Aug 09 2012

విషాదానికి ఓదార్పు

 

నిన్నా రేపు నడిమిట్టా ఎందుకొచ్చావ్ మళ్ళా?
పొలం లోని పంటబోదె నీరెత్తినట్టు..
గుండెకోతల జ్నాపకాలు తొలిపొద్దు నీరెండలా తొంగిచూస్తున్నట్టు.
మొన్నటి తొలకరి మింటిధార తీపిని కంటి చారల ఉప్పదనంలో కలిపేస్తున్నట్టు
తెలిసిన ముఖమేగా! ఎందుకు చిన్నబుచ్చుతావ్ మళ్ళీ?

అవసరమొచ్చినపుడే.. అపుడెపుడో శైశవం లో చిగురించావ్
బాధల్ని.. మోసే శక్తి నిచ్చి ~ఈ ఏడుపొకటి~ అనిపించావ్

చిన్నదైందని.. చిరగని చొక్కాని వదిలేస్తున్నప్పుడు..
జీవితం ముందుకి తోస్తున్నప్పుడు..
ఆశల తీరానికై బతుకునావ
ఆకలికడలి కడుపుని కోస్తున్నప్పుడు..

ఎదుగుతున్న గుర్తు గా కనీకనిపించని
చేతివంపు వళులలాగ అనిపించావ్.

ఆలోచనల చలనంలో చేయి కలిపే ఆగంతుకుడివి
ఒంటరి మననంలో తోడుండే అనుయాయివి.

అన్నిమార్లూ కన్నీరై కదలనంతమాత్రాన..
చిరునవ్వు లో నువు లేవన్నానా!!

RTS Perm Link

2 responses so far

2 Responses to “విషాదానికి ఓదార్పు”

  1. CHINNIon 10 Aug 2012 at 2:54 PM

    అక్షర విన్యాసానికి జోహారులు………నా కవితాన్వేషణలో మొదటి మజిలీ దొరికింది……….విషాదంలో విహరింపజేసిన యశస్వికి నమస్సుమాంజలి

  2. కెక్యూబ్ వర్మon 25 Aug 2012 at 9:13 PM

    ఆలోచనల చలనంలో చేయి కలిపే అగంతుకుడివి
    ఒంటరి మననంలో తోడుండే అనుయాయివి.

    అన్నిమార్లూ కన్నీరై కదలనంతమాత్రాన..
    చిరునవ్వు లో నువు లేవన్నానా!!…touching sir..

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa