Dec 01 2012

తెల్లకాగితం..

మనిషన్నాకా  ఏవో కొన్ని అక్షరాలు

తనవై ఉంటాయి

పేరో.. ఊరో.. తనవారో..కానివారో

 

అక్షరాలే..

పలుకుతాయ్, పలకరిస్తాయ్,

పులకరిస్తాయ్, పలవరిస్తాయ్,

పగులుతాయ్, పగలబడీ నవ్వుతాయ్..

 

అలవాటైనకొద్దీ ప్రతీదీ

నాతో చేరిపోతుంది

నాకు ప్రతీకగా మారిపోతుంది.

నాకు నచ్చని ’నా’ని గుచ్చుకుని నడవలేను

పచ్చ పొడిపించుకు తిరగలేను

 

పలికిన ప్రతీమాటా నాది మాత్రమే ఐనప్పుడు

నీ మాట నోటరాక నేను రాయైపోతాను

నాకు నేను పరాయై పోతాను

నాది నీదై నప్పుడే నిజంగా నేను మనిషినౌతాను

 

నాని వదిలించుకోవాలనో

నన్ను నీలో నిలుపుకోవాలనో

నావైనవన్నీ నీకు పంచేస్తున్నా

నా మెడలు వంచి నీవి చేస్తున్నా

నాది నీదైనప్పుడు నేను నీవైనట్లే

 

అందుకో.. నన్ను..  నీ ప్రపంచంలోకి వస్తున్నా

నీ సాక్షిగా నన్ను నేను పోగొట్టుకోవాలి

నా పేరూ, ఊరూ చెరిపేసుకోవాలి

 

నన్ను చదివించుకుని,

అక్షరాలను ఆవహించుకుని

మనసు తెల్లకాగితం చేసుకోవాలి

 

నేనే నీ సొంతమైనప్పుడు అక్షరాలు అనుభూతుల్ని మాత్రమే మిగల్చాలి

మనలోని అక్షరాలు కరిగి తెల్లకాగితంలాంటి కవితలవ్వాలి

అక్షరాలు మనలోనికి  కరిగి కరిగి

తెల్లకాగితం మాత్రమే  మిగలాలి

కవిత్వం మనలోకి ఇంకి

లోకమంతా తెల్లకాగితమవ్వాలి


(కవిత్వం సంపుటి ఈ పేరున ప్రచురించాలన్న సంకల్పానికి అంకురార్పణ గా..)
కొప్పర్తి మాష్టారూ.. మీ బాటన..నడుస్తోంది నా మనసు.


RTS Perm Link

2 responses so far

2 Responses to “తెల్లకాగితం..”

  1. BVV Prasadon 04 Dec 2012 at 10:59 AM

    సతీష్, మీ కవిత బాగుంది. టైటిల్ కి బాగుంటుందా, తేలిపోతుందా చూడాలి. ఆ మాటకి వస్తే ఆకాశం కూడా ఇలాంటి టైటిలే!
    కవిత ద్వారా మీరందించిన భావం చాలా మంచిది. ఉన్నతమైనది. మీ కవిత్వం పుస్తకం గా రావటం సంతోషం కలిగిస్తోంది. మీ కవిత్వం రస హృదయుల ప్రేమాదరాలని పొందగలదని భావిస్తున్నాను. ఆత్మీయంగా..

  2. knvmvarma(vasu)on 17 Jun 2013 at 7:53 PM

    నా మనస్సు నీపై పొంగాలి,
    నేను తెల్ల కాగితమవ్వాలి.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa