Nov 22 2012

కవిని చూసాక..

కవిని చూద్దామని
అతని ఊరు వెళ్ళాను

నా ఆలోచనల పునాదుల్ని కుదిపేసినవాడు
ఆవేశపు అలజడిని కన్నీటితో కరిగించినవాడు
ప్రశాంతమైన నిద్రలేని రాత్రుల్ని వరంగా అందించినవాడు
అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపకశక్తి ప్రసాదించినవాడు

అతడెలా ఉన్నా..
ఆ కళ్ళల్లో వెలుగును చూద్దామని వెళ్ళాను
ఆనందం అనుభూతి ప్రదానమని
సూదిమొనకు సున్నితత్వం అద్దేవాడ్ని

ప్రేమను పదాలతో పంచేవాడ్ని
దయను అర్థంతో చేర్చేవాడ్ని
కానరాని వరాలను గుప్పిట అందించే
రూపం చూడ్డానికి ..ఇది ఈనాటి వలపా!!

కళ్ళను చూపుతో తడుముదామని
చేతిని చేతితో కలుపుదామని
ఇతనూ మనలాంటివాడే కదా అనుకున్నప్పుడు
నామీద నాకు గౌరవం పెరిగింది

కవిని కనుగొనాలని దిగంతాలలోకి దూకగలనా
వెలుగుని వెతుక్కుంటూ చీకటిబాటపట్టగలనా
అగ్గిన్ని జల్లే ఆకాశాన్ని చుట్టుకున్న వాడ్ని నేను
చల్లబరచే సమీరాన్ని చేరాలని కోరుకునేవాడ్ని

కలల భస్మంతో బాటలు పరిచేవాడ్ని
ఎప్పటికీ చేరని గమ్యపు దారని తెలిసినా
భుజం తట్టే చేతికోసం అలుపెరుగక ప్రవహిస్తున్నవాడ్ని

కవి సముద్రమో కాదో.. జట్టు కట్టిన సంతోషంలో తేలి
సాటి నదిలా కలసి..పారి.. జీవితం తో సంగమిద్దామని
అన్నిరుచుల మట్టినీ ముద్దాడుతూ కథ ముగిద్దామని.

(బివివి ప్రసాద్ గారి ’కవిని చూద్దామని’.. చదివాక.. కలసిన క్షణాలను గుర్తుచేసినందుకు..)

RTS Perm Link

2 responses so far

2 Responses to “కవిని చూసాక..”

  1. padmarpitaon 22 Nov 2012 at 8:03 PM

    “కవి సముద్రమో కాదో.. కలిసిన సంతోషంలో
    సాటి నదిలా కలసి.. పారి.. జీవితం తో సంగమిద్దామని
    అన్నిరుచుల మట్టినీ ముద్దాడుతూ కథ ముగిద్దామని”
    మీ భావాలకి ఈ కవితకి బేస్ ఈ లైన్స్…….
    చూసి వచ్చి ముగించకండి, మాతో పంచుకోండి:-)

  2. BVV Prasadon 04 Dec 2012 at 10:44 AM

    సతీష్ గారూ, కవిత చాలా బాగుంది. స్వతంత్రంగా వుంది. ఇది పేరడీ కాదు, అనుకరణ కాదు. ఒక కవితకి జవాబుగా మరొక కవిత. మీ కవిత కవికీ, అతని కవిత్వానికీ అదనపు గౌరవం కలిగిస్తోంది. ఇలాంటపుడు ధన్యవాదాలు చెప్పటం, సందర్భం అందాన్ని తగ్గిస్తుంది అనిపిస్తోంది. అందుకే, ఆత్మీయం గా ముగిస్తున్నాను.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa