Mar 06 2013

సమీక్షలు: తెల్లకాగితం

Published by

యశస్వి -“తెల్లకాగితం “మీద ఏం రాసుకున్నాడు ? రాధేయ ఉమ్మడిశెట్టి
**************************************************
– తెల్లకాగితం మీద తన కవితాంతరంగాన్ని ఆవిష్కరించు కున్నాడు
– తెలుగు వర్ణమాలకు 56 అక్షరాల్లాగా ,56 శీర్షికలతోకవితా వస్తువులను
తయారు చేసుకున్నాడు
– కవిత్వం కళ్ళజోడును పెట్టుకొని లోకాన్ని చూస్తూ తెల్లకాగితాన్ని
కవిత్వీకరించు కున్నాడు
– జారిపోయిన కలను నెమరేసుకుంటూ ఈ టీవి ఎండి సుమన్ కు
హృద్యమైన నివాళి సమర్పించు కున్నాడు
– కన్నతల్లి శ్రమని కొలవలేని తనం తో కాలంతో పాటు కౌమారాన్ని
కరిగించున్నాడు ..ఆ స్త్రీ మూర్తిని ఎదురు చూపుల గుమ్మంలో
నిలబెట్టిన తన చెడ్డతనాన్ని నిందించుకున్నాడు
– ఆవిరైన చెమట చుక్కల్తో ఘనీభవించి,మేఘమైన నాన్నను
తలుచుకున్నాడు
– రేపటి రోజుల వెలుతురును వదులుకోవడానికి ఇష్టపడడు
– కళ్ళు తెరిచి మనుషుల్ని చదవాలంటాడు .బాధల్ని ఎదుర్కోవాలంటాడు
– విస్తరించిన సాగరాన్ని చీల్చుకుంటూ సాగే ఓడలా ఎదురీతకైనా
సిద్దపడాలంటాడు
– కవి బి. వి. వి ప్రసాద్ ను చూశాక తన ఆలోచనల పునాదుల్లో కుదుపులు
,ఆవేశాల అలజడులు కన్నీటిలో కరిగి పోవడం జరిగిందంటాడు
– బతుకు వ్యాపారమైన చోట బంధాలు మృగ్య మౌతాయంటాడు
– చార్మినార్ చెంపన హైద్రాబాద్ పాతబస్తీని గాయాల విషాద నగరంగా
ఓ కొత్త కథనం విన్పిస్తాడు
– పరిస్థితులు పగబట్టినా ,ఓటమి అంచుల్లోకి జారిపోకుండా
నిలదొక్కుకోవాలంటూ మధ్య తరగతి మంద హాసాలను గుర్తుకు తెస్తాడు
– ప్రపంచం నీ సొంతం కావాలంటే చీకటిని వివేకంతో కాల్చేయ్యమంటాడు
– ఉప్పదనం లేని చోట జీవితం చప్పగా ఉంటుందంటాడు
– పాకిస్తాన్ లోగిలిలో పూచిన మానవతా ప్రియ నేస్తం “మలాలా “ను
మనసారా అభినందిస్తాడు
– యుక్త వయస్సు స్పందనల్లో -మెత్తని మనసులు మనుషుల్ని కోల్పోతాయనీ
నాణెం గాల్లోకి ఎగురుతుందంటాడు
– అందరితో ఆత్మీయంగా కరచాలనం చెయ్య మంటాడు .అన్నింట్లో
అదే రారాజు అంటాడు
– భాషను కాదు మనసును సంస్కరించమని కోరుతాడు
-ఇష్టం లేని రైలు ప్రయాణాలను అర్థం కాని పదబంధాలను గేలిచేస్తూ
కొన్ని tellగు మాటల్ని వినిపిస్తాడు
-బతుకు బాటలో పంచుకునే ఆనందాన్ని ఎంతో ప్రేమగా నిర్వచిస్తాడు
– పిచ్చుకల జంట కథను విన్పిస్తాడు –
– అక్షరాల ద్వారా ఆపేక్షా సిద్దాంతాలను వివరిస్తాడు
– చివరి పేజీ లో చివరి కవితగా -అక్షర జ్యోతుల్ని వెలిగించే
తెల్లకాగితానికి ధన్యవాదాలు తెల్పుతాడు
-ఇలా తన కవిత్వాన్ని ఆటోగ్రాఫ్ పుస్తకంలా రూపొందించాడు
-సైజులో వినూత్నంగా అన్పించినా ..కవిత్వం ఈ రూపాన్ని
వొదిగించు కోలేక పోతోంది
-అక్షరాలు ఇంకాస్త పెద్దగా ఉంటే బావుండేది
-మొత్తం మీద మంచి ఎక్స్ ప్రేసేన్స్ ఉన్నాయి
– అభివ్యక్తి లో గాఢతను మున్ముందు మరింత గా పెంచుకో గలడన్న
విశ్వాసం నాకు కలిగింది
***యశస్వీ !!నీకూ ,నీకవిత్వానికీ నా అభినందనలు

*****************************************************

సప్తవర్ణ సమ్మిళితం ఈ తెల్లకాగితం — నాయుడుగారి జయన్న

యర్రంశెట్టి సతీష్ యశస్వి కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. తన బ్లాగ్ లో , ఫేస్ బుక్ కవిత్వ వేదిక ‘కవి సంగమం’లో అనేక కవితలు రాశారు. వాటిలో కొన్ని కవితలను ఏర్చి కూర్చి వెలువరించిన పుస్తకమే తెల్లకాగితం. ఇందులో 56 కవితలు ఉన్నాయి.Tellakagitam 2

కిటికీ …ఒంటరి ప్రపంచం నుండి విశ్వాన్ని చూపే ద్వారం. ఈ పుస్తకం ముఖపత్రానికి ఒక కిటికీ ఉంది. అందులోంచి చూస్తే, తెల్లకాగితం కనిపిస్తుంది. తెలుపు ఒక స్వచ్చత, శాంతి, ఒక స్వేచ్చ. మబ్బులకవతల ఆకాశాన్ని చూడగలిగితే నిర్మలినంగా, నిమ్మళంగా , నిశ్చలంగా కనిపిస్తుంది. కానీ, అంతర్గతంగా ఎన్నెన్ని గ్రహాలు, ఉల్కలు, అసంఖ్యాక నక్షత్రాలు, కమ్మే మబ్బులు, కాసే ఎండలు, కురిసే వానలు. ఇందులోనూ అంతే కిటికీ గుండా చూడగానే తెల్లకాగితం కనిపిస్తుంది. దానిని దాటుకుని లోపలికి ప్రవేశిస్తే, నిస్వార్థం, నిర్భయం, విశాలత్వం, స్వచ్చత , స్వేచ్చా , ధైర్యం, కోపం, బాధ, దిగులు, జాలి అన్ని కనిపిస్తాయి. వాటి గురించి మాట్లాడటానికి ముందు మరో మాట చెప్పుకోవాలి. ఏ కవికైనా తన కవిత్వాన్ని పుస్తకంగా చూడాలని ఉంటుంది. ఆ పుస్తకాన్ని పాఠకులు చదివి, ఆదరించాలని కోరుకుంటాడు. తన కవిత్వ ప్రభావాలు, ప్రతిఫలనాల మాట అటుంచితే, కవి పాఠకుడి గురించి అంతకు మించి వేరే పట్టించుకోడు. కానీ ఈ కవి పుస్తకానికి పాఠకుడే ప్రాణమని నమ్మిన వాడు. కాబట్టి , చాలా ప్రాధాన్యమే ఇచ్చాడు. ఇచ్చేవాడికి ప్రేమతో ఇవ్వడానికి , వాడి పేరు రాయడానికి కొంత స్థలం, చదువుకోవడానికే గాకా రాసుకోవడానికి సగ భాగం, అంకితం తీసుకోనేవాళ్ళలో అంతర్భాగం చేయడం మొదలుగునవి పాఠకుడికి దక్కిన గౌరవం. ఇందులో మరో ప్రత్యేకతా ఉందండోయ్! పుస్తకంలోని పేజీల సంఖ్యలకు బదులుగా వర్ణమాలలోని అక్షరాలతో సూచించడం… ఎంతటి తెలుగు దనం! అ తో మొదలై క్ష తో ముగియటం. నిజంగా వర్ణ మాలే. ఎన్నెన్ని రంగులను అద్దుకున్న తెల్లకాగితం ఇది! ఇదంతా కవిత్వానికి ముందుమాట. ఇక కవిత్వంలోకి వెళితే…
నాది నాదే. నీది కూడా నాదే అనే స్వార్థ ప్రపంచంలో …KS LOGO
” నాది నీదైనప్పుడు
నిజంగా నేను మనిషినవుతాను.” అని చెప్పగల త్యాగనిరతి ఎంత మందిలో ఉంటుంది. ఈ కవి అలాంటివాడే. కాబట్టే…
” నాకు నచ్చని నా ని పుచ్చుకొని నడువలేను” అని ప్రకటిస్తాడు.
మన పేరు కోసం, మనమెన్ని ప్రయత్నాలు చేస్తాం, ఎన్నెన్ని పడవాట్లు పడతాం. కవి ఇతరులలో తనను చూసుకొని మురిసిపోవడం కవిదెంత విశాలహృదయం! కవిత్వం కళ్ళ జోడుతో లోకాన్ని చూసే కవికి కనిపించినంత స్పష్టంగా ప్రపంచం మరెవరికి కనిపించదు.
ఈ కవికి శబ్దాలంకారాల మీద మమకార మెక్కువ. యతి మైత్రిలు , ప్రాసల లాగా చాలానే కనిపిస్తాయి. చూడండి…
” జగతి ముందు యువతని ”,
పంచుకున్న ప్రేమల్లో ఎంచుకున్న చదువుల్లో
తలపుల తనువులను తడమాలని లేదు.
తిరిగిరాని తీరాలకు తరలి పోవాలని ఇట్లాంటి వృత్త్యానుప్రాసాలంకార వాక్యాలు ఇందులో కొల్లలుకొల్లలుగా కనిపిస్తాయి.

యశస్వి సతీశ్
యశస్వి సతీశ్
ఇంకా ఈ కవి శబ్ధవిన్యాసాలు చూడండి…
“నీ మునివేళ్ళను ముని మాపు వేళ్ళల్లో”
“నిను వారించాలని, వరించాలని”
“ఆడి ఆడి వాడేలోగా”
” తడుముతోంది..తరుముతోంది” ఇలా శబ్ధాల మీద తన మమకారాన్ని చాటుకుంటాడు కవి.
శ్రీశ్రీలా తిరిగేసి మరిగేసి చెప్పడం ఈ కవికీ చేతనవును చూడండీ…
నువ్ తుర్రుమన్నప్పుడు
నే కేర్ మన్ననో!
నే కేర్ మన్నప్పుడు
నువ్ తుర్రు మన్నావో!” అంటాడు.
కవితలకు నేపథ్యాలు చూపడం ఇబ్బందికరమే. పాఠకుడి యొక్క ఊహా శక్తిని పరిమితం చేయడమే. కానీ ఒక్కోసారి మేలు కూడా జరుగుతుందండోయ్! కవి కవితను పాఠకుడు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ అపార్థం చేసుకోకూడదు. అలా జరుగకుండ ఉండాలంటే, కవి దృష్టి కోణంలో కవితను చూడాలంటే నేపథ్యాలు అవసరమే. అందుకే ఈ కవి తన పుస్తకంలో చాలా వాటికీ నేపథ్యాలను చూపించాడు. ఇది సమంజసమే.
ఈ పుస్తకంలోని అద్భుత కవిత ‘బొమ్మరాళ్ళు ‘ అమ్మల ఆవేదనకు, నిర్వేదానికి, అచేతనానికీ, ఆనందానికి అద్దంపట్టిన కవిత ఇది. సుదూరప్రాంతాలలో ఉన్న తన వారి కోసం ఎదురు చూసి, ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిన తల్లులు, అవ్వలు తమ వారు తమ దరికి రాగానే, ఆ పిల్లల కోసం చేసే ఏర్పాట్ల గురించి చెబుతూ కవి…
” ఇన్నాళ్ళు కళ్ళకు కాసిన కాయలు
ఇక చెట్లకు కాస్తాయి” అంటాడు.
” అరిగిన మోకాళ్ళ మధ్య తిరుగలి తిరుగుతుంది
నలిగిన వేళ్ళ మధ్య కవ్వం చిలుకుతుంది ” అంటూ పిల్లలకై పెద్దలు ప్రేమతో శక్తినంతా కూడదీసుకొని చేసే పనులను దృశ్యాలు, దృశ్యాలుగా మనముందుంచుతాడు కవి.
ఈ కవి రాజకీయ ఆశావాది. అందుకే..
“ఖద్దరు ముసుగుల లొసుగులు
తొలగిపోయే క్షణాలు…తారాడే రోజుని
మేం చూస్తాం! చూసి తీరుతాం!! ” అని ఖచ్చితంగా ప్రకటిస్తాడు.
” సామాన్యుడి బతుకుబండి గతుకుల దారి
పూలబాటైన రోజుని
రోజువారి పనిలో అలసట
ఆటపాటైన రోజుని
మేం చూస్తాం! చూసి తీరుతాం!! “ అని గుండెలనిండా ఆశావాదాన్ని నింపుకొంటాడు. ఆశే కదా జీవితానికి భరోసా! ఆశే కదా జీవితానికి శ్వాస.
ఆధునిక హైటెక్ యుగంలో మనుషుల పద్ధతులు మారిపోయాయి. తమ పేర్లు, పిల్లల పేర్లూ మార్చేస్తున్నారు.
పేర్లలో ఎక్కడా తెలుగు దనం కనిపించకపోవడాన్ని ఈ కవి నిరసిస్తాడు. అందుకే…
” అజంతంగా ఉండలేని నామం పొల్లుతో నేమవుతుంది” అంటాడు.
కలహాలతో కాపురం చెడగొట్టుకుంటే అది పిల్లలకు ఎంత శాపంగా మారుతుందో తెలిపే కవిత ‘నాతో ఆడవా?’.
కొందరి దృష్టిలో మనకు పాకిస్తాన్ శత్రుదేశమే కావొచ్చు. కానీ అక్కడ అందరూ మనకు శత్రువులు కాదు కదా! ఒక చైతన్యం, ఒక పోరాటం ఎక్కడైనా మన అస్తిత్వమే కదా! అందుకే కవి ‘మలాలా ‘ గురించి గుల్ మకాయి ‘ కవిత రాశాడు. అందులో…
” నా కంటి చెమ్మ సాక్షిగా చెబుతున్నా
పాకిస్తాన్ లోగిలిలో పూచిన మానవతా ప్రియ నేస్తమా!
నువ్ విరబూయడం కాంతి పంచే సూరీడుకి అవసరం ” అని నొక్కి చెబుతూ, హృదయానికి హత్తుకుంటాడు.
నేర్చుకోవడానికే తప్ప జీవించడానికి, జీవితాన్ని నడపడానికీ ఏ మాత్రం ఉపయోగపడని నేటి మన విద్యా వ్యవస్థను నిరసిస్తూ…
“మొగ్గల్ని పువ్వులవ్వనివ్వని మొరటుతనాన్ని
నాగరికత నేర్పుతుంది.
చేసిందే చేయడం ఇప్పుడో లెక్క
బొంగరపు జీవితాలు కొత్తపుంతలెక్కవు” అంటూ అన్ని విషయాల ( సబ్జెక్ట్ల) దోరణిని తప్పుపడతాడు.
‘ ఓ సరదా దండకం…సీరియస్ గా ‘ అంటూ రాసిన వినాయకుడి దండకంలోనూ ఈ కవికి పర్యావరణ స్పృహే. భక్తులకు కళ్ళు తెరిపిస్తాడిందులో.
ఇంత చెప్పినా మీకు ఈ కవి పూర్తిగా అర్థం కాలేదా? అయితే మీరు ఖచ్చితంగా ఈ పుస్తకంలోని ‘నాకే గనక చేతనవుతే ‘ కవితను చదవాల్సిందే!
” జెండాలో రంగులు పైనా కింద పడి
తెల్లదనాన్ని కుమ్ముతూ” ఉన్నాయంటూ దేశంలోని మతకలహాల గురించి, శాంతి అనిశ్చితి గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తాడు కవి.
అలాగే…అలాగే అను కవిత మధ్యతరగతి మహాభారతానికి చెందినది. కేవలం ఇది కవిత మాత్రమే కాదు. ఒక్కో వాక్యం ఒక్కో జీవితం. చదివిన ప్రతి ఒక్కరు ఏదో వాక్యంలో తమను తాము చూసుకుంటారు.
‘ఓ రైలు ప్రయాణం‘ అన్న కవితలో కన్న ఊరిని వదిలి వచ్చే సందర్భాన్ని చెప్తూ కవి ఓ చక్కటి ఉపమానాన్ని మన ముందు ఉంచుతాడు…
” తెగవలసినదని తెలిసినా
తోడొచ్చే తల్లిపేగులా…” ఆ జ్ఞాపకాలు వెంటాడుతాయని చెబుతాడు.
కోట్లాది రూపాయల ప్రజాదనాన్ని వృధా చేసే ప్రభుత్వాలకు, దేశాలకు, సంస్థలకు ప్రణాళికలు, సమావేశాల మీద ఉన్న మోజు వాటి ఆచరణ మీద ఉండదన్న పచ్చి నిజాన్ని తెలిపే కవిత ‘ భయ్యా! డైవర్సిటీ ఎక్కడా? ‘
” జీవ వైవిధ్య సదస్సు ముగిసింది
ఇక కాగితాలపై అభయారణ్యాలు పెరుగుతాయి ” అంటూ కవి తన కలం పోటుతో దెప్పి పొడుస్తాడు. ఎప్పుడో చేనేత వారోత్సవాలపై వినాయకుడి వీణ పేరుతో గోరా శాస్త్రి రాసిన చేనేత దృక్పతం వార్తావ్యాఖ్యను గుర్తుకు తెస్తాడు కవి.
ఆచరణకు విలువివ్వని జీవవైవిధ్య సదస్సులంటే ఈ కవికి చికాకే కానీ, జీవులంటే కాదు. అందుకే ఉడుత గురించి, పిచ్చుక గురించి, పాముల గురించి ప్రేమతో కవితలు రాశాడు.
ఇంకా ఈ పుస్తకంలో స్వేచ్చ పేరుతో కొనసాగుతున్న ఆధునిక కాలపు విచ్చలవిడితనాన్ని,పండుగల పరమార్థాన్ని మరిచి వాటిని వికృతంగా మార్చేసినా భక్తుల మూర్ఖత్వాన్ని, హింస, అతివాదం,పశుత్వం, విధ్వంసం, పక్కవాడి నిర్లక్ష్యం మొదలగువాటిని నిరసించే కవితలు, శ్రమ విలువను తెలిపే కవితలు తల్లీదండ్రులతో అనుబంధాన్ని తెలిపే కవితలు ఇందులో చాలానే ఉన్నాయి. కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళకు ఈ పుస్తకం ఓ మంచి బహుమతి అని మాత్రం నే ఖచ్చితంగా చెప్పగలను.
ఇంకా ఈ కవి నుండి మరింత వైవిధ్యమైన శిల్పంతో, వస్తువుతో కవిత్వం రావాలని ఆశిద్దాం!!

నాయుడుగారి జయన్న, ఉపాధ్యాయుడు , గద్వాల . మహబూబ్ నగర్ జిల్లా. 9885217819

సప్తవర్ణ సమ్మిళితం ఈ తెల్లకాగితం — నాయుడుగారి జయన్న

*****************************************************************************************************

అందమైన అనుభూతికి ఆనవాలు… తెల్లకాగితం
భాష ఏది ఐనా అక్షరాలు కొన్నే
అక్షరాలు కొన్నే ఐనా భావాలు ఎన్నో

తెల్ల కాగితం మనిషి జీవితం
ఒకో అక్షరం ప్రతి నిమిషం
చెయ్యి మారితే రాత మారుతుంది
చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది

ఇది దీపారాధన చిత్రంలోని పాట 80 ల్లో రేడియోలో బాగా విన్న గుర్తు..తెల్లకాగితం కవిత్వం పుస్తకం చూశాక ఈ జీవిత సత్యాలనే ఈ కవి నమ్మాడనిపించింది.

56 కవితల్ని అనుభూతికవిత్వం అని లోపలిపేజీల్లో ఆపాదించినప్పుడు ఏ కవిత్వం అనుభూతి కాదనిపించినా కవితా వస్తువుల్ని ఎన్నుకున్న తీరులో ఎన్నిక కన్నా మన్నికైన భావాలకే పీట వేసుకున్నాడనిపించింది.

అక్షరాలను ఆవహించుకున్న “నన్ను” ను చదివించుకుని మనసును తెల్లకాగితం చేసుకోవాలి అంటూ తన ఆకాంక్షను మొదటిపేజీలో తెలియజేసాడు కవి యశస్వి. అసలైన ఉద్దేశం రెండో కవిత కవిత్వం నా కళ్ళజోడు ముగింపులో చెబుతారు. తెల్లకాగితం లాంటి లోకంలో తన సంతకం నిలిచి ఉండాలని.. ఆ కోరికే ఏ కవినైనా యశస్వి గా నిలిపేది.

కవితా వస్తువుల విషయానికి వస్తే తల్లి, తండ్రి, గురువు, దైవం, పనిచేసే ప్రసారమాధ్యమం, అందం, స్నేహం, సమకాలీన కవి సాంగత్యం, ప్రేమ, విరహం, వార్తా స్పందనలు, మధ్యతరగతి మందహాసాలు, ఓదార్పు, ఎదురుచూపు, జీవితంతో రాజీ, భార్యతో, బాసుతో పేచీ, వైవాహిక కలహాల ఫలితాలు, biodiversity, విశ్వవీక్షణం, యువ స్పందనలు, ఉద్వేగాలు, ప్రయాణానుభూతి, పరకాయప్రవేశంలా అన్యాపదేశాలూ, మూర్తీకరణ ప్రయోగాలు… మానవీయకోణాలన్నీ గుచ్చుకోకుండా హత్తుకునేవే. పుస్తకంలో గజళ్ళలా ధ్వనించేవీ, రైలు పట్టాల ధ్వనిలో వినిపించేవీ, మనసుని తొలిచేవీ, పసిభావనల్లో మొలిచేవీ కొన్ని ఉన్నాయి.

మచ్చుకి నాకు నచ్చిన ఐదు కవితలు

1 పుస్తకం మొత్తం మీద పెద్ద కవిత అక్షరాన్ని..నేనక్షరాన్ని శబ్ద-భావాలంకార మిశ్రితం, ఖండకావ్యమే..ఇది. పటిష్టమైన అరుదైన సృజన ఎంతో సాధన చేసి రాశాడనిపిస్తోంది. తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చెప్పిన కవితలెన్నోఉన్నాయి మనకి, అన్నిటినీ ఒక గాటన కట్టినా ఈ అక్షరం క్షరం లేనిదే.. కంఠస్తం చెయ్యాలన్న ఆవేశాన్ని కలిగిస్తుందీ కవిత.. లయ కుదిరితే మీరూ ప్రయత్నించొచ్చు. ముందు తరాలనూ, నరాలనూ ఉర్రూతలూగించే శక్తి, మనం అందించే సంపదల్లో ఒకటి అనిపించింది నాకు. కవికి శాశ్వతత్వాన్ని ప్రసాదించే ఈ సుధా మధుర ధారను తెలుగు వెలుగు మాసపత్రిక ప్రారంభ సంచికలో ప్రచురించింది. ఈ కవిత ఈ పుస్తకానికి మకుటాయమానం.

2.చతుర్థ చంద్రోదయం కవిత ఎత్తుగడే హత్తుకుంది.” చిన్ననాడెప్పుడో చంద్రుడ్ని అతి చేరువగా చూసిన జ్ఞాపకం.. అమ్మ చూపుడివేలి చివర వేలాడుతూ అనుకుంటా.. శీర్షికలో, పదబంధాల్లో గ్రాంధిక వాసనలున్నా.. గౌరవించాల్సిన మాటే.. తిలక్ ని బాగా చదివినట్టూ పైరెండూ చెప్పకనే చెబుతాయి. ప్రాసను ఆక్షేపించే వారి మాటేమో గానీ వినసొంపైన పదబంధాలు అమరిపోయాయి అలా..

౩. “అలాగే.. అలాగే” శీర్షికన మధ్యతరగతి సర్దుబాటు జీవితం కళ్ళకు కటినట్టు మనతో జట్టుకట్టుతుంది.. నిద్రలేచాకా నేలను కాలు తాకితే పచ్చనోటు తొక్కినట్టే.. అద్దెడబ్బులు పెరిగాయికదా… ” ఈనెల DA పెరిగింది ఎంతో తెలుసా!.. మూడోందలు అన్న మాటల్లో ధ్వని ప్రతి నగరజీవికీ ఆమాటకొస్తే సగటుమనిషన్నావాడికి అవునుకదా అనిపించేదే..

4. భయ్యా! డైవర్సిటీ ఎక్కడ!! అని ప్రశ్నించే కవితలో వ్యంగ్యం-నిజం పతాకస్థాయిలో పలికాయి. జీవ వైవిధ్య సదస్సు ముగింపు సందర్భంగా ఆ కార్యక్రమం డొల్లతనాన్ని తేటతెల్లం చేసిన whitepaper ఇది.విమానాల రాకపోకల్ని అడ్డుకోకుండా డేగల్ని చంపకతప్పని పరిస్థితి మనది. డేగల్లేని దేశాల్లో విమానప్రయాణాలు సురక్షితం అంటూ ఔషధమొక్కలూ, విత్తన వ్యాపారాల అభివృధ్ధి కోసం తప్ప ఇది సమతుల్యతకోసం కాదని చురక అంటిస్తారు. వెరసి మంచి కవితనిపిస్తుంది చదివితే..

5. ఏదోకారణం రోజూ మనచుట్టూ ఎన్నో సంఘటనలు.. పేపర్ చూస్తే రైలు కాలిపోయిందనో, కారు పేలిందనో, భూకంపం, వరదలూ జీవితాల్ని తల్లకిందులు చేసాయనో చదువుతూనే ఉంటాం…” బాధ, హింస, అతివాదం, ప్రమాదం, పశుత్వం విధ్వంసం, పక్కవాడి నిర్లక్ష్యం కారణాలు బయటవైనప్పుడు కారణాలు చెల్లడం సహజన్యాయమా? అని ప్రశ్నిస్తారు.. కవిత్వాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటూ మానవీయతను ఆవిష్కరించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన పెద్దల సరసన నిలుస్తాడు యశస్వి.

ఇందులో 10 వరకూ ప్రేమకవితలున్నాయి కన్నీళ్ళు పెట్టించక పోయినా తడి ఎక్కడో తగులుతుంది కొన్నిట్లో.. నివేదన వాటిల్లోఒకటి. చక్కని ప్రయోగాల వేదిక గా భాషాపరమైన చమక్కులతో “కొన్ని Tellగుమాటలు” ప్రత్యేకంగా నిలుస్తాయి.

ఇలా చెప్పుకుపోతే పుస్తకం ఎలా చదివించగలను!! కాపీ కావాలంటే.. కవిసంగమం యడ్మిన్ యాకూబ్ గారిని అడగాల్సిందే.

ముగింపు:

కవి వివరాలు పుస్తకంలో కొప్పర్తి గారి స్పూర్తి ని నింపుకున్న శిష్యుడిగా, కవిసంగమం లోనూ Yasaswisateesh గా www.blaagu.com/sateesh బ్లాగరు గా, ఈనాడు జర్నలిజం స్కూలు, తెలుగువెలుగు అనుబంధం ఉన్నట్టు తెలియజేసారు. చూడడానికి పెళ్ళి పుస్తకం లా ప్రతిపేజీ ఒక కళ్యాణ పత్రంలా వినూత్నంగా, వైవిధ్యంగా కనిపించాలన్న తపనతో కాగితానికి ఒకవైపే ముద్రించారు. చిన్నపిల్లల డ్రాయింగ్ పుస్తకానికి తక్కువగానూ, కాలేజీ పిల్లల తీపిజ్ఞాపకాల ఆటోగ్రాఫ్ పుస్తకానికి ఎక్కువగానూ అనిపించేటట్టు రూపకల్పన చేసుకున్న విధానం కనిపించిన వెంటనే చేతుల్లోకి తీసుకోవాలనిపించే బొమ్మలా, పువ్వులా, పసిపిల్లలా ఈ పుస్తకం ఊరిస్తుంది. పుస్తకం అట్టమీద కవి రూపం తప్ప పేరు దొరకదు, లోపల ఇంటిపేరూ ఉండదు, యశస్వి అన్న కలంపేరు అసలుపేరుతో కలసి కనిపిస్తుంది. సిలికానంధ్రా వారి కొత్త యూనికోడ్ ఖతులుతో పత్రాలంకరణ ప్రత్యేకంగా అనిపించింది. ఇప్పటివరకూ ఈ ఫాంట్లను ఉపయోగించి ఇలా ఎవరూ ముద్రించివుండరు, రైన్ బో ప్రింటింగ్ ప్రెస్ అమీర్ పేట్ వారినీ, the foundation of telugu literature వారిని మెచ్చుకోవాల్సిందే. కవిని అంటారా.. చదివిన వాళ్ళ అనుభూతిని బట్టి.. నాకైతే నచ్చింది. ఎవరికైనా బహూకరించడానికి ఇది ఒక artistic peace. ఈ కవితలను చదవాలంటే పుస్తకం కొనాల్సిన పనిలేదు బ్లాగులోనే చదువుకోవచ్చు. కానీ పుస్తకం పుస్తకమేగా. అందమైన అనుభూతికి తెల్లకాగితం ఆనవాలు. ముద్రణకు ముభావమైన స్థితి నుండి మిత్రులతో పంచుకొనే కాంక్ష ను తెలుగు వెలుగు కవిసంగమం అందించాయని తరువాత యశస్వి వ్యక్తిగతంగా తెలియజేశారు.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
(కవిసంగమం మిత్రుడు కాశిరాజు అనుభూతి)

మహత్తర జీవిత కాంక్షను కలిగించేది సాహిత్యం ఒక్కటే. ఏ కవైనా సాధారణంగా సమాజం, ప్రేమ, మానవ సంబంధాలు, ఉద్యమాలు.. ఇంకా చాలా విషయాల గురించి రాస్తారు. ఇతనూ ఈ పుస్తకంలో అదే చేశాడు; కాకపోతే తను రాయకుండా ఉండలేనితనం నుంచి సులువుగా బయటపడడానికి ఒక మార్గం గా కవిత్వాన్ని ఎన్నుకుని, ఏ పాఠకుడ్నీ చదవకుండా ఉండనీయని కవిత్వం రాశాడు. అది తన మొదటి కవిత “తెల్లకాగితం” తోనే తెలుస్తుంది . “నేను నీసొంతమైనపుడు మన మధ్య అక్షరాల అనుభూతులు మాత్రమే మిగలాలి . కవిత్వం మన అంతరాళాల్లోకి ఇంకి లోకమంతా తెల్లకాగితం అవ్వాలి”.. అంటాడు .
ఈయన దగ్గర సహాయం చేసే గుణం చాలావరకూ ఉంది. . “నేస్తమా “ అన్న కవితలో ఒకచోట వర్ణ వంధ్యత్వపు లోకానికి వర్ణ రహిత సువర్ణదీపాన్ని.. నడి సంద్రపు నౌకలాంటి నీకు సుదూరంగా కనిపించే ద్వీపాన్ని .. అని బతుకుకు నేనొక ఆశనని.. ప్రేమించే గుణాన్ని చెప్పకనే చెబుతాడీయన. అభిమానమనేది కవిత్వం మీదే కాదు , కవి మీద కూడా ఉంటుందనేది మనకందరికీ తెలిసిందే. . ఈయన కూడా ఒకానొక అభిమాన కవి బి.వి.వి. ప్రసాద్ గురించి చెబుతూ “ కవిని చూశాక” అన్న కవితలో సముద్రమోకాదో.. జతకట్టిన సంతోషంలో తేలి, సాటినది తో కలిసి..పారి.. జీవితంలో సంగమిద్దామని అంటాడు అతని ఊరెడుతూ . ఎంత చక్కని అభిమానం!! దీన్నిబట్టి చూస్తే సాహిత్యం మనుషుల్ని ప్రేమించడంకూడా నేర్పుతుంది అన్పిస్తుంది కదా!!.
ఇద్దరు ఒక్కటైనపుడు .. ఒక్కక్కరిలో ఒంటరితనం ఉండనే ఉంటుంది .కానీ ఒక్కొక్కరిలో ఒంటరితనాన్ని చెబుతున్నట్టుకాక, ఒక ఆతృత యొక్క పరిణితిని చెప్పడానికి కాబోలు “ నీ ముని వేళ్ళను ముని మాపు వేళల్లో సందెపొద్దు సూరీడు ముద్దాడి వెళ్ళేలోగా నిన్ను చేరాలనివుంది..అంటాడు . ఎంతకీ చేరుకోలేని మనసు చేరువకోసం ఆరాటపడటం మనమిక్కడ చూస్తాం! అసలైన మతం అంటే మనుసుల్తో కలిసిఉండటం ,ఒకే రకపు వేషాధారణో,సాంప్రదాయమో, కట్టు-బొట్టూ కాదు.. మతసామరస్యపు పరిస్థితులు రాష్ట్ర రాజధానిలో రగులుతున్నపుడు.. కవిహృదయం స్పందిస్తే ఎలాఉంటుందో “ఛార్మినార్ చెంపన” అన్న కవిత చెబుతుంది మనకి. మహాభారతం లాంటి మధ్య తరగతి జీవితంలో యుధ్ధం చేస్తున్న యోధులందరికీ “ అలాగే అలాగే” అన్న శీర్షిక అన్నీ సమకూరుస్తాలే అని చెప్తుంది … పేస్టు పొదుపుగావాడమని.. ప్రతిబింబం గుర్తు చేస్తుంది/సబ్బుకన్నా చెయ్యే ఎక్కువ అరుగుతుంది/తువ్వాలన్నా సరిగా ఆరేసుకుందాం.. ఎన్నని కొంటాం!/లోగుడ్డలు/మేజొళ్ళూ.. పోనీలే/ఎన్నున్నా మరుగున చిరుగులు కనిపించవు. ఆపీసుకెళ్ళే ఇబ్బంది నుండి లంచి బాక్సు ఇంటికి చేరకముందే తీరాల్సిన కోరికల చిట్టాలు కూడా ఈ కవితలో విప్పుతాడు. చివరగా మూడొందలు జీతం పెరిగితే ఎగిరిగంతేసినట్టు.. , ఈ రోజు ఇంటికి రావడం లేటవుతుంది. మీరు భోంచేసేయండి అని చెప్పి ” చివరాకరికి.. నీకు మల్లెలు, వాడికి హనీకేకు……………. ” అని అవతల ఏదొ చెప్పబోతుంటే.. (త్వరగా ఇంటికొచ్చేయండి నేను ఎదురుచూస్తుంటా..) అర్ధమయ్యిందిలే అన్నట్టు చెప్పడం కోసమేమో!! అర్థంతరంగా కవితని ముగించేసి “అలాగే.. అలాగే .. అనేస్తాడు. ఇలా రాసే విధానం పాఠకుడ్ని ఇంకాస్త ముందుకు పరిగెట్టించి.. అందరిచేతా.. చివరికి ఇతనినుకున్న భావాన్ని ఆ కవితలో వలకబోసి, చదివిన వాళ్ళనీ పులకింపచేస్తుంది.
ప్రతీ కవీ సందేశాన్ని ఎంతో కొంత ఇస్తాడు అది బహుశా స్వీయ అనుభవ జ్ఞానం కావచ్చు. పరీక్షలకే పారిపోతామా?/పరిస్తితులకే మారిపోతామా?/ప్రవాహానికే జారిపోతామా!!/కాదు.. నిలబడడం నీ వంతు, నీకు నువ్వు తప్పుకుంటే నీ పునః సృష్టి జరుగుతుందా? అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు ఒక సామాధానం,సందేశం కూడా ఇస్తాడు నిలబడడమే నీ వంతని.
A Thing of beauty is joy for ever అన్న జాన్ కీట్స్ ను బాగా చదివినట్టున్నాడు. అందం గురించి కూడా ఒక కవిత రాసాడు. ఇంకోచోట మలాలా జీవన్మరణ పోరాటంలో పడి ఉండగా కవిసంగమం కవులు కిరణ్ గాలికి తోడుగా.. తన చేయి కలిపి రాసిన కవిత “గుల్ మకాయీ”.. ఆధునిక విద్య అవసరం అని నొక్కి చెప్పిన నీ అంతరంగం../వాడిన ముఖం వికసించాలని ఈ లోకం ఎదురుచూస్తుంది. అదే తెగువ బతకడానికి చూపించి బతుకులో బతుకుతూ పోరాడాలని కోరుకున్నాడు.. కోరుతున్నాడు. ఈ ప్రతిస్పందన కవితను కన్న కవిహృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
అనుభూతి కవిత్వాన్ని చెబుతున్నప్పుడు ఒక పక్క పరిశీలన కూడా అవసరం, అందరి అనుభూతీ ఒకేలా ఉండదు కనుక అనుభూతి కవిత్వం ఒక్కోసారి అందరికీ అర్ధం కాకపోవచ్చు. దాన్ని దాటవేయడానికి పరిశీలన అవసరం. అది ఈ కవి దగ్గరుంది.” గోప్యతకు పట్టంకడతారు పిల్లలు/గోడ చాటునో సందుచివరనో కళ్ళు కలుస్తాయ్, రాహుకాలం పొంచి చూస్తున్న సమయంలో మెత్తని మనసులు మనుషుల్ని కోల్పోతాయి” అని యువతని ఉద్దేశించి “నాణెం గాల్లోకి ఎగురుతుంది” అని కవిత రాసి యువతకి అంకిత మివ్వడం బాగుంది.
“హాయి చెయ్యి ” కరచాలనం గురించి .. నేను ఇప్పటికింకాఈలాంటి కవిత చూడలేదు. బహుశా మీరూ చూసి ఉండరు. చేయి చేయి కలవడం చిన్న పనేంకాదు. పెదవులూ-పెదవులూ పలకరించుకోవాలి /కళ్ళు-కళ్ళూ కలుసుకోవాలి.. మనసు ముందుకు ఉరికిం తర్వాతే కరచాలనం చెయ్యగలమని, . కరచాలనం అంతరార్ధం “సామాజిక సమరసత” అని. కరచాలనం చేయడానికి ముందు నిజంగా ఇంత తంతు వుండడం, కరచాలనం చేయడం ఒక యోగం అనడం వెనుక స్వానుభవం ఉంది. ఆస్వాదన ఉంది.
చంద్రుడ్ని చూపుడువేలు చివర వేలాడదీసి అమ్మలందరికీ చతుర్ధచంద్రోదయాన్ని అంకితం చేసాడు ఇతను. ప్రతి స్త్రీ కోరుకునే రసరాజ్య యుధ్ధ్దాన్ని.. కృషపక్షపు అష్టమి నుంచి అమావాస్యలోపు ఉందని చెబుతూ దాని ఫలితంగా పాండ్యమి పాపడు సిధ్ధం అని రాసాడు. తనని తాను చిన్నప్పుడు చూసుకున్న సందర్భం కాబోలు ఈ కవిత చదివాక ఒక జల్లు వెన్నెల మనమీద కురుస్తుంది. గుండెల్లో వెలితిని నింపే స్నేహం కోసం గుండె చెరువయ్యే మాటలు రాస్తూ “నాతో ఆడవా” అన్న కవితలో పొరపొచ్చాలొచ్చి వేర్పాటువాదం ఉన్న జంటల్లో, వాళ్ళ ఇండ్లలో జరిగే సన్నివేశాల్ని చిత్రణ చేసి చూపించాడు. అభిప్రాయాలు కలవ లేక .. రాత్రి రహస్యాలు రసవత్తరంగా లేకో.. విడిపోదామని చూసేవాళ్ళు, వేరు పడి ఏం చేస్తున్నారో , ఏం చేయకూడదో చెప్పాడు.
బయోడైవర్సిటీ సదస్సులు జరిగిన రోజుల్లో రాసిందనుకుంటా ఒక ఉడుతని వ్యాజస్తుతి చేసాడీయన. అతనన్నట్టు ఉడుత గుండ్రటి కళ్ళు, కుచ్చుతోక, గీతల ఒళ్ళుతో ..మంచి సౌందర్యరాశి కదూ!. ఈ పుస్తకంలో సరదా దండక మొకటుందండోయ్. అది చదివితే సీరియస్ గా నవ్వొచ్చేస్తుంది మనకి. కాలుష్య రహిత నిర్మాణానికి ఇతను చూపించే శ్రద్ద మనకిక్కడ తెలుస్తుంది. తన మనసు తనని తొలిచినపుడల్లా “ఈ క్షణం ఇలా ఆగిపోనీ ” అనుకుంటాడట. రేగిన గాయాన్ని మాపే కాలంతో జతకట్టలేను అంటాడు. రాత్రి కరిగిపోతుందనే భయంతో వెలుగు జాడలో నేను కరగలేను అంటాడు. కానీ అది అయ్యే పనా? కాలంతో జతకట్టాల్సిందే, ఆ వెలుగుజాడల్లో అతడు కరిగిపోతేనే కదా! అతని బతుకుబండి ముందుకు కదిలేది. మనకు ఇలాంటి తెల్లకాగితాలని సంపుటులుగా పంచేది.
మళ్ళీ ఇంకొకచోట “నాకేగనుక చేతనైతే ” పిప్పరమెంటు నౌతా/పుస్తకాన్నౌతా/కన్నెపిల్ల కోరికౌతా/కన్నవారి కానుకౌతా/ అంటాడు.చిన్నప్పటినుండీ ఇప్పటికీ ఇలానే అనుకుంటాడట. చూడండి మరి ఇన్ని చెప్పిన వాడు మాట వరసకైనా కవినౌతానని చెప్పలేదు. కల్పించి కూడా రాయనందుకు కసితో కవిగా ముద్రవేసి సాహిత్య ప్రపంచంలోకి వదిలేద్దాం మరి.
కవిసంగమం(9701075118)
తెల్లకాగితం(కవిత్వం)
కవి: సతీశ్ కుమార్ (yaSaSwi)
వెల:110/-
ముఖచిత్రం: పి.యస్.చారి మరియు రవి శంకర్
ప్రతులకు: వై. గిరిజావతి
శ్రీ నిలయం 1-21-5/A
కడకట్ల,తాడేపల్లి గూడెం -534101
ఫోన్:8008001942 , ఇంకా.. 08818221596
with YaSaswi Sateesh.

(from One of my friend.. Rama.. ప్రతిస్పందన)

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa