Apr 25 2016

యశస్వి ||చూపులు కలవని వేళల్లో||

Published by at 5:48 PM under my social views

IMG_20150717_164151

ఒక్కొక్కసారి అంతే
కళ్ళల్లోకి చూడలేం; చూడబడం
కారణాలు ఇదమిత్థంగా తెలియవ్
ఒక్కొక్కసారి అంతే

చూపులు మెచ్చిన అమ్మాయి చూపుల్ని
పద్దతైన పెంపకాలు కిందకి దింపేసినప్పుడు
ఎదురుచూసే కుర్రమనసుకి ఉసూరుమనిపిస్తుంది
అవే చూపులు తడబడి తడిమినప్పుడు
గుండె తీగెలో అనురాగం పెల్లుబికి వీణల్ని మీటుతుంది

అవసరానికి అప్పుచేసి ఇవ్వలేనప్పుడో
తెలిసో తెలియకో తప్పుచేసి దొరికినప్పుడో
అవతలి వైపుచూడడం అంటే
గగనంలో సూర్యుడ్ని చూడడమే కదా!

పక్కన ఉన్నవారెవరైనా కనిపెడితే
గ్రహణం పట్టినట్టే
గడ్డం బయటినుంచే గొంతుకని అతుక్కుపోతుంది
తలదాచుకోవడానికి చూపు మరో చీకటిని వెతుక్కుంటుంది

చూపులు ఎప్పుడూ కిందకే వేలాడవు
ఆలోచనల లోతుల్నిండా గాయాలు నిండినప్పుడు
ఊరడించే గాలులకోసం
ఆ చూపులే నిశ్శబ్దంగా గగన విహారం చేస్తాయి
ఆ ప్రయాణంలో..
గాయం బాధని బట్టి దూరం;
దొరికే సమాధానాన్ని బట్టి వెనక్కు వచ్చే కాలం..నిర్ధారింపబడి ఉంటాయి

లేదా మరో అత్మీయ స్పర్శ ఏదో మాయ చేసి
ఆ చూపుని మళ్ళించాల్సి ఉంటుంది

ఒక చూపు మరో చూపుని వెతకడం
ఆదిమకాలం నుంచి అమలౌతున్నదే
కొన్ని చూపులు ..
పైకి పలుకరిస్తున్నట్టే ఉంటాయి కానీ
వాటి అంతరంగాల్ని కనుక్కోవడం కష్టం
కొన్ని చూపులు..
దారి దివ్వెలాంటి మరో లోకాన్ని
ఈ లోకంలో వెతుకుతూనే ఉంటాయి
కొన్ని చూపులు..
తనని కలుపుకుని వెళ్ళే కాలం కోసం
లోపలి ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి

ఒక చూపు మరలితే మరణం
ఒకచూపు తరలితే జీవనం

ఈ లోకంలో మనగలగాలంటే
మన చూపు ఒక కొసన్నా మనతోనే ఉండాలి
గోడక్కొట్టిన బంతిలా వెనక్కి రాగలగాలి
శూన్యానికో, సౌందర్యానికో చూపుని పారేసుకోవడం కన్న
పుస్తకాలలో అక్షరాలకి వేలాడదీసుకోవడం మిన్న
అప్పుడు ఆ చూపులే కాలాతీతంగా ప్రవహిస్తాయి
మనల్ని మనలోపలికి ప్రయాణం చేయనిస్తాయి

ఏ చూపులైతే మననీడల్ని ఎక్కువ చేసి చూపుతాయో
ఆ చూపుల్ని తుడిచేసుకుని నడిచిపోవడం మంచిది
ఏ చూపులైతే మనలోపలికి బయటకి ప్రయాణిస్తాయో
ఆ చూపుల్ని మనలో నింపుకుని దీపమై వెలిగిపోవడం మంచిది

అప్పుడు..
జీవితం అతిశీతల దృవాగ్రాన మనిషిని నిలబెట్టినా
సూర్యకాంతి ప్రతిఫలనాలను కన్నులు తెరిచి ఉంచినంతకాలం
మైమరచి చూస్తూనే ఉండిపోగలం
లేదా..చూపులు కలవని వేళల్లో
వాసనల్ని వెత్తుక్కుంటున్న కస్తూరీ మృగమై
గమ్యం దొరకని దారుల్లో ఇరుక్కుపోగలం
=19.4.2016=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa