Apr 18 2016

యశస్వి ||పురసెయ్య పురాణం||

Published by at 3:35 PM under my social views

_83718810_easterngreykangaroo

cool-quote-left-handed-activist-Ferroni
ఒబామా, మోడీ,అమితాబ్, సచిన్
ప్రఖ్యాతులతో ఓ పోలిక గొప్పేం కాదు గానీ
ఆ సెయ్యి అలవాటు పుట్టినకాడ్నుంచీ ఇబ్బంది పెట్టేస్తోంది

ఎలా పుడుతుందో ఎడమ అలవాటు
జనం మనల్ని వేలెత్తి చూపడానికి
మార్చుకునే వరకూ వెంటపడడానికి

మంచీ చెడూ అని కలిసిపుట్టిన వాటిని విడదీసి
తెలిసీ తెలియని విషయాల్ని కలగలిపి
కుడి మంచి ఎడమ చెడు అని ఇట్టే నమ్మిస్తారు
దాన్ని బట్టే మనల్ని ఓ గాడిన కట్టేస్తారు

పురసెయ్యోడి తలసరి ఆదాయం
సదరు కుడిసేతోడు కన్నా తక్కువే అని సర్వేలు తేల్చేసి నప్పుడు
కుడిచేత్తో కొబ్బరికాయను కొట్టలేనితనానికి
గుళ్ళో రాతిగుండె నాపై పగబట్టినట్టనిపించింది

పనీపాటా అన్నీ ఉన్నా
పనిగట్టుకుని తట్టుకోలేకే
ఇలా మొరపెట్టుకుంటున్నా;

పడ్డోడి బాధ పక్కోడికి
ఏడుపులెక్కనన్నా తెలవాలి కదా
నాకు తెలుసు మీకిది ఓ నవ్వులాట..

చిన్నప్పుడెప్పటి మాటో..
తినేటప్పుడో, రాసేటప్పుడో
ముందుకెళ్ళేది ఎడమసెయ్యే
టపీమని తగిలేసేది ఓ దెబ్బ దానిమీద

వెనకనే.. ఏరా తేడా తెలియట్లేదా అన్న మాట..
వివక్ష ఊళ్ళోనే కాదు వంట్లోనూ ఉంటుందని
నా కప్పుడే తెలిసొచ్చిందన్నమాట.

రాయడం కుడితోనే ఏదోలా నేర్చినా
నా గుండె ఎడమవైపే ఉండిపొయినందున
ఆ మారిన అలవాటు చెప్పుకోలేని బాధ

కాళ్ళపని చేతులు చెయ్యవు సరే
కుడికి ఇచ్చిన విలువ ఎడమకి ఎందుకివ్వరో అనిపించేది
ఒకటి ముందుకి మరొకటి వెనక్కీ
వాడే అలవాటుకి ఆద్యంతాలు ఎక్కడో

నా దేహమే దేశమైనట్టు..
లోపల మొలకెత్తే ఆలోచనలనూ
నాలోని అసమానతలను రోజూ గమనిస్తున్నాను

కుడి ఎడమైతే పొరపాటు లేదన్న
కబుర్లలోతుతెలియదు కానీ
ఎవడిపని వాడు చెయ్యాలని చెప్పడంలో
శాస్త్రం కన్నా ఝాంకారమే ఎక్కువ కనిపించేది

కుడికాలుని ముందుపెట్టాలంటే
ఎడమపై నిల్చోవాల్సి రావడం ఎంత నిజమో
కుడి చేయి కడగడానికి ఎడమ అంతే అవసరం కదా

అప్పుడప్పుడు తనే నిజమని, సహజమని
ఎడమచేతికి చెప్పాలనిపిస్తుంటుంది
అలా ప్రయత్నించినప్పుడల్లా
కుడి చేయి దాని గొంతుని గుప్పెట్లో మూసేసి
కిందకు లాగేసేది
తలతో పాటు అదీ వాలిపోయేది

నాది కాకపోతే గోదారి దాకా అని చూపించే
పక్షపాతానికి నా ఎడమ ఎప్పుడో బలైపోయింది
సహజసిద్దమైన అలవాటుని పొరపాటు అన్నప్పుడే
నాకీలోకం ఎప్పటికీ తల్లకిందులే అని తేలిపోయింది

నా మనసు మాటను పాటించలేక
మాటలతో పొడిపించుకోలేక
కొన్ని అలా కొన్ని ఇలా అని
రెండిటితో సరిపెట్టుకుపోతున్నా

మారిన అలవాట్లలో
నేనే చేతి వాటమో నాకే అర్థంగాక
తికమకపడుతున్నా
తిండీ తిప్పలను కుడికి అప్పగించి
అవసరానికి ఏది కుదిరితే అదే వాడుతున్నా

రాసే పనిని ఓ చేతికి గుత్తంగా అప్పగించేసి
మిగతావాటన్నిటికీ మరోచేయి వాడలనిపిస్తుంది
ఇంకానయం! దేవుడు ఒక్కనోరే పెట్టాడు!!
తిన్న తరువాత చాల సమయానికి
అరిగే అలవాటుని భలే కనిపెట్టాడు!!

కడుక్కోవడం ఎప్పటికప్పుడు
రెంటికీ అవసరమైనప్పుడు
ఈ ఎక్కువ తక్కువలు ఎందుకో!

ఎప్పుడైనా ఏ గొంతైనా
నన్నెవ్వరూ పట్టించుకోవడంలేదన్న అరుపు
వినపడినప్పుడల్లా
వాడెంత అదృష్టవంతుడో అని బుగ్గలు నొక్కుకుంటున్నా

కసిగా పట్టించుకుని
నువ్విలా ఉండూ నేనిలా ఉంటాను అనుకునే కన్నా
ఎవడిమానాన వాడ్ని బతకనివ్వడం మిన్నఅని
జీవితానుభవంతో తెలుసుకుంటున్నా

=18.4.2016=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa