Aug 26 2012
బొమ్మరాళ్ళు
పేగు బంధాలు ఊళ్లేలుతున్నాయి.
రెక్కలొచ్చిన పిల్లలు పల్లె వదిలారో.. ఇల్లేవదిలారో..
కొద్దిగా ఎదిగి పోయారు
ఉన్నారన్న మాటకి పడుకునే ముందు ఫోను మోగుతుంది..
అమ్మా!.. తిన్నావా అంటూ..
మాటల్లో మనుమల ముచ్చట్లు..
ఆత్రం కొద్దీ వినేది ఉండదు..
అలా పెంచమనీ, ఇలా చదివించమనీ..
ఇప్పుడు విసుక్కోవడం తన పిల్లల వంతు
పాపం.. ~అమ్మ కేమీ తెలియదు~.
ఈ వాదనకు తర్వాత మరో-సగం బలం చేకూరుతుంది
అసలు చురకలు అంటిస్తే
వడ్డీ ముద్దు మాటలు వెన్న పూస్తాయి.
ఐనా కొమ్మల్లో కోకిలల్లా వినిపించే సంగీతమేగా వంశాంకుర రాగాలు
ఊహల్లో తప్ప కంటికి దొరకరు
వసంతం వేసవి సెలవుల్లో వస్తుందని తెలుసు
తోటా- దొడ్డీ ఆ రోజుల కోసమే పూసినా.. కాసినా..
ఊసుపోని పునికింతాలు నెలల ముందే మొదలౌతాయి
ఇంతకాలం కాయలు కాచిన కళ్ళు – చేతులూ
చెట్లకు కాయిస్తాయి.. పూలు పూయిస్తాయి
అరిగిన మోకాళ్ల మధ్య – తిరగలీ తిరుగుతుంది
నలిగిన వేళ్ళ మధ్య కవ్వం చిలుకుతుంది. వెన్న కాగి నెయ్యవుతుంది
వెన్నుఅరిగితేనే సున్నుండలు చిమ్మిలి బలమౌతాయి.
అమ్మ ప్రేమని పిల్లలు పంచుకుంటారు..
ఎవరమ్మమాట వారి పిల్లలే వింటారు.
ముసలి వాసనలకు మనుమలు మాత్రం దూరంగా ఉంటారు.
కడుక్కోవడం వచ్చేసింది కదా.. బుగ్గల్ని కూడా. అవసరాలు మారాయి
కాలం కదిలినట్టుండదు. కన్నుల పండువ కరిగి పోతుంది.
బతుకు నావ లంగరు ఎత్తే వేళ తల్లితీరం పోటెత్తుతుంది
వ్యాపార పవనాలు బంధాల్ని ముందుకి లాగుతాయి. వసంతం పారి పోతుంది.
శిశిర జీవితాల్లో మిగిలేవి ఎదురు చూపులే!!
బిడ్డలు రత్న మాణిక్యాలు ఫోను పలకరింపులు మాత్రం ఉద్యోగాల్లా చేస్తారు.
చిన్నికృష్ణులతో అప్పుడప్పుడు మాట్లాడిస్తారు..
అమ్మమ్మలు యశోదల్లా, నానమ్మలు రాధికల్లా ఆరాధనలో గడిపేస్తారు
మనసు లేని బొమ్మరాళ్ళు
వారి జీవితం లోంచే ముందుకు చూస్తారు.
అరిగిన మోకాళ్ల మధ్య – తిరగలీ తిరుగుతుంది
నలిగిన వేళ్ళ మధ్య కవ్వం చిలుకుతుంది. వెన్న కాగి నెయ్యవుతుంది
ఇక్కడ వెన్నుఅరిగితే సున్నుండలు చిమ్మిలి బలమౌతాయి…
ఆర్థ్రత నిండిన కవితతో కట్టిపడేసారు సతీష్ గారూ..అభినందనలు…
అడుగులంత అడుగులయ్యాక
ఆ అడుగులు నీ వెంట
అడుగులేందుకు వేస్తాయి?
*******
సతీష్ గారు మీ కవిత మనసుని కదిలించేలా ఉంది ప్రస్తుత పరిస్థితిని హృద్యంగా వర్ణించారు అభినందనలు
ఛా…ఎలా మిస్సైయ్యానా ఇంత అద్భుతమైన ఆర్ద్రతతో నిండిన కవితని:-( అని నన్ను నేను తిట్టుకుంటూ…
ఎలా స్పందించాలో కూడా మాటలు రావడం లేదు………మనసులో ఏదో తెలియని వెలితి………..మారాలి….మనం మారాలి……..మనుషులు మారాలి……..మనసులు మారాలి……………………మారాలి