Jun 19 2019

||ఏడాదికీ.. అన్న||

Published by at 5:14 PM under my social views

యశస్వి…

కట్టా శ్రీనివాసు ఏమైనా చుట్టమా? నేస్తం… అంటే – కేవలం ఇష్టమేనా? అంటే.. ఏమో! అంతకు మించి ఎంతంటే ఏం చెప్పగలను!

కవిత్వాన్ని తల్లి లీలావతి అనుకునే లెక్క లేని పద్యం సోదరుడు, 
అమ్మ గిరిజావతి వల్లె వేయించిన పాదాల్ని పట్టుకుని ఇంతదూరం నడిచొచ్చి కవిసంగమంలోనే కలిసాను, సూఫీఘర్ ములాకాత్ లు మావి. సారమున్న మనిషి తనం తనది..

బంధుత్వాలు లేకున్నా సోదరుడు అనుకోవడం వెనుక క్విడ్ ప్రోకో ఏం లేదు, నిండుగా నవ్వేందుకు, తనివిదీరా ఏడ్చేందుకు. 
నేను ఏడుపును మాటల్లో పెడతా, తను నవ్వేసి నను తేలిక చేస్తాడు.

“నువ్వూ, నేను ఏకవచనమై దూరంగా వున్నా, మనమనేది నిజమే ననే దీపపు వెలుగుల ఓ చిర్నవ్వునివ్వు.. తన పద్యాన్నే అప్పజెప్పాను ఓనాడు అలాగే సోదరా అంటూ. .. నవ్వేశాడు. 
అప్పుడు కట్టుకున్న రాఖీ రోజు రోజుకీ ముడి బిగిసింది గానీ వదులు కాలేదు.

గుద్దులకు రోడెక్కుతారుగానీ, ముద్దులకు మదగ అవసరం కదా. ఎంత ఇష్టమైనా ఇలా ఓ మాట చెప్పుకోవడానికి ఈ రోజు కొత్తసంవత్సరం తెర ఎత్తాక గానీ కుదరలేదు. అందునా నాకన్నా ముందే ఏడాదికి అన్న,…

జనవరి ఒకటో తారీకునే..! ఈ పండగనాడే పుట్టేశాడు. పండుగంటేనే తలచుకునే ఒక సందర్భం, దేవుడ్నీ సంతోషాన్ని. ఇదిగో ఇలాంటోడ్ని, లేదా పాపం తగిలి లావైపోనూ!

కంట్రోల్‍ – వీ మాటల్లో చెప్తున్నాననే అనుకోండి, కొత్తదనం కోసం ఐ లవ్ యూ ని మార్చి చెప్పలేం, మనసు వెచ్చదనం కోసం హత్తుకోవడానికి ప్రత్యామ్నాయాలు నియమాలు ఒప్పుకోవు. కవితాకేళి లేకపోతే విడివిడిగా ఎగురుతున్న ఇద్దరి మధ్య దారపు బంధం కనిపించదు ఎవరికీ.

ఎన్నింటికి రుణపడిపోవాలో ఈ వేదికకి! అన్న యాకూబ్ కీ. బంధాలనూ, స్నేహాన్ని, వృత్తిని భాద్యతగా కాకుండా ప్రాణంగా చూసుకునేవాళ్ళెవరు కనిపించినా అదికూడా అమ్మే అనిపిస్తుంది అంటాడు ఈ నాన్నపేగు.

అనుక్షణం అండగా ఉండడం, ఆలోచనలో తోడుండడం, తన జ్ఞాపకం తడిగా ఉండడం ఎక్కడ ఉన్నా నా నీడని పలుకరించే వెలుగుతోడు నీ అంతర్లోచన వాక్యాలు. మనుషులర్ధం కావాలంటే లోపటి లోకాల ఊసులు తెలియాలి. గుండె లోపలికి ప్రేమను ఒంపుకుని చాపే చేతులతో హృదయాల్ని అందుకోవాలి. అది నీకు తెలిసిన విద్య కట్టన్నా. అందుకే నువ్వు చానా ఇష్టం.

నీరోజును నువ్వు నీలానే గడిపేస్తుండేటప్పుడు, లోకం మొత్తం ఆనందంగా ఉండడానికి ఆరాటపడుతున్న ఘడియల్లో ఈ తాటాకు చప్పుళ్లెందుకు అంటావా.. అది నా ఇష్టం.

నిలిచిపోయిన మురికినీళ్ళ సాగరం మధ్యలో కవిగా నా బొమ్మ ఉండటం కంటే, పరుగులెత్తే లక్షల కళ్ళ వాకిళ్ళున్నమెట్రో ప్రవాహపు గోడలపై నావి నాలుగక్షరాలు అంటిస్తే సంతోషపడతాను. ఇదేమాట నువ్వు కాకుండా ఇంకెవ్వడన్నా అనుంటే ఈ పాటికి ఓ విగ్రహం నిలబెట్టి దానికి ముందు అభ్యుదయం పేరెట్టి.. కింద ఈ మాటల్ని చెక్కిపెట్టేవారు. లేదా ఆ మెట్రో పిల్లరుకే గ్లోసైన్ బొర్డు వేలాడదీసేవారు. సదరు పేరు మీద ఓ అవార్డు కూడా పెట్టుండెవారేమో!

మామిళ్ళపల్లి వారి పందిరికింద పూసిన నీ సుమమే అమృత లతై 
గగనానికి తొంగిచూస్తున్నప్పుడు ఏ కొలతకు దొరుకుతావు నువ్వు! కౌగిలింతకు తప్ప.. అందుకే ఈ బంధనం.

నా పేరు పలికితే రుచి ఏం తెలుస్తుంది! కళ్ళారా అనుభవించు.. నా పిలుపును ఏడాదంతా.. ఎడదంతా.

వీలైతే నాలాంటోడ్ని జీవితాంతం. ఇలానే.

Katta Srinivas 
=01.01.19=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa