Oct 31 2012

అందమా!! నువ్వెవ్వరు?

అందం తనమీద రాయమందో కవిత
అంగరాగాలు లేని అమ్మాయి కోసం
ఆరోగ్యమైన జవరాలికోసం, చెలువ పిల్లకోసం
ఎక్కడని వెతకను ఏకొలతన కొలవను

అద్దాన్ని అడిగా తానే అందమంది
అద్దమే అందమైనప్పుడు అన్నీ అంతేగా
ఉండాలేమో మరి అద్దంలాంటి మనసు
మనల్ని మనలా చూసుకునే సొగసు

అద్దాలమేడలో ఉంటే అందమైపోతుందా
అద్దం అందమైతే రాయికెందుకు లోకువ
రాలిపోతే పాలిపోతే పగిలేనె భళ్ళున
ఆడపిల్ల అద్దమూ వద్దు నాకీ పోలిక

రెండుకూడా పెళసరే ఎంచుకుని వేసుకోవాలి పోగిక.
ఏది మంచో లెక్కలేవి ఎందుకొచ్చిన చిక్కులివి
ఊహల్లోని బొమ్మకు పోయలేనా ప్రాణము

పుట్టినప్పుడు పురుడు పోసిన మిస్సమ్మలా
బళ్ళోకెళ్లే బుజ్జోడికి టీచర్ లా
కాలేజీ కుర్రోడికి ముందుబెంచీ అమ్మాయిలా
నాకెప్పుడు కనిపిస్తావో అందమా..

స్నానమయ్యాకా అమ్మదిద్దే నుదుటి బొట్టులా
పల్లెగట్లమ్మట నీడ పంచే చెట్టులా
కొబ్బరిముక్క పగలగొట్టి పెట్టే గుడిమెట్టులా
మారుతున్నకాలం లో మళ్లీ నిను చూస్తానో లేదో అందమా!

అందమంటే నే మిస్సైన బంధమా
కలల్లో ననుతాకే భావనా గంధమా
అక్షరాల పలుకరింపులతో
ప్రపంచాన్ని పరిచయం చేసే గ్రంధమా!!
అసలు నువ్వెవ్వరు అందమా!!

నను కన్న ఆనందమా
నే కనుగొన్న స్నేహమా
నాకింకా పుట్టని పసి బంధమా
ఎన్నటికీ అంతుపట్టని అపురూపమా
అసలు నువ్వెవ్వరు అందమా!!

RTS Perm Link

One response so far

One Response to “అందమా!! నువ్వెవ్వరు?”

  1. lakshmanon 06 Nov 2012 at 4:32 PM

    అందం అంటే ఎవరు అని అడిగారు మీరు?
    మనకన్నా అందంగా ఎవరున్నారు? ఉంటారు?
    మన నవ్వు అందం
    మాట అందం
    నడక అందం
    నడత అందం
    అందాన్ని అందమైన మాటలతో అందమైన కవితగా మార్చిన మీ ఆలోచనలు ఇంకా అందం.
    అయినా మీ కవితను మీరు రాసినంత అందంగా ఎవరైనా వర్ణించగలమా….?

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa