Apr 11 2016

యశస్వి ||దుర్ముఖీ@ ఎఫ్బీడాట్ కామ్||

Published by at 6:46 PM under my social views

th

మై డియర్ ఉగాదీ!!

నీకు ఆహ్వాన పత్రిక ను రాసి
ఆదరంగా పండక్కి పిలవమని
అమ్మ నాకు ఫోన్లో చెప్పింది

మొక్కుబడిగా వచ్చేదే కదా
అందంగా కనిపిస్తేనే పండగ అనుకుంటాం
ముఖం బాగా లేనిదంట
ఎందుకులే అమ్మా! అన్నా!

సంప్రదాయాన్ని వదలొద్దని,
వదరుమాటలు పలకొద్దని
ఆచూకీ దొరక్కపోతే
ఫేస్ బుక్ లో స్టేటన్ అప్ డేటైనాపెట్టమంది..

రేపటి నీపేరుమీద ముందటేడులానే టాగ్ చేశా
నేను ఆఫ్ లైన్ లో ఉన్నప్పుడైనా ఓ చూపు చూస్తావన్న ఆశ
టెక్నాలజీ మారినా తీరు మారదుగా
అందుకే నీకీ ఫోస్ట్ పెడుతున్నా

నువ్వు చదివినట్టు ఓ లైక్ కొట్టు..
ఉన్న ఎమోటికాన్ గుర్తుల్లో నీ కనిపించిందే నొక్కు.
ఇప్పుడు ఇక మా జీవితాల్లో షడ్రుచుల స్థానే ఉన్నవి
లైక్, లవ్ ,హాహా వావ్, సేడ్, యాంగ్రీ ఆ ఆరేగా
వాటి సాయంతోనే నిన్ను ఈనాడూ తలుస్తున్నా

రాక్షసలో పుట్టినోడ్ని; సిద్దార్ధలో బడికెళ్ళినోడ్ని
ప్రభవ విభవల్లో వసంతం వచ్చేదారిని కనుకున్నవాడ్ని
యువ నుంచి కవిత్వమై నీకై కాగితాలపై తరించిన వాడ్ని..

నీపై ఎన్నెన్ని కవితలల్లానో
ఎన్ని సమ్మేళనాల్లో తపించానో
నా ప్రేమని ఎప్పుడన్నా గుర్తించావా!

నువ్వు నా జతలేవని అనుకున్న కాలంలో
ఎండమావుల కై పరిగెట్టానని అలిగినట్టున్నావ్..
ఆ మాత్రం ఎడబాటు లేకపోతే
జీవితంలో ఎలా నిలబడగలననుకున్నావ్!!

వద్దన్నా వసంతసేనని పట్టుకుని వేలాడడానికి
శకారుడ్ననుకున్నావా!
వలచి వస్తే చారుదత్తుడిలా ఆదరిస్తాను

రెచ్చగొట్టిన సందర్భాల్లో
మన్మధుడి అసలు రూపాన్ని ఎప్పుడో కనిపెట్టాను.

దేశద్రోహం నేరం మోపినా
నిన్ను ప్రేమించాననే చెబుతాను తప్ప
తల్లిని చేసి జైకొట్టలేను

ఆమోదించినా లేకున్నా
నా తమ్ముళ్ళ మాట్లాడే హక్కును పోగొట్టలేను
చెల్లెళ్ళ స్మృతిలో కొవ్వొత్తులు వెలిగించలేను

దుర్ముఖీ! నా ప్రియురాలా!!
ఆకలి లా నైరూప్యం అనుకోలేదు నిన్ను
అరుణిమలా శ్వేతకాంతిగానే ఊహిస్తున్నా
నిన్ను ఇంకా చుడని కళ్ళన..
జీవిత పట్టకంలోంచి నీ ప్రొఫైల్ బొమ్మ ను తేరిపార చూస్తున్నా

నువ్వు..
జైలుకెళ్ళని సల్మాన్ ఖాన్ లానో
విడుదలైన సంజయ్ దత్ లానో
పిడికిలి బిగించిన కన్నయలానో
ఎన్నికల సభల్లో చాయ్ వాలాగానో
కుర్చీలాటలో కబుర్లు చెప్పే చంద్రుళ్ళగానో
పోటెత్తిన విరాట్ కోహ్లీగానో
వగలుపోతున్న సన్నీలియోన్లానో కాక

వానతడిగానో, పచ్చని నారుమడిగానో
సామాన్యుడి నాడిగానో, బడిపిల్లోడిగానో
ఎప్పుడు కనిపిస్తావ్!
ప్రశాంతతను ఎలాప్రసాదిస్తావ్!!

నీపేరున్న టైం లైన్ లోకి తొంగిచూస్తున్నా
నాలానే సాటి మనుషుల్లానే
అనాదిగా దిగాలుగా ఉన్నావ్
నువ్వు పంచే మంచిని ఎంచలేక
మేమంతా దుర్ముఖాలతోనే ఉన్నాం

ఇన్బాక్సులోకి వచ్చేబదులు
ఓపిగ్గా ఉన్నావోలేదో ఒకసారి
ఇంటికి వచ్చేయరాదూ..
పచ్చడి తింటూతీరిగ్గా మాట్లాడుకుందాం!!

=07.04.21016=
ఉగాది శుభాకాంక్షలతో..

*సూద్రకుని మృచ్ఛకటికం సంస్కృత నాటకంలో పాత్రలు వసంతసేన, చారుదత్తుడు. శకారుడు..
1984 హిందీ సినిమా ఉత్సవ్.. చూస్తే అర్థమౌతుంది.. లేదా వికీలో.. అంతర్జాలంలో ..అవగాహనకు చాలినంత సమాచారం లభ్యం.

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa