Jul 16 2016

యశస్వి|| ఆగి…..||

Published by at 4:36 PM under my social views

11957596835_d1d61e5ae8_b
ఆగాలి..
అప్పుడప్పుడు ఆగాల్సిందే..
గమనం ఎంత అవసరమో
విరామం అంతే అవసరం

పడిపోకుండా ఉండేందుకు ఆగాలి
నడక నడకకి నడుమ నిలబడడం
నిలబడడాల మధ్య కూర్చోవడం
కూర్చోవడాల మధ్య పడుకోవడం.. కోసం

దొంగ పరుగులు పెట్టే కొంటె వయసులో
అమ్మ ఆగమన్నప్పుడు ఆగావో లేదో
తగిలిన దెబ్బేమైనా నేర్పిందో లేదో
పెద్దయ్యాక ఆగాల్సిన సందర్భాలెన్నో

నిద్రమత్తు వదిలించుకోకుండా నేలన కాలుని ఆంచి
పరిగెత్తాలనుకుంటే
పడతామో లేదో చెప్పుకోవాలా!
కంగారు పడ్డట్టే

పదహారు గంటల మెలకువకి
ఎనిమిది గంటల విశ్రాంతి మాత్రమే కాదు
పదానికి పదానికి మధ్య అర్ధమయ్యేందుకు
నిశ్శబ్దాన్ని పలకడం కోసం..
అప్పుడప్పుడు ఆగాల్సిందే

పనిలో నిమగ్నమైఉన్నప్పుడు పై అధికారి వచ్చాడని
కాపీని దాయలేక ఇన్విజిలేటర్ కి దొరికిపోయిన కుర్రాడిలా
తత్తరపాటు పడి నిలబడ్డామా!
మనపై, మన పనిపై తేలికభావాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే

అదే క్షణంలో సగం కాలమైనా
ఆ రాకను గమనించినట్టు ఒద్దిక చూపామా
ఆగడం తనకున్న మరో అర్ధాన్ని
తిరగేసి చూపిస్తుంది

అసలా ఉద్యోగమే ఏం చెప్పాలో తెలియని వేళ
మాటలాపి నవ్వినందుకే వచ్చుంటుంది
ఇంటర్వ్యూ గది ముందు అడుగాపి
గుండెలనిండా గాలిపీల్చినందుకే వరించి ఉంటుంది

సహచరితో సాన్నిహిత్యపు సమాగమం లో
ఆగాల్సిన అవసరాన్ని సూచించినప్పుడు
ఎంత కాగి ఉన్నా ఆగక తప్పదు
అశనాన్ని నివారించేందుకైనా ఆగాల్సిందే

ఆగడం మనం మర్చిపోతున్న బాల్యం
పరిగెట్టడం తెచ్చిపెట్టుకున్న లంపటం
నడవడం ఈ రెంటిమధ్య పేరుకున్న పరధ్యానం
ఆయాసమొచ్చి ఆగడం కాదు
అవసరమైనట్టూ ఆగడం ఎట్లానో గుర్తు తెచ్చుకోవాలి

ఆగడమంటే పరికించడం, పరిశీలించడం
మన ఉనికిని నిర్ధరించడం
రక్తప్రసరణని క్రమబద్దం చేయడం
స్వవ్యవహారాన్ని నిర్వహించడం

రోడ్డున నడుస్తున్నప్పుడు
పాదచారుల సౌకర్యం కోసమే కాదు
ఊడ్చే పనివారి వెసులుబాటు కోసమైనా ఆగాలి
రోడ్డు దాటుతున్నప్పుడు
వాహనాల నుంచి రక్షణ కోసమే కావచ్చు
అవసరమైతే వారిని ఆపి మనం ముందుకు సాగాలి

నువ్వే వాహన దారుడి వైతే
ఎర్ర సిగ్నల్ దగ్గరేనా!
మనవల్ల ఇబ్బంది కలగకూడదని ఆగాలి
లిఫ్ట్ దగ్గర ఆడవారికోసం
టాయ్లెట్ దగ్గర ఆపుచేసుకోలేనివారి కోసమో
రైలో బస్సో ఆగినప్పుడు దిగేవారికోసమో
ఆగాలి; అందరి ప్రయాణం సాగాలి

మాట్లాడేముందు
పర్యవసానాలు బేరీజువెయ్యడానికో
పని మొదలెట్టేముందు
సాధ్యాసాధ్యాలు అంచనావెయ్యడానికో
చెప్పేముందు పాటించడానికో
ఇచ్చేముందో, పుచ్చుకునేముందో
ఇరువైపులా గుర్తుండేటట్టు
ఓ అత్మీయ క్షణాన్ని ఆస్వాదించడానికో ఆగాలి

ఆగకపోతే వచ్చే పర్యవసానాల్ని
చర్చించుకోకుండా ఉండాలంటే..
ఒక లెక్కగా ఆగాలి..
ఆగి సాగాలి.

=15.7.2016=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa