్వాన్ని
మరణిస్తున్న శైశవాన్ని
దహిస్తున్న ఆధిపత్య దావానలాన్ని
దహించుకు పోతున్న పీడిత సమాజాన్ని
బిగించిన పిడికిళ్ళలో వుత్త గాలిని
తెరిచిన పిడికిట్లో శూన్యాన్ని
క్షణంలో పగిలే బుద్బుధ కోటిని
అరక్షణంలో ఆహుతవుతున్న మానవార్బుధాన్ని
శాసించే గండ భేరుండాలని
శ్వాస కోసం రోదించే కుక్కుటాండాలని
రుద్ర భుములౌతున్న భధ్ర భూముల్ని
చిధ్రమౌతున్న జీవితేచ్చలని
చితాభస్మమౌతున్న స్వేచ్చా లతలని
మనుషుల మనుగడ పై నధిరోహించిన
ఖరీదైన ఐరావతాలని
కుప్ప కూలి కుదేలౌతున్న సగటు మనుషుల
వేదనని రోదనని
సంఘర్షనాత్మక భూతకాలం
ప్రసూతించిన సందిగ్ధ వర్తమానాన్ని
రేపు కోసం యేర్పడ్డ బలి వితర్ధిని
నిత్యం జరిగే నరబలిని
మృగ బలి కొరకు నిరీక్షిస్తున్న
రుధిర నేత్రాలని
సమీక్షించు సమీక్షించు
పెంచబడిన సమవర్తి పని గంటలని
తగ్గిన సగటు మనుషుల ఆయుర్ధాయాలని
సగమై చిక్కిన సంతోషాలని
రెట్టింపై రెచ్చిపోతున్న విషాదాలని
బ్రతుకు ముంగిట దిద్దుకుంటున్న మృత్యు రంగవల్లులని
పట్టాలు తప్పి నడుస్తున్న ప్రపంచ ధూమ శకటాన్ని
విద్రోహులు యజమానించే ఆదేశ సూచికలని
గగనంలో విలయ రచన
పృధ్విపై ప్రళయ రచన
సముద్రంలో బడబానలాన్ని
కమ్ముకుంటున్న విద్వేషోన్మాద యుద్ద మేఘాలని
అవి కురుపిస్తున్న అగ్ని ధారలని
సమస్త అస్తవ్యస్త అవ్యవస్తీకృత
శిధిల మానవ శకల సమూహాలని
సమీక్షించు సమీక్షించు
ఆక్రోశాలని ఆక్రందనలని
ఆవేశాలని ఆలోచనలని
అన్నిటినీ సమీక్షించు
రుధిరాక్షరలతో
ప్రళయం ముగిసాక
ధరిత్రి పై గట్టిన రక్టాక్షర చారికల
నాలవాలు చేసుకోని బహుశా
భవిష్యత్ ప్రపంచాన్ని
ఆశా జనకంగా నిర్మించుకుంటారేమొ
ముందుతరాల వాళ్ళు
అందుకైనా సమీక్షించు
రుధిరాక్షరాలతో
పుడమి పుటలపై నిక్షేపించు
**************

//వర్చస్వి//బియాస్//
– – – – – – – – – – – – –
అప్పుడప్పుడూ స్వప్నాల రెప్పల మధ్య
ఓ హరివిల్లుని చూసొద్దామనుకునే
ఉల్లాసపు వెల్లువకు
ఏదో తెలీని తప్పిదపు ఆనకట్ట అడ్డుపడిపోతుంది!
చూస్తుండగానే కంటిలో చలమలు
చిన్నగా చిలవలు పలవలై
విరుచుకు పడ్డ వరదై
కనీళ్ళ చితిని పేరుస్తుంది.
కోల్పోయిన లేత కలల్ని
వొత్తులేసుకుని వెతికీ వెతికీ వేసారిన కళ్ళు-
నివాళిగా వెలిగే కొవ్వొత్తులవుతాయి !
రోజులు దొర్లాక
దొర్లిపడ్డ కన్నీటి కెరటాలన్నీ
చుక్కలు చుక్కలుగా
కాసింత కుదుట పడిపోతుంటాయి.
పగిలిపోగా మిగిలిన గుండెల్ని
స్మృతులుగా శృతిచేసుకుని
జాలిగా నేమరేసుకుంటాయి !
ఎప్పటిలా దీటైన యంత్రాంగం
తనపని తాను చేసుకు పోతూ
ఎక్కడో మేటవేసిన ఇసుకలో ఇంకి పోతుంది!
కుర్రకారుతో పోటీపడి ‘అశ్రద్దా-అప్రమత్తతలు’
పొగరైన వైట్ కాలర్ల నేరాలుగా ఎగురుతాయి.
‘సౌందర్యాన్ని వీక్షించదలచిన కన్ను
చిన్న నలుసైనా పడకుండా
రక్షించుకోవడం నేర్వాలనే’ అంశం-
రేపటి స్కూలు సిలబస్ లో
‘బియాస్’ పాఠంగా వెలిసి తప్పించుకుంటుంది
11.6.12

An excellent poem by srikanth k
ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
ప్రేమ అనుకుని, ప్రేమను అందుకుందామని
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
పిల్లలు తిరిగే లోకాలలో, శిశువులు నవ్వే కాలాలలో
పూవులు తిరిగే, తిరిగి పూసే రంగుల క్షణాలలో
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
అద్దంలోంచి మన ముఖాల్ని లాగడానికి
ముఖాల్లోంచి అద్దాలని తీసివేయడానికీ, మన హృదయాలని భక్షించి
తమ హృదయాలని శిక్షించుకుని, చిందరవందర అయ్యేందుకు ఉక్కిరిబిక్కిరి అయ్యేందుకూ
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
అరచేతుల్లో వీడ్కోలు అయ్యి, కళ్ళల్లో ఎదురు చూపులయ్యీ
దినానంతాన గుమ్మానికి అనుకుని నిన్ను స్మరించుకుంటూ
నిన్ను శపించుకుంటూ ఎందుకో కానీ
ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు
వానలు కురిసే వేళ్ళల్లో, ఎండ చిట్లే కాలాల్లో
వొంటరిగా ఒక్కళ్ళే అనేకం అవుతూ, అనేకం అయ్యి వొక్కళ్ళుగా మిగులుతూ
దీపం వెలిగించిన చీకట్లో తమని తాము రాసుకుంటూ నిన్ను నీకు చెరిపివేస్తూ
ఎందుకో కానీ, ప్రేమిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ మోహిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ నీకు మృత్యువుని పరిచయం చేసి మృత్యుంజయులుగా
మిగిలిపోతారు స్త్రీలు, ఏమీ మిగుల్చుకోని స్త్రీలు
ఏమీ లేని ఏమీ కాని స్త్రీలు
ఎందుకో కానీ నిన్ను ప్రేమించే స్త్రీలు

************
||Retrogression ?||

అప్పుడే పుట్టిన లేగదూడ చర్మం మెరుపులాంటి
వర్షాకాలపు పొద్దుటిపూట – చెరువు మీద
వేటకు దిగుతాడు
రెండేళ్ల బుడతడు
వర్షాకాలపు పొద్దుటిపూట
చెరువు –
తనలాగే పసిది
తల్లి వొడిలోంచి అప్పుడే నిద్రలేచిన నిద్రకళ్ల పసిముఖంది
మెరకల్లో గేదెల మీద
గుర్రపు స్వారీ చేసిన అనుభవమున్న
ఆ రెండేళ్ల బుడతడు
చెరువు మీదికి
ఆశ్చర్యానందాల చూపులరివ్వ విసురుతాడు
బుడతడి కళ్లల్లో
గుప్పెడు బంగారు రంగు పరిగెలు ఈదులాడ్డం చూస్తాం
వొక తడి స్వప్నం ముగ్ధంగా కదలాడ్డం చూస్తాం
బుడతడు నక్షత్రకాంతిధారుడు
గొప్ప సాహస యాత్రికుడు
సౌందర్య ఉపాసకుడు
ఆ బుడతడెవరంటే..
నలభైయేళ్ల కిందట వాగులో జింకలా పల్టీలు కొట్టిన నువ్వే గావొచ్చు
లేదూ
ఇరవైయేళ్ల కిందట మెరకల్లో మట్టిని
ముఖం నిండా నలుగులా పూసుకున్న నేనే గావొచ్చు
బాల్యం అద్భుత కళాఖండం
శిలాక్షరాలపారవశ్యగీతం
Retrogression
అంతా తలకిందులయ్యింది
వర్షాకాలపు పొద్దుటిపూట
అప్పుడే పుట్టిందైనా –
చెరువు క్రూరమైన మృగంలా కనిపిస్తుంది
ఇష్టందీరా తిరిగిన పచ్చని మెరకలన్నీ
లోపలకు మింగేసే మహా అగాథాలనోళ్లలా కనిపిస్తాయి
కాళ్ల పాదాల దగ్గరే
ఏ దుర్గమారణ్యం నుంచోతప్పిపోయొచ్చిన కుందేటి పిల్ల
భయంతో మునగడదీసుకుంటుంది
మమకారపు చే స్పర్శని కాసింత యివ్వనైనా యివ్వం
కళ్ల ముందే రెక్కలు విప్పుకుంటూ
రంగురంగుల పిట్ట సుదూరాకాశంలోకి రివ్వున ఎగిరిపోతుంది
చూపుని కాస్తా అటువైపు తిప్పనైనా తిప్పం
fearness
భయం డ్రాకులా మనిషిని బంధీ చేస్తుంది
సకల సౌందర్యానుభవాలనూ మనవి కాకుండా చేస్తుంది
ఈసారి
వర్షాకాలం వొచ్చినప్పుడు
ఏ భయాందోళనలూ లేని రెండేళ్ల విలుకాడు – బుడతడుగానే మారదాం
కళ్లను కోమల మార్దవ జలతటాకాలను చేసుకుందాం
అంతా ఇక బాగుంటుంది !
18.03.2014
Bala Sudhakara Mouli

https://www.facebook.com/groups/kavisangamam/permalink/614098425309580/

**
అవ్వారి నాగరాజు||కూతురు ప్రశ్న
———————————
ఒక దృశ్యానికేసి చూపుతూ మర్మాంగమంటే ఏమిటని
ఏడేళ్ళ కూతురు అడిగిన ప్రశ్నకు
దూరంగా ఉదయం నుండి తిరుగుతున్నాను
ఒక్కో పూవునూ ఏరి కూర్చి కథా మాలికలను
దిగంతాలకు పరిచినట్టో
ఒక దృగ్విషయపు లోతులకు దూకి
పొరలను తొలుచుకొని కాంతియానం చేసినట్టో కాదు కదా
అదే పనిగా ఎవరూ చెప్పకపోయినా
సరిగా కూర్చోవాలనీ దాచ్చుకున్నట్టుగా తిరగాలనీ తన చుట్టూ ఉన్న వారిలోనే తప్పుక తప్పుక తిరుగుతూ
జీవన క్రియలనూ జీవితాన్నీ సాగించాలనీ
నేర్చుకుంటున్న నా బిడ్డ అడిగిన ప్రశ్నకు నా దగ్గర మాటలు లేవు
దుఃఖం కూడా స్థంభించి లోపలి అరలలో దగ్ధమవుతున్న మంట
పేగులు తెగి దేహం ఒరుసుకపోతూ స్థల కాలాదులను అధిగమించి విస్తరించే గాయపు స్పృహ
మెదడు రసి కారుతున్న పుండులా జిగటలు వారుతోంది
ఈ రోజును పెగల్చుకపోయే ఒకలాంటి మౌనంతో మూసి ఉంచగలను గానీ
బహుశ కొన్నాళ్ళకు ఆమెకు ఇలా చెబుతాను
తల్లీ, ఇది పవిత్ర భూమి
అయితే ఇక్కడ యోనులలో తాగి పడేసిన సీసాలను జొనుపుతారు
స్త్రీలను తల్లిగా చెల్లిగా పూజించడంతో పాటుగా
మర్మాంగాలను కర్రలు, కడ్డీలు పెట్టి తిప్పినా కుతి తీరని మార్మిక రంద్రాంశాలుగా తలపోస్తారు
గఢీలలో తెలియని కోటగోడల ఆవల
సత్యాహింసలను ప్రబోధించిన మహాత్ముల శిలాహృదయాల ముందర
బరిబాతల భయ విహ్వల విహంగమై ముడుచుక ముడుచుక పోయి నీ దేహం వందే మాతరమని నినదించి ప్రాధేయపడింది
గుజరాత్ కాషాయపు నడి బజార్లలో కశ్మీర్ ప్రాయపు విచ్చిత దేహాంగాలలో తలవొంచని ఈశాన్యపు గాలులలో
దేశభక్తి మువ్వన్నెల జెండాగ మురిసి మన గగనాలను అలంకరించింది
పట్టెడు మెతుకులు అడిగినపుడో
ఒక విశ్వాసం ఊపిరిగా నిలబెట్టినపుడో పట్టి పట్టి పాలిండ్లను పిసికి బాలింతతనానికి పరీక్షలు పెట్టింది
ఒకటేమిటి, దేశమే ఒక ప్రశ్నగా మారి సందేహం వచ్చిన ప్రతీసారీ
తనను తాను పోల్చుకోవలసివచ్చిన ప్రతి సందర్భమూ
తొడల మధ్యన ఆవిరులెత్తే ఉన్మాదపు మృగయానందమై చిందులు వేసింది
ఒకరిద్దరు కాదు
ఒక్క సందర్భమూ కాదు
ఈ పూటకు దహించి నిలుచుని చీల్చుక పోయే జీవితపు క్షణాలను అనుభూతికి తెచ్చిన మన సగం ఆకాశమని తనకు జవాబు చెబుతాను
ఒక కాలానికి
రాజ్యమే నగ్నతను సింగారించుకున్న అంగమని తను తెలుసుకుంటుంది
————————————————————————
26/08/2013 – (A must read poem: అవ్వారి నాగరాజుకి కృతజ్ఞతలతో)

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥


నేను మననం చేసుకోవాలనుకునే మాటల్ని ఇలా దాచుకుంటున్నాను.

Boorla Venkateshwarlu
*లేడీ కండక్టర్ * బూర్ల వెంకటేశ్వర్లు

ముస్తాబైన టికెట్ల చంటాణ్ణి
చంకలో వేసుకొని
టిక్ టిక్ హోల్ పంచ్ ని
ఆయుధంగా చేసుకొని
భుజమ్మీద కొంగులా
చిల్లర సంచీని
తగిలించుకొని
బస్సును కదలాలని ఆజ్ఞాపిస్తూ
నిర్బయంగా ఈలేస్తుంది ఆమె.

జీవిత ప్రయాణాన్ని
ప్రయాణ జీవితానికి అంకితం చేసి
ఇంటికీ బస్సుకూ మధ్య
కాలపు ముందు చక్రంలా
గిరగిరా తిరుగుతుంది ఆమె.

నిజంగా
ఇంటింటికీ స్టీరింగ్ ఆయనైనా
విజిల్ ఆమేనేమో!
చిల్లరిస్తే సంబరపడి
నోట్లిస్తే బాధపడే ఆమె
అల్పసంతోషమే
బతుకు బస్సును
గమ్యానికి
తొందరగా చేరుస్తుందేమో!

బస్సంతా కలియ తిరుగుతూ
ప్రతిఒక్కరినీ
టికెట్ అడిగినప్పుడల్లా
ఇంకొంచెం వేసుకొండి అని
కొసరి వడ్డిస్తున్నట్టుంటుంది.
చిల్లర చేతిలో పెట్టి
దిగబెడుతున్నపుడల్లా
అమ్మనో అక్కనో
చాక్లెట్ కొనుకొమ్మన్నట్టుంటుంది.

సర్వాలంకార భూషితల మధ్య
తిరుగుతున్నపుడు
శ్రమసౌందర్య మూలపు
పువ్వుకాడలా ఉంటుందామె.
ఇంట్లో పిల్లలకు
మీక్కావల్సినవి తెస్తున్నానప్పుడు
అచ్చం ఆమె ఒక నాన్నలా ఉంటుంది.

ఒక్క సూర్యాస్తమయానికే
వాడిపోయే కఱకు దారుల్లో
ఆమె నిత్య ప్రయాణం
జీవిత గమనానికి
పొద్దుతిరుగుడుపువ్వై
నిలబడుతుంది.
ఆమె కోమల కంఠం
అనుక్షణం ధ్వనిస్తున్నపుడు
బతుకులోని బాధలేవో
ఆమె గొంతునుండి
గాల్లో కలుస్తున్నట్టు
ఆమె కళ్ళలో ఒక సన్నని పొర
జారిపోతుంది.

డబ్బును మేనేజర్ కు
జీతాన్ని ఆయనకు
లెక్కతప్పకుండా ఇచ్చే ఆమె
నిష్కపటానికి నిర్మల ప్రేమకు
బానిస అని చాటుకుంటుంది.
పడుకునేటప్పుడు
చందమామలాంటి
ఆమె ముఖమ్మీద
విరిగిన నవ్వొకటి
కల్లోల జీవితపు నిప్పురవ్వై
గుండె గుడిసెలో మంటపెడుతుంది.
09.01.2013

**
బాలసుధాకర్ మౌళి
వో పసిపిల్లా.. వో పద్యం…
——————————————-

అంత నిర్మలంగా నిర్భయంగా నిద్రించటం
ఎవరికి సాధ్యం ?
– ఆ పసిపిల్లకే సాధ్యం

అంతవరకూ
చేత్తో ఆ తల్లి చీర అంచుని
పట్టుకుని
చిరుపిడికిళ్ళను బిగించి
లాగి లాగి
కిలకిలా నవ్వుతూ
కళ్ళు మూతలు పడుతుంటే
నెమ్మదిగా నిద్రమత్తులోకి..

బహుశా
పసిపిల్లలు నిద్రించేటప్పుడు
తుమ్మెదలూ
సీతాకోకచిలుకలూ
అదృశ్యంగా
వాళ్ళ తలల చుట్టూ తిరుగుతుంటాయనుకుంటా
రహస్యంగా వొక అల్లికలాంటిదేదో
నిర్మాణమవుతుందనుకుంటా

వొక అల నెమ్మదిగా రాళ్ళ మీద నుంచి
కిందకు జారుతున్నట్టు
ఎక్కడ నుంచో వో పిచుక
గడ్డిపుల్లలను ఏరుకొచ్చి
అత్యంత నిమగ్నతతో
పెటకన
గూడు అల్లుతున్నట్టు

నిద్రలోకి
ధ్యానంలాంటి నిద్రలోకి..

*

రాత్రంతా మెళకువగానే ఉంటా
ఏ తెల్లవారు జామునో
రాస్తున్న కవిత్వాన్ని పక్కన పెట్టి
మట్టిమీద
నిద్రకు ఉపక్రమిస్తాను

నిద్రలో పసిపిల్ల ముఖమే
నా కళ్ళ ముందు
తేలియాడుతూ

కల్లోల దేశాన్ని
కవిత్వం చేస్తున్నప్పుడు

కవిత్వం
పసిపిల్లలా ఉండాలనుకోవడంలో
తప్పేముంది ?
పసిపిల్లలాంటి నిర్మలమైన, నిర్భయమైన
పద్యాన్ని సృజించేవరకూ
రాత్రుళ్ళు ఇలానే –
———————————————-
11.10.2013 morning 12:05am
***

*కొందరి కథ*
“జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలా సున్నితం – వదిలి వేసావో
రాలి పడుతుంది. ముక్కలవుతుంది. అసంఖ్యాకంగా
-ఏరివేసినా కనిపించని గాజుముక్కలు – తిరిగి నిన్నే గాయపరుస్తాయి”

పై మాటలు చెప్పి అతను
మృదువుగా ఆ పిల్లవాడి లేత వేళ్ళ మధ్య సౌందర్యవంతమైన గాజుగ్లాసుని
వాన నీటిపై కాగితం పడవని వదిలినట్టు జార విడిచాడు.
ఆ పిల్లవాడి వేళ్ళు వర్షం పాయలు. వర్షపు పాయలపై తూగుతున్న
గాజు గ్లాసు పడవను విచ్చుకున్న కళ్ళతో చూస్తున్నప్పుడు
మళ్ళా చెప్పాడు అతని తండ్రి:

“ఇది అధ్బుతమైన జీవితం. దేనితో తయారవుతుందో తెలుసా ఇది?
పారదర్శకమైన, నీటి పోరలాంటి ఈ గాజు గ్లాసు? గరుకైన ఇసిక నుంచి-
అధ్బుతం కదా. జీవన సౌందర్యమిది – కటినమైన వాటి నుంచి
సున్నితమైనవి జన్మిస్తాయి. నిజానికి, ఇసిక కూడా
చిగురాకులంత మెత్తగా ఉంటుంది: నువ్వు గమనించగలిగితే-”

అతను (ఆ పిల్లవాడు)
మృదువుగా వేళ్ళ మధ్య తెల్లటి పావురంలా వొదిగిపోయిన గాజు గ్లాసుని
గమనించాడు. అటుపిమ్మట, ఎటువంటీ తొందరపాటూ లేకుండా
దానిని గాలిలోకి వదిలి వేసాడు. వాన చినుకు వోలె
అతని వేళ్ళ మధ్య నుంచి జారి నేలపై వాలి తునాతునకలయ్యింది అది.
అటుపిమ్మట, అతను నేలపై ముత్యాల్లా అల్లుకుపోయిన
సాగర తీరాన ఇసికపై మెరిసే అలల తడి వంటి గాజుగ్లాసుముక్కలను
జాగ్రత్తగా ఎరివేసాడు. అయినప్పటికీ కనిపించని తునకలు
అతని పాదాలలోకి విత్తనాల వలె నాటుకు పోయాయి. చిన్నగా
నెత్తురు మొక్కలు మొలకెత్తాయి. అతను ఏడ్చాడు – కానీ
ఎవరికీ చెప్పలేదు, తాను రోదించినది నొప్పి వల్లనా లేక ఆ

గాజు గ్లాసు పగిలిపోయినందుకా అని- ఇక అప్పుడు, అరచేతుల మధ్య
అతను ఏరిపెట్టుకున్న గాజు తునకలు అతని కన్నీటి కిరణాలు పడి మెరిసాయి-
అతను (ఆ పిల్లవాడు) అనుకున్నాడు: గాజుగ్లాసు పగిలినప్పుడు కూడా
సౌందర్యవంతమే అని, నిజానికి అది పగిలి తునాతునకలైనప్పుడే
మరింత సౌందర్యవంతమని. అతను ఆ విషయం తన తండ్రికి చెప్పలేదు
చెప్పి ఉంటే తన తండ్రి చెప్పి ఉండేవాడు- ఒక మనిషి సౌందర్యం
పగిలి ముక్కలు ముక్కలుగా విస్తరించినప్పుడే తేలుస్తుందని -అయితే
బాల్యంలో అ పిల్లవాడు మరొక విషయం గమనించలేదు
అదేమిటంటే, ఆ గాజు గ్లాసు హృదయం కూడా కావొచ్చునని-
II
చాలా సంవత్సరాల తరువాత అతను (ఆ పిల్లవాడు) గమనించాడు, హృదయం
కూడా సున్నితమయినదని. ఎప్పుడు? అతని ప్రియురాలు
ఒక పుష్పాన్ని ముళ్ళ కంపల మధ్య, చాలా జాగ్రత్తగా, పూరేకులు
గాయపడకుండా ఉంచినట్టు, అమె హృదయాన్ని, అతని అరచేతుల మధ్య ఉంచి
ఇలా అన్నది: “ప్రేమగా ఉంచుకోవాలి. చాలా సున్నితం-
వొదిలి వేసావో, రాలిపడుతుంది. ముక్కలవుతుంది.ఇక

అసంఖ్యాకంగా, ఏరుకున్నా కనిపించని తునకలు నిన్నే గాయపరుస్తాయి”-
అతను మృదువుగా, తన దేహంలో-తల్లి బాహువుల్లో వొదిగిపోయిన
పాపలాంటి- సురక్షితంగా దాచుకుందనుకున్న ఆమె హృదయాన్ని
ఎటువంటీ తొందరపాటూ లేకుండా జార విడిచాడు.అతి సులువుగా

ధూళి అంటిన చేతులని తుడుపుకున్నట్టు, అతి మామూలుగా తన
హృదయాన్ని జార విడిచాడు. ఈ సారి ఏరుకునేందుకు
సుస్థిరమైన గాజు తునకలేమీ లేవు. దేహం నిండా కనిపించని గాయాలు.
ఎక్కడ తాకినా, ,మెత్తగా అంటుకునే నెత్తురు పరిమళం.
ఆమె శరీర పరిమళం.కానీ అతను గమనించాడు.మనిషి

సౌందర్యం, మనిషి తునాతునకలయ్యినప్పుడే తెలసి వస్తుందని. కానీ
నిజానికి ఇక్కడ, తునాతునకలయ్యింది ఎవరు? తన
అరచేతులలో ముక్కలుగా మొలకెత్తుతున్న ఇరువురి
జీవితాలలోని సౌందర్యాన్ని గ్రహించాడు. కానీ, విడవని
మరొక సందేహం: పగిలిన తరువాత ఏరుకున్న గాజు ముక్కలు కొన్ని
తన అరచేతులలో ఉన్నాయి.మరి కనిపించక గాయపరిచే
గాజు తునకలు ఎవరి వద్ద ఉన్నట్టు?
III

ఆతని తల్లి నవ్వి చెప్పింది: “నా వద్ద” అని, తను తన హస్తాలను
చాపి చూపింది. ఏభై ఏళ్ల అరచేతుల మధ్య, నెత్తురు మరకలు-
“నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి. నువ్వు గ్రహించడం మరచిపోయావు
కనిపించక గాయపరిచే తునకలు నిన్ను మాత్రమే కాదు
నిన్ను ప్రేమించే వారందరినీ గాయపరుస్తాయి. మరి నువ్వేం చేయాలంటే

ఆ గాయాలలోంచి ఒక ఇల్లుని నిర్మించుకోవాలి. గాయాలను
మాన్పుకోవడం కాదు.గాయాలను ప్రేమించడం నేర్చుకోవాలి
ఇది ఒక అద్భుతమైన జీవితం. జీవితం ఒక సంఘర్షణ లాగే
ప్రేమించడం ఒక సంఘర్షణ. ప్రేమించడం, ఒక సాధన-” అని
అతని తల్లి తన పెదాలతో అతని గాయాలని ముద్దాడింది-

అతను అప్పుడు తొలిసారిగా తన తల్లిని కడు ఓరిమితో గమనించాడు-
తన తల్లి నగ్న దేహమ్మీద అసంఖ్యాకమైన గాయపు కోతలు
తన తల్లి తండ్రుల నగ్న దేహాల మీదైన, ఆ గాయపు కోతల్లో
తను మృదువుగా జారవిడిచిన గాజు గ్లాసు పగిలిన తునకలు

కొన్ని దిగబడి, నెత్తురు ఊటలా ఉబికీ, ఎండిపోయిన ఛాయలు
మరికొన్ని పచ్చిగా, అప్పుడే వాడిగా దిగబడిన పలుగుల వంటి
పదునైన తునకలు. ఇక, చూస్తుండగానే (ఆ పిల్లవాడు) అతని
కనుల ముందు, ఆ రెండు నగ్న శరీరాలు రెండు మహారణ్యాలుగా మారినాయి-
అనాగరికమైన సౌందర్యంతో, అసంఖ్యాకమైన పక్షుల కిలకిలలతో
జలపాతాలతో మృగాలతో నదులతో మరణించిన అసంఖ్యాకమైన
వదనాలతోనూ తుళ్ళిపడసాగినాయి. అతను మృదువుగా కదిలి

ఆ రెండు నగ్న దేహాలనూ ముద్దాడి ఇలా చెప్పాడు: “అవును. నిజం.
జీవితం వలే, ప్రేమించడం వలే, శాంతి ఒక సంఘర్షణ. శాంతి ఒక సాధన-”
————————- Srikanth K
05/03/1997. రాత్రి 01:15

కె.ఎన్.వి.ఎం.వర్మ//Feb.14th//

పాల నురుగా కాదు
మల్లె తళుకా కాదు కాదు
వెన్నలకి
చీకటిని చుట్టినట్టు
నల్లటి చీరలొ తను..కాదు..కాదు
పున్నమీ,అమావస్యా
కలసి నడచి వస్తున్నట్టు,

తుంటరి పిల్ల గాలికి
ముంగురులు సవరిస్తుంటే
ఇన్ని శిలావిగ్రహలా వీధిలో!
విధాతకి వీధి సంగతి
ముందే తెలిసినట్టుంది
దిష్టి చుక్క బుగ్గ సొట్ట
అప్పుడే పెట్టినట్టున్నాడు.

అడుగులో అడుగు ఏస్తూ
పాత లోగిలిలో
నలుపు తెలుపులో
రాధా కృష్టుణి రవి వర్మ చిత్రంలా
బృందావనీ నువ్వు
నడచి వస్తుంటే…

తన్మయంలో,
ఇరకతరకలుగా నేనుంటే…..

ఆశ్చర్యం!?….
నీ చేతిలో ఎర్రగుళాబీ
నా గుండెని ఎవరిచ్చారు నీకు???????
**

Sriramoju Haragopal
స్పర్శ

స్పర్శించక పోతే ఎలా తెలుస్తుంది నువ్వేనని
నీ మాటో, నీ పాటో, నీ నీడో, నీ వాసనలో
ఆఖరికి నువ్వో తాకకుండా ఎలా…..

తెలుస్తుంది నాకు నీ ఉనికి
వెన్నెల గంధాల్లో, పూల గ్రంథాల్లో
గాలి తీగెల మీదా, నింగి అంచుల్లో
అడివియేటి చలువల్లో, మబ్బు గుంపుల చాళ్ళల్లో

మెరిసిపోయే మెరుపు తీగల్ని పరదాలు కట్టుకుంటావు
చంద్రున్ని, సూర్యున్ని దీపాలుగా వెలిగిస్తావు
రాత్రి కన్న కలల్ని పొద్దున ముగ్గులేస్తావు
కాంక్షామాధుర్యాల నక్షత్ర ఫలాలతో ఆతిథ్యమిస్తావు
నీ వాకిట్లో చెట్టు మీద పిట్టనై వాలుతా
నీ జాడలోనే కదా నీ స్పర్శ నాకు దక్కేది

నా నుదుట చల్లని అమృతహస్తమొకటి తాకినట్లు
నా అక్షరాల్లో నవ్వులవానలు కురిసినట్లు
నా నిరీక్షణల అవతలిఒడ్డున లంగరేసినట్లు
నా హృదయాకాశంలో నెలవంక ఒకటి ఒదిగినట్లు
తెలుస్తుంది నాకు నీ ఉనికి

వానా వానా వందనం
16.06.2013
**

లక్ష్మణ్ స్వామి || ప్లాస్టిక్ పూలు ||

అకస్మాత్తుగా నాచూపుల్ని
నీవేపు లాగేసుకుంటావు
ఆకాశంలోని జాబిలి
బస్సులో కిటికీ పక్కన !?

ఈ వెన్నెలకొమ్మ బస్సెక్కి
ఏ పున్నమి తీరాలకు వెళ్ళాలో

ఆ సుమధుర ‘చంద్ర వదనా’నికి
నా శిరస్సు పొద్దుతిరుగుడు పువ్వైంది !!

అక్షరాలకందని సౌందర్యమది..!

మావూరి మీదుగానే వెళుతుందీ బస్సు
అక్కడే ‘బోల్తా’ పడాలి..!!

కొంటె కుర్రాళ్ళ తుంటరి ఆలోచనలు !
అదే ‘జాబిలి’ పబ్బుల్లో ప్రత్యక్షమయ్యాక
నా మదికి ‘గ్రహణం’ ప్రారంభం !
నా అత్యున్నత ఈ ఊహా సుందరి
‘ఉత్త’దేనా ??!!

దీపపు పురుగులా తిరిగి తిరిగి
చివరికి జీవితం చిరిగి ………………………..??!!

అందాన్ని అనవసరంగా అందలమెక్కించి
అందులో మనం ‘బంధీ’లమయ్యామా..!!?

సౌందర్యమంటే శృంగార ఉత్ప్రేరక సొగసేనా !!

ఊహు ! ఆ సౌందర్యానికి మానవత
సుగంధాలబ్బితేనే
‘పరిమళించే పసిడి’ అవుతుంది !

నవీన నా‘గరిక’ లోకంలో
‘అసూర్యంపశ్య’ నాకెప్పుడూ
ఎండమావేనా….ఏమో !!?

ఓషోనే అడగాలిక !!
———— 09 – 06 – 2013

మూల కవిత తమిళ కవి వైరముత్తుది కాగా తెలుగు అనువాదం అవినేని భాస్కర్ గారు చేశారు.

కవిత : సిల కురల్‌కళుక్కు ఒలియిల్లై

సారంగ సాహిత్య వార పత్రికలోంచి..

ఇదికాదు నేనుకోరినది

సమయం సందర్భం చూడకుండ

కామ శంఖము మోగించి

నిరాయుధహస్తురాలితో

యుద్ధమొకటి మొదలుపెట్టి

ముద్దుపెట్టడం చేతగాక

మోహంలో కొరికి

ఫేన్ తలకి తగిలేలా

పైకెత్తుకుని తెచ్చి

భయంతో బిగుసుకుపోయి
నేను కేకలుపెడుతుంటే
పరుపుపై నా దేహాన్ని పడేసి
ఎసరు కాగక ముందే
తొందర్లో బియ్యంవేసినట్టు
నీలోని కామపుపొగరుని
కరిగించి కరిగించి
నాలోపోసి
అవసరం తీరగానే
తిరిగిపడుకుని
తడికురులారబెట్టుకుని వచ్చేలోపు
గుర్రుపెట్టి నిద్రపోయే భర్తా!
ఇదికాదు నేనుకోరినది
**
సున్నితత్వం కావాలి నాకు
గడ్డిపరకపై జారుతున్నమంచుచుక్క ప్రయాణంలా
శంఖంలోదూరి
సంగీతమయ్యే గాలిలాగా
సున్నితత్వం కావాలి నాకు
**

ప్రవాహానంతరం
చిరుజల్లుతో మొదలుపెట్టు
ఏది చేస్తే నా ప్రాణం విరబూయునో!
నేను చెప్పను
నువ్వు కొలంబస్
నేను అమెరికాకనుగొనుట నీ బాధ్యత
పదివేళ్ళని నెమలీకలుగా మార్చి
అణువణువునీ పూవుల్లా పూయించు
నా అంగాలని
ఒక్కదానికొక్కటి పరిచయం చెయ్
ఆత్రగాడా!
వీణవాయించేందుకు
గొడ్డలి తెచ్చినవాడా!
పిడుగులు పంపికాదు
పూలను కుశలమడగడం!
**
ఇదికాదు నేనుకోరినది
నువ్వు ముగించినచోట
నేను మొదలుపెడతాను
నేనడిగినదెల్లా –
ఆధిక్యత ముగిశాకకూడా
సడలిపోని అదే పట్టు
గుసగుసలాడగాచెవులని తాకే
నీ వెచ్చని శ్వాస

ప్రతి సంయోగానంతరమూ
“నీకే నేను” అన్న హామీ
నా జుట్టుతడిమే
నీ అరచేతివేడి
చెదరియున్న నన్ను
చేరదీసే అక్కర
నేను ఎలా ఉండాలంటే అలా
ఉండనిచ్చే స్వాతంత్రం
తీయని అలసటలో
చిన్నచిన్న సేవలు
నిద్రొచ్చేంతవరకు
చిలిపి సతాయింపు
గుండెకత్తుకున్నప్పుడు
మదినింపే నమ్మకం
**
ఇదిగో!
దుప్పటిలోచేరి నీ చెవికినేనుపెట్టుకునే విన్నపము
మోహమంతా ఇంకిన
జీవితపు రెండో అధ్యాయంలోనూనాపట్ల ఇదే తీవ్రత ఉంటుందా?
పరులముందర చూపే అదే గౌరవాన్ని
ఏకాంతంలోనూ చూపుతావా?
ఏ చీర నువ్వు ఎప్పుడు కొనిచ్చావో
తారీకులు చెప్పి నన్ను ఆశ్చర్య పరుస్తావా?
ఐదువేళ్ళ సందుల్లోనూఆలివ్ నూనెరాసి
నెమ్మదిగా శ్రద్దగా ఆప్యాయతనొలకపోస్తావా?

మాణిక్యపు వేళ్ళని ఒడిలోపెట్టుకుని
నాకు తెలియకనే నా గోళ్ళుగిల్లుతావా?
మేను మెరుగులను కోల్పోయిఅందం తగ్గుముఖంపడుతున్న అంత్యంలో
విముఖం చూపకుండ వినయుడైయుంటావా?
రుతుస్రావమనే పవిత్రతవిరతిచెందే శుభదినంబున
పిచ్చెక్కిన మదిపలువిధంబులా విలపిస్తుంటే
తనివితీరా ఏడవడానికినీ విశాల ఛాతీ అందజేస్తావా?
నిజం చెప్పు,
ఈ హామీలివ్వగలవా?
నమ్మొచ్చా?
ప్రసవించిన కబురువిని
కరిగమనంతో వచ్చి
పసిబిడ్డ నుదురు
ప్రియంగా తాకి
నా అరచేయైనా అంటక

పరుగు తీసినవాడివిగా నువ్వు?

**************
కోడూరి విజయకుమార్
బంధం
***************
ఒక ఎడతెగని శ్రమ అనంతరం
యిక తప్పని సరి విరామమేదో అవసరమైనట్టు
హాల్లో, సుదీర్ఘ నిద్రలో ఆమె

అనుభవాల జాడల్లా
తలంతా నెరిసిన వెంట్రుకలు ….
జీవితమంతా చేసిన యింటి చాకిరీకి దొరికిన
చివరి గుర్తింపులా మెడలో పూలదండ

ఆమే రక్షించిందో, ఆమెని రక్షించిందో
అర్థం కాని రూపాయి కాసంత
ఎర్రని కుంకుమ బొట్టు నుదుటన …
వయసు కన్నా ముందే కమ్ముకున్న
వృద్ధాప్యపు ఛాయలు మోమున ….

కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు
మనవలు, మనవరాళ్ళు, బంధు మిత్రులు
వొక దుఃఖ వలయంలా చుట్టూ చేరి ….

దూరంగా అతడు…ఆమె సహచరుడు
వయసుని జయించే మంత్ర జలమేదో
తాగినట్టున్న మెరుపు దేహంతో …
రిక్త హస్తాలని ముడుచుకుని
శూన్య నేత్రాలని
హాలు పై కప్పుకు వ్రేలాడ దీసి
దుఃఖాన్ని మించిన అచేతన స్థితిలో …

హాలు గోడల మీదనూ, అరల్లోనూ
అతడి విజయాల చిహ్నాలు
అతడి విజయాలు
అతడివి మాత్రమే అన్నంత దర్పంగా

ఎవరో మాట్లాడుకుంటున్నారు ….

‘అతడికి అన్నీ ఆమే..
నగరం నిద్ర లేవక ముందే రాత బల్లను చేరే
అతడిని కాఫీ తో మేలుకొలిపేది
స్నానానికి గోరు వెచ్చని నీళ్లై పిలిచేది

డైనింగ్ టేబు

RTS Perm Link

Comments Off on భలే..భలే..మాటలు…

Comments are closed at this time.

RTSMirror Powered by JalleDa