Jul 19 2012

ప్రేమకై..పిలుపు


ఎక్కడున్నావు నా ప్రేమా ..
తల్లి పాలకై తపించే శిశువులా పూలు నీకై చూసే తోటలోనా!!
నీరు పెడుతూ ఆ చిన్ని స్వర్గం లోనా!!
నీ గౌరవార్ధం పూజజరిగే గర్భగుడిలోనా..
మనసు ఆత్మల త్యాగ క్రతువు ను జరుపుతూనా!!
లేక జ్ఞాన పూర్ణత్వాల కలబోతగా మానవతను అందించే పుస్తకాలలోనా..

నా ఆత్మవిజేతా! ఎక్కడున్నావ్! ప్రార్థనాలయంలోనా.. ప్రకృతి ఒడిలోనా
నీ కలల లోకపు విహారి గా నా!!
నీ మనో మాధుర్యం తో స్వాంతన చేకూరుస్తూ..
నీ ఉదారత తో పేదరికం పారద్రోలుతూ..
ఆర్తులను ఓదారుస్తూ… వారి గుడిసెల్లోనా.. వారి గుండెల్లోనా!

కాల చక్రానికి నీ శక్తి.. పరమాత్మ గా నీ పరివ్యాప్తి..
అంతు చిక్కనిదెవరికీ!!
గుర్తుందా! మన కలయిక.. నీ భావన లో.. నీ ప్రస్తుతికై ..
దేవదూతలే చుట్టుముట్టి తేలియాడిన నాడు…
మానవత కు నీడగా పక్కటెముకల రక్షణ లో విస్తరించిన రహస్యాన్ని.. గుండె చప్పుడుని.
చేయి కలిపి మనం నడచిన ఆడవులూ,అడుగుల జాడలూ
తనువు వంచి మన నుంచి మనమే దూరంగా ఒకరినొకరిలో ఒదిగిఉన్న రోజులు ..

మననంచేసుకో.. వీడ్కోలు పలికిన. క్షణాన నా పెదాలపై అద్దిన ఎడబాటు ప్రేమ చిహ్నం
అది నాలుక మునుపెన్నడూ తెలుపని దేవరహస్యం.
ఓ దైవ శ్వాస మనిషైనట్టు ఓ పెద్ద నిట్టుర్పు కి అది ఆది.
నన్ను ఆధ్యాత్మిక లోకానికి కొనిపోయిన వారధి.
మనం తిరిగి కలిసే వరకూ నా వైభవానికి అమరత్వం అందించిన కానుకది.

ప్రాపంచిక కారణాలకే ఈ ప్రపంచం విడిపోతుందని .. లోకంపోకడకే తలవంచి ఒదగాలని..
కన్నీళ్లు ముద్దాడిన చెక్కిళ్లతో నీవు నాకు చెప్పిన గుర్తు.
కానీ ఆత్మీయమైనది ప్రేమ చేతుల్లో నిలచి ఉంటుంది.
భద్రంగా చివరివేళ దైవానికి చేర్చే వరకూ.

ఓ ప్రియతమా! ప్రేమ నన్ను తన ప్రతినిధి గా నియమించుకుంది.
జీవన మాధుర్యాన్ని అందించే సౌందర్యమిది.
నా మరో పార్శ్వమా! నీవెక్కడ? నిశీధి లయలో నిలిచివున్నవా!
పవిత్ర పవనాలు నా ప్రతి హృదయస్పందన, మమతలను నీ దరికి చేర్చనీ.
నీ ఊహలలోని నా ముఖాన్ని లాలిస్తున్నవా!! ఆ రూపం ఇప్పుడు నా స్వంతం కాదు.
విషాద నీడల మాటున ఆనందపు అందం మరుగైందియిప్పుడు

నీ అందాన్ని ప్రతిఫలించే నా కళ్లు, నా పెదాలు ఎక్కిళ్ల ధాటికి తడారిపోయాయి.
నా ప్రియతమా! ఎక్కడున్నవ్!! సాగరతీరాలవతలకు వినిపిస్తుందా నా రోదన!!
నా సహనపు ఔన్నత్యాన్ని గుర్తించావా!! నా అవసరం తెలుస్తుందా!!
నా యవ్వనపు ఆఖరి శ్వాస ను నీకు చేర్చే కాంక్ష ఏమైనా వీచే పవనానికి ఉందేమో!!
దేవదూతల వర్తమానాల్లో నా ఆరోపణల ప్రస్తావన గూడంగానైనా అందిందా!!

నా సౌందర్య తారా! నీ ఆచూకీ ఎక్కడ!! జీవన మార్మికత నా ఉనికిని మాపింది.
విషాదం నన్ను జయించింది.
నీ నవ్వును గాలిలోకి రువ్వు. నను చేరి ఉల్లాసపరుస్తుంది.
నీ సుగంధాన్ని గాలి శ్వాసించనీ.. అది నన్ను ఆదరిస్తుంది.
ఎక్కడున్నావ్ ప్రియా.. నీముందు నేనెంత అల్పుడ్నో..

khalIl jibraan’s “ A Lover’s call కు స్వేచ్చానువాదం

RTS Perm Link

One response so far

One Response to “ప్రేమకై..పిలుపు”

  1. padmarpitaon 25 Aug 2012 at 5:27 PM

    superb pic and post.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa