Aug 19 2017

యశస్వి ||నా ముద్దు గోల..||

Published by at 11:38 AM under my social views

చిన్నప్పుడెప్పుడో అనడానికి ఇది అనగనగా కధ కాదు
ముద్దుల మధ్యన పెరిగాననడం అబద్దం లాంటి కల కాదు
ఏడుపు ఎందుకు వస్తుందో కారణం ఇప్పుడే అవగతం కాదు
ముద్దుపెట్టడమొక్కటే అప్పటికి ఇప్పటికీ అవసరం నాకు

పిల్లలందరూ ముద్దుగా ఉంటారంటే ఒట్టిమాట కాదు కదా
ముద్దుల్ని మూటకట్టి పగలంతా స్కూలు లో దాచిపెట్టినప్పుడు
తుళ్ళిపడే పూల తోటలో ఒద్దికైన పువ్వులా నేనుండడం
ఇంతముందుకు వచ్చాక తలచుకోవడమూ ముద్దే కదా

అమ్మకే కాదు క్లాసులో అమ్మాయిలకూ నేను ముద్దే
అమ్మాయిల కన్నా ముద్దుగా ఉండే టీచరమ్మకి మహాముద్దు
నా బుగ్గల మీద ముద్దుల ముద్దరలు చూడలేక
ఆమె కురులలో గులాబీ రోజూ ఎర్రబడి రెక్కలు వాల్చిన గుర్తు

అలా అలవాటైన ముద్దు ఎదుగుతున్న కొద్దీ ముద్దుగానే దూరమైంది
అమ్మ ముద్దు మినహాయింపు కాదు గానీ
నా బుగ్గలకీ ఊహల్లో పెదాలకీ మధ్య
ఆలోచనల గడ్డిమైదానమై గుబురుగడ్డం పెరిగింది

సినిమా హీరోల షేవింగులు, విలన్లకు గడ్డాలు
పెళ్ళయిన వాళ్ళ పెదాల ముద్దు ముందు మల్లెపూల మంచాలు
ఎవరినన్నా అలా ముద్దు పెట్టుకుంటే
ఆ తలంపే అయ్యబాబోయ్ అనిపిస్తూ ఉండేది

పొరపాట్న ముద్దుకే పిల్లలు పుట్టేస్తారేమో
ప్రేమిస్తే ఇంకేమన్నా ఉందా అన్న భయంతోనే
స్కూల్ చదువంతా గడచిపోయింది
కళ్ళు పెట్టె ముద్దులతోనే కాలం కరిగిపోయింది

తొమ్మిదోక్లాసు సైన్స్ పుస్తకం 53 వ పేజీ
బొమ్మల్ని చూసి అమ్మాయిలు అబ్బాయిలు నవ్వుకున్నామే
ప్రశ్నలకు జవాబు సరిగా రాసినా అర్థం కానిది
కాలేజీ కబుర్లలో ఎలా అర్థం అయ్యిందో!

ఊరించే శరీర మార్పులు కొత్తగా చూపించే లింగభేధాలు
ఆనాటి ఆలోచనలకి సరికొత్త చేర్పులు
అన్నీ అవగత మయ్యాకా అబ్బాయిది
ఓస్ ఇంతేనా అనుకునే ఆరిందాతనం

అబ్బాయి ఉద్యోగం సాధించి పెద్దమనిషి అవ్వాలి
అది మగాడికి తప్పని సరి కష్టం
దేవుడు అడోళ్ళ పక్షం
అన్నీ ఆడవాళ్లకి అడక్కుండానే ఇస్తాడనుకునే అమాయకత్వం

అయినా ఓ అనుమానం! మనకోసం పుట్టింది
కళ్ళముందుఎదురుపడితే గుర్తెలాపట్టాలి
మనక్కూడా జరుగుతుందా హీరోలకి జరిగినట్టే
అనుకున్నా గట్టిగా ఎవర్నీ అడగకుండా ఎప్పటికైనా కనిపెట్టాలి

ఉద్యోగమొచ్చి పెద్దమనిషయ్యాకే
పెళ్ళి చేసి చేతిలో పెట్టారు ఇష్టం అన్న అమ్మాయిని
అప్పుడు గుర్తొచ్చింది ఎప్పుడో ఊరించిన ముద్దు
అడిగితే అమ్మలా నవ్వి బుగ్గమీద ఒకటిచ్చింది

ముద్దు పెట్టడం వరకే గుర్తున్నందువల్ల
పిల్లాడు పుట్టడానికి ముద్దే కారణం అని బలంగా నమ్మాను
ముద్దే లేకపోతే అంత ముద్దుగా పిల్లలెలా పుడతారు
పుస్తకాలలో ఏదో పరీక్ష పాసవ్వడానికే అబద్దాలు రాస్తారు

పెళ్ళైన ఎంతో కాలానికి అప్పుడు పుచ్చుకున్నదేదో తిరిగివ్వమంటే
మరో పిల్లో పిల్లాడో పుట్టేస్తే ఎలా అనుకున్నంత ఆదుర్దాగా
ముద్దు కన్నా ప్రమాదకరమైనదింకేంలేనట్టు.. ఏదో అంటుంది నన్ను..
ఇప్పుడన్నీ నాకు ముద్దు ముద్దుగా వినబడతున్నాయి

=15.8.2017=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa