Apr 28 2016

యశస్వి ||నిరతాన్నదాత్రి నిష్క్రమణరోజున..||

Published by at 6:24 PM under my social views

egnpex2015spc01

“…..ఎన్నోపాఠాలు చదివుంటాంరా…
పరీక్షలయ్యాక ఏదైనా గుర్తుందా!
ఎక్కాలు గుర్తుంచుకుని లెక్కలు మర్చిపోవడమే
పాఠాలు మరచి గుణపాఠాలు నేర్వడమే జీవితమంటే..”
వక్కాడించాడు బాల్య మిత్రుడు

నవ్వుకుని నేనన్నాను!
-నీకుందో లేదో జ్ఞాపకం
ఎనిమిదో క్లాసులో డొక్కా సీతమ్మ పాఠం
నే చచ్చినా మర్చిపోలేను..

ఆమె చనిపోయాకా ఇంటి పైకప్పు నుంచి
కాంతి పైకి పారడం ఇప్పటికీ
లంకగ్రామాల్లో చెప్పుకుంటారు..
ఈ రోజుకి ఆ సంఘటన జరిగి వందపైన తొమ్మిదేళ్ళూ..-

“ సినిమాటిక్” కొట్టిపడేశాడు వాడు

అప్పుడన్నాను…

*నువ్వెప్పుడన్నాఅన్నంపెట్టే పద్దతిని బట్టి ఓ ధనవంతుడు
ఒక్కపూట ఆకలితీర్చిన ఓ పేద పిల్లని పెళ్ళాడడం విన్నావా!

*ఆ జోగయ్య పంతులే తను వైద్యం చేసే ఊరి పశువులన్నిటినీ
నయమయ్యేదాక తన తోటనే మేపడం అబద్దమా!

*భర్తది మూగ జీవాల ఆకలితేర్చే మనసైనప్పుడు
ఆమె అన్నార్తుడి పట్ల అమ్మ కాలేదా!
బాటసారులంతా భోజనం అయ్యాక
ఆకళ్ళను తీర్చిన ఆప్యాయతకి చేతితోపాటు
కళ్ళనూ కడుక్కోవడం అబద్దమెలా అవుతుంది!!

*మారువేషాల్లో జమీందార్లు
అమ్మ వడ్దిస్తే తిని ఉవ్విళ్ళూరడం అబద్దమా!

*అప్పుచేసి అన్నం పెట్టిన రోజులున్నా..
అగ్రహారాలను ఈనాములుగా అందుకోవడం
తప్పనుకున్న దంపతుల కధ అబద్దమా !

*కడుపు నిండినోడి కబుర్లని కొట్టేయకుండా
ఆనోటా ఈ నోటా కోటలు దాటి బ్రిటిష్ రాజు
చెవినబడ్డందుకు చెలించి తన పట్టాభిషేకానికి
డిల్లీ రమ్మన్నా, ఇల్లు కదిలితే అన్నం పెట్టేదెవరని
తిరస్కరించిన సందర్భం అబద్దమా!

*ఆమె రూపాన్ని నిలువెత్తు కడిగించుకుని
ఆమె కూర్చోవాల్సిన స్థానంలో ఉంచాలన్న రాజు కోరిక
విశాఖ కలెక్టరు తీయించి పంపిన
ఛాయాచిత్రం అబద్దమ్మా!

*దర్బారు హాలులో బొమ్మనే గౌరవించుకోవడం అబద్దమా!
రానందుకు నొచ్చుకోక
పంపిన బంగారుపతకం, ప్రశంశాపత్రం అబద్దమా!

విశ్వస్త వడ్డింపగా ముద్దముట్టని శ్రీనాధులెందరో
ఈమె ఇంటిని అంటకాగిన రోజులెన్నో
ఈ అప్రజాత అక్కున జేర్చుకున్న ఆర్తులెందరో
ఈమెలో అమ్మల గన్నఅమ్మని కన్నారు;
అపర అన్నపూర్ణ అని అన్నారు

అన్నం పెట్టడమంటే ఓ ముద్దపాడేసి
మింగరా అనడమనుకున్నావా!
బిడ్ద కడుపు చూసి తల్లి పాలిచ్చినట్టు
ఎండనబడి వచ్చినొడికి అంబలి తాగించినట్టు

అంత్యకాలంలో కాశీ వెళ్ళే సంకల్పంతో
బండి కట్టించుకుని బయల్దేరిందంట సీతమ్మ

ఆరాత్రి ఆగిన సత్రంలో వినపడ్డ మాటలు
డబ్బుల్లేక అర్ధాకలితో ఓ కుటుంబం
మరునాటి దాకా వోర్చుకోమని
సీతమ్మ ఇంట కడుపార తిందామని
పిల్లాపాపలకి సర్దిచెప్పుకుంటుంటే

కాశీ వెళ్ళాల్సిన సీతమ్మ బండి రాత్రికిరాత్రే వెనక్కుమళ్ళింది
అతిధులు వచ్చేలోగా ఇంటికెళ్ళి వండివార్చిన అమ్మ
యాత్ర లో తనువు చాలించడం కన్నా
ఆకలికడుపుకు అక్షయపాత్ర కావాలనుకున్న అమ్మ

పైవన్నీ మనం చూడని కళ్ళన
లోకం నిజాలుగా నమ్ముతున్నప్పుడు..

కులం మతం అడక్కుండా కడుపు నింపినమ్మ
కోనసీమ అన్నపూర్ణమ్మ
అతిధిని దేవుడ్ని చేసి అన్నాన్ని ప్రసాదం చేసినమ్మ
మా మర్యాదలమూలపుటమ్మ
డొక్కా సీతమ్మ..

ఆ ఆమ్మ..
కాలం చెల్లి; ఆ తల్లి కాంతిగా మారిందంటే
ఆ నిజం నీళ్ళునిండిన కంటికే తప్ప
తర్కానికి అందదురా అన్నా.

అన్నం తినే వాడెవడన్నా
నామాట కాదంటాడా!

=28.4.2016=
(ఈరోజు డొక్కా సీతమ్మ గారి 109 వ వర్ధంతి)

ఉదయం అన్నయ్య Pydikondala Manikyalarao​ update చూసి
ఎంత రాజకీయనాయకుడైనా అన్నం పెట్టే చెయ్యేకదా! గుర్తుంచుకున్నందుకూ, గుర్తుచేసినందుకూ.. ప్రేమతో..

RTS Perm Link

One response so far

One Response to “యశస్వి ||నిరతాన్నదాత్రి నిష్క్రమణరోజున..||”

  1. విన్నకోట నరసింహారావుon 29 Apr 2016 at 2:40 PM

    సందర్భోచితమయిన పోస్ట్ వ్రాసారు. మహాతల్లి డొక్కా సీతమ్మ గారు చిరస్మరణీయురాలు.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa