Mar 27 2018

యశస్వి ||వెడలె.. విశ్వంధరుడు

Published by at 1:42 PM under my social views

ఎవరన్నా అనుకున్నామా!
నడవలేనోడు, మాట్లాడలేనోడు,
పళ్ళు తోముకోలేవడం కూడా చేతకాని వాడు
పాలపుంతల రహస్యాలను ఛేదిస్తాడని!

చొంగ కారితే తుడుచుకోలేనివాడు
చక్రాలకుర్చీ లో కూలబడ్దవాడు
మరణాన్ని మోసుకుతిరిగినోడు
కనబడని లోకాల అరలు తీసి సామాన్యుడికి చూపుతాడని

మోటార్ న్యూరాన్స్ వ్యాధి చుట్టబెడితే
నిలబడలేక కూలబడ్డా, మాటలు మూలబడ్డా
చచ్చుబడుతున్న మెదడు తోనే
సృష్టి సిద్దాంతాల్ని కొత్తగా ప్రతిపాదించాడు

కాల చరిత్రని రాస్తున్నవాడ్ని అవిటితనం ఆవహించుకుంది;
అగాధా క్రిస్టీ, హెల్న్ కిల్లర్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్,
ఫిడేలు నాయుడు గార్లను కలుపుకుని
గొప్పతనాన్ని తనకు అతికించుకుంది

ఇతడు కాల్పనిక సాహిత్యాన్ని సృజించలేదు
పుట్టు ఇబ్బందులు పడ్డాడో, లేదో
రాజనీతిజ్ఞుడా! కాదు;
సంగీత మయుడా! ఊహూ..
అయినా గొప్పతనాన వారి సరసన మెరిసాడు

మత కాల్పనికత నడ్డి విరగొట్టే నిజాలతో నిగ్గు తేల్చాడు
పుట్టుకతో చెప్పి ఒప్పిస్తున్న కథల గుట్టుని
ఈ శాస్త్రనీతిజ్ఞుడు బట్టబయలు చేశాడు
ఖగోళ విభావరిలో కనబడని వాటికీ దివిటీ పట్టాడు

సత్యం చెప్పిన వాళ్ళని మట్టుపెట్టిన చరిత్ర
చర్చల్లోంచి ఇంకా వైదొలగిపోలేదు
ఆర్కిమెడిస్ నుంచి గెలీలియో వరకూ హింసించిన మతమే
తమ మతాధిపతిని ఈ మేధ ముందు మోకాలి పై నిలిపింది

మనిషంటే మేధ.. అన్న ఐన్ స్టీన్ కి అక్షరాలా వారసుడు
న్యూటన్, చార్లెస్ బాబేజ్ ల పరంపరలో
లూసియన్ పీఠానికి వన్నెతెచ్చినవాడు
తప్పనిసరి మార్పును ఆకళించుకోవడం
తన తీరుగా లోకానికి చూపినోడు

ప్రళయం ముంచుకురాలేదు;
అయినప్పటికీ అతిశీతలం ఏర్పడింది
మేధో సాధన చేసిన కాయం
ఇక ‘పై’రోజున పూర్తిగా మ్రాన్పఁడిపోయింది

తనని చుట్టుకున్న వైకల్యాన్ని
మాటవరసకైనా తిట్టుకోని వింత జీవి

విశ్వాంతర విద్యాలయ శిక్షణలో
దీక్షాతపనల ఏకలవ్యుడు

అంతుపట్టని సృష్టి రహస్యాలను
అతికష్టం మీద కదిలే
తన చూపుడు వేలికోసలతోనే
సమాధానాల చమత్కారాలుగా మలచినవాడు

సిద్ధాంతీకరణలు కట్టిపెట్టి
ఇప్పుడే.. శరీరాన్ని వదిలిపెట్టి
కార్యరంగంలోకి దిగాడు..

అదిగదిగో..
అక్కడెక్కడో కృష్ణ బిలం కూడా మెరుస్తుంది.
నేలపై నక్షత్రం పేలిన శూన్యత
విశ్వమంతా వ్యాపిస్తోంది.

మరణం పై ఇతడి నిర్వచనాన్ని కాదని
ఈ ధ్రువతార స్ఫూర్తి ని శతాబ్దం అంతా కొలుస్తుంది

విశ్వ విజ్ఞానాన్ని సామాన్యుడికి చేరువ చేసిన వాడు
గ్రహాంతరాళాల రహస్యాలను ఛేదించి మరలివస్తాడని
దేవుడి ఎజెండా ను వెలికి తెస్తాడని
మరో రూపాన మలి రాకకై లోకం ఎదురుచూస్తుంది

స్టీఫెన్ హాకింగ్స్! నా విశ్వంధరుడు!!
విశ్వాన్ని వదిలి ఎక్కడికి పోతాడు!
కాల చరిత్ర రాసినవాడిగానే కాదు;
కాలానికిఎదురీది నిలిచిన సాహసిగా
నా హృదయ తరగతి గదుల్లో
నిత్య మననమై నిలుస్తున్నాడు

=15.3.2018=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa