May 16 2016

యశస్వి|| ఆ డాక్టరు బొమ్మకే.. ఈ లేఖ||

Published by at 5:14 PM under my social views

1_n

యువరాణిశ్రీ డాక్టరమ్మ గారికి … ( మూడు చుక్కలు)

ఇంతకాలం మబ్బుల్లో ఉన్న జాబిల్లిలా…
వంటగదిలో పాలు తాగే పిల్లిలా…
వేసవిలో విరిసే మల్లిలా…

చడీ చప్పుడు కాకుండా
వెన్నెల కురిసీ కురిపించక,
సంతోషాల పాలు ఉంచీ ఉంచక,
మోము చూపించక అక్షరాలతోనే అలరిస్తున్న మీరు…మా బొమ్మగారూ!!

ఇలా హటాత్తుగా
వేసవిలో పూసే మల్లిలా జాబిల్లిలో కనిపించే చెవుల పిల్లిలా
చుట్టూరా వెన్నెలకట్టుతో వర్షం రాకకై ఎదురుచూస్తున్న
ఏ భూసురుడి పాలిటో వరంలా
నిజరూపంతో ముందుకు రావడాన్ని
తీవ్రంగా ఖండిస్తున్నాను

గుట్టుగా నా రెండుమాటలకూ
మీ పసి మెరుపులను అద్దుదామనుకున్న ఒప్పందం..
కావేరీ నది కనికట్టు వరదల్లో కొట్టుకుపోయింది.

వికీపత్రాల మాదిరి నిప్పులాంటి నిజాలు
వెన్నెలలాంటి లావణ్యాలుగా బట్టబయలైనందుకు
ఒకింత బాధ కలిగింది…

మృదు భావాల కూనిరాగాలతో
కవ్వడిలా ఆంగ్లేయాంధ్ర కవనాన్ని
ఓ పువ్వు బొమ్మ వెనుక చిలుకుతున్నప్పుడు
ఆ లేరాతల సౌందర్యం…
ఈ జింకపిల్లని అక్షరాలలో చూపించినా
జనం గమనించకపోవడం ఎంతటి వైపరిత్యం!
అందుకు ఈ లోకాన్ని మన్నించాలి మీరు

నిత్యం పిల్లలతో, రోగాలతో
రోగాల పిల్లలతో, పిల్లరోగాలతో
కేరింతలతో, బాలింతలతో ఆసుపత్రి గదుల్లో వేగే మీలో

రాగాలతో కూడిన ఓ భావుకత ఉంటుందని
దానికవతల మీదైన సొంత జీవితముంటుందని
తెలిసీ తెలియక మీ రూపు చూసి
పెళ్ళి సంబంధాలను కదిపే పెద్దల(!) వరుసలో
నన్నూ కలిపేసుకుని ఈ అభ్యర్ధన పత్రాన్ని రాస్తున్నాను

మీరు మమ్మలని మళ్ళీ మన్నించాలి
అసలే అమ్మాయిలు కరువైన లోకంలో
మీరొక మలయసమీరంలా ఆనిపించారు
అసలు బొమ్మ చూపించేసి ఎంతపని చేశారు! 🙂

అబ్బాయిలంతా అమెరికాలకు ఎగిరిపోయి
“నాన్నా! నా పెళ్ళిక్కడో సీమదొరసానితో
అయిపోయిందని” ఎక్కడ చెబుతారో నని
తొందరపడి ఆ మల్లెపువ్వేదో
ఈ తోటలోదైతే చాలు అనుకునే
దేశభక్తులం మేం. ఇందులో మా స్వార్ధం లేశం

అయినా హరికౌస్తుభం లాంటి అమ్మాయి
నెట్టింట పరిచయమైనప్పుడు
నట్టింట తిరగాలని ఎవరు కోరుకోరు!

అందుకనే వేడుకుంటున్నా
నా పదకొండేళ్ళ పిల్లాడు పెళ్ళిడుకొచ్చేవరకూ
మిమ్మల్ని కాస్త ఆగమంటున్నా
ఎవరెన్ని సంబంధాలు తెచ్చినా మీకు వద్దంటున్నా

ఆడపిల్లలంటే అసలు పడనోడికి
రవీంద్ర నారాయణ్ లాంటి జులాయోడికి
వాడు వయోలెంట్ గా మారకుండా
మిమ్మల్నీ, పూలనీ కలిపి చూపిద్దామనుకుంటున్నా
మరి.. కొద్దికాలం..
ఓ పదేళ్ళు
ఓపిక పడతారా! డాక్టరమ్మా!!

= 14.5.2016=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa