Dec 09 2012

చివరి పేజీ

మనస్సాక్షి చెప్పినట్టు వీలునామా పై సంతకం చేసే
క్షణమొకటి వేచి ఉంటుంది.

పూజానంతరం నైవేద్యం సమర్పించేటందుకైనా
దాయిల్ని చల్లార్చే ఘడియొకటి ఉంటుంది

భక్తి ప్రపత్తుల ఘాడత ఎంతున్నా.. పూజ ముగించే
పర్వమొకటి ఉంటుంది

అప్పుడు బాధ్యతల నుండి విముక్తి చెందినట్టుగా
జీవితాన్ని ప్రసాదంలా అందించే అవకాశం
తెల్లకాగితపు విస్తరిలో అక్షరాల వడ్దనతో పూర్తవుతుంది
ఏ కవితైనా ప్రారంభం కన్నా ముగింపే బాగుంటుంది.

ధ్వజానికి అవతల అంచునే జెండా రెపరెపలాడుతున్నట్టు
క్రమ క్షీణోపాంత ప్రయోజనసిధ్ధాంతం వర్తించని
ఏమాటైనా కవితే అవుతుంది

తాడొదిలిన బొంగరంలా నా అక్షరాలు
నీ మనో ఫలకం పై రింగులు తిరుగుతాయి
ఈ పాటికే నచ్చినవి పాలపొంగై అగ్నికి
స్వాహాయమానమై ఉండిఉంటాయి

అనుభవాల ఆవిరి చాలక అతకని అక్షరాలు
భాష్పోత్సేక మవ్వలేక నీరుగారిపోయుంటాయి.
అయినా పర్వాలేదు.. అక్షరాలు అంతర్ధానమై..
అంతర్యామిగా మారిన అనుభూతిని
ఒక్క ఇంకుచుక్క ఇవ్వగలిగితే చాలు

ఈ సాహిత్యం నీ ఉన్నతిని కోరే సంస్కారమని గుర్తిస్తే చాలు
ఆశ నిరాశల వెలుగునీడల్లో.. చిన్నదైనా పెద్దదైనా
ఎప్పటికీ నిలచిఉండే ఓ తారలా ఉత్సాహాంతో
ఒక్క మాట పునరుత్పన్నం అయితే చాలు

పేజీలు పూర్తైన తర్వాతైనా కలం నాటిన విత్తులు మొలకెత్తి
సహస్రదళాలతో వెలుగురేఖలను పొదివిపట్టితే చాలు
అక్షరాల మధ్య తెల్లకాగితం తొంగిచూసినప్పుడల్లా
నా ప్రయత్నాన్ని కొనసాగించే మరో యశస్వి
మిణుగురై వెలిగి మనల్ని ఎగిరేస్తే చాలు

జీవితాలను ఇగిర్చి ఘుమఘుమలాడిస్తే మేలు

RTS Perm Link

3 responses so far

3 Responses to “చివరి పేజీ”

  1. మద్దిరాల శ్రీనివాసులుon 12 Dec 2012 at 4:14 AM

    మిగిలిపోయిన రొట్టె ముక్క
    చినిగి పోయిన కాగితం ముక్క
    ఆఖరున పెనంలోని పాకం చెక్క
    దాచుకొనగా మిగిలిన చాక్లెట్ ముక్క
    అరిగిపోయిన పెన్సిల్ ముక్క
    రాసి రాసి మిగిలిన బలపం ముక్క
    కవిత్వం చివరి పేజీ ముక్క
    కనగా బహు మధురం ,కిక్కు

  2. mallula sureshon 12 Dec 2012 at 12:18 PM

    excellent ga vundi

  3. BVV Prasadon 15 Dec 2012 at 11:13 AM

    ‘ఈ సాహిత్యం నీ ఉన్నతిని కోరే సంస్కారమని గుర్తిస్తే చాలు’
    మంచి కవిత సతీష్ గారూ, సాహిత్యం ఎటు ప్రయాణించాలని ఒక పాఠకుడి
    గా కలగంటున్నానో, అటువైపుగా సాగుతున్న మీ ప్రయాణం సంతోషాన్ని కలిగిస్తూ వుంది.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa