Mar 17 2016

Yasaswi Sateesh || 2045 Initiative||

Published by at 5:03 PM under my social views

11

ఇప్పుడేదో గొప్పగా ఉన్నానని కాదు;
మనిషితనంలో తక్కువేం లేను.
అందరికీ ఉన్నట్టే కొన్ని నాకు…

చమట చుక్కలు, కన్నీళ్ళు
రూపాంతరం చెందిన
సంభోగానంతర రేతస్ఖలన కణాలు
ఇంకా ఈ నేలన మిగిలున్న ఋణాలు

మరి నా మెదడు మరమనిషితో అనుసంధానిస్తే
మరణించాక కూడా నే బ్రతికి ఉన్నట్టేనా!!
నా జైగోట్ తో ఉద్భవించిన క్లోనింగ్ ప్రతిరూపం
అసాధ్యంగాక సాకారమైతే ఆ సదరు స్వరూపుడు నేనన్నట్టేనా

మూలాల్ని మరచి విన్యాసం చేస్తున్న లోకంలో
నే మర్త్యుడినా కానా!
వంటబట్టిన సిద్దాంతాలను నమ్మకాలుగా మార్చి
ముందుతరానికి మనుధర్మంలా అందిస్తానా!

ఏతావాతా పోయాక పైనుండడం నిజమైనా
పుట్టబోయే క్లోనింగ్ ముద్రా రాక్షసుల;
ఆవిష్కరణ కాబోయే నియో మానవతామూర్తుల
తప్పులకి ఏ చిత్రగుప్తుడు చిట్టా తయారు చేస్తాడు
శాఖా కార్యాలయాల్ని ఎక్కడనుంచి నిర్వహిస్తాడు!

మిత్రులారా! మన్నించండి నన్ను
అర్థాంతరంగా కూత ఆపేసి
తొడగొట్టి బరిదాటడానికి రాలేదు
ఇక్కడ కూతలాగే ఎవడి ఆట వాడిదే

నేను నాతోనే ఇంకా జట్టు కట్టలేదు
బలవంతాన ఆడాల్సిన ఆటలో
బరిలోనా బయటా నాలాంటి నన్నే ఉంచితే
నాతో నేను ఎలా ఆడుకోవాలి

ఎవరు ఎవరికి ప్రతిక్షేపం
ఎవరిఓటమికి ఎవరి గెలుపు ప్రత్యామ్నాయం

నాకిపుడు నాతోనే మాట్లాడాలనిపిస్తుంది
నాకు నేను తర్ఫీదు ఇచ్చుకోవాలనిపిస్తుంది
ఏ కారణం చేతనైనా శాశ్వతంగా ఉండిపోతానేమో అని
భయమేస్తుంది.

జీవితేచ్చ ఇంకా మిగిలే ఉంది
అయినా సరే ఓ బ్రతుకు బ్రతికాక
అందరిలానే బంధాల్ని వదిలి వెళ్ళలేని బాధని
అనుభవిస్తూనే పోవాలి
తేలిగ్గా వదలలేని తెంపరితన్నాన్ని
చావు ముంగిట ప్రదర్శించాలి

నేనన్నవాడ్ని ఏలోకంలోనైనా నేనే ఉండాలి
నా తరువాత నేను నైరుప్యంగానే నిలచిపోవాలి
నన్ను తప్పొప్పుల చిట్టాగానో,
అనుభూతుల ఘాట్టాలుగానో గుర్తుంచుకోవాలి

పువ్వునూ, పిట్టనీ, పిల్లనూ, నవ్వునీ
ప్రేమించే మనసు అందరిలానే వీడికీ ఉందని
అందని ద్రాక్షల కన్నా..
అందుకున్నసీమసింతకాయలంటేనే మక్కువ చూపాడని
ఎవ్వడో ఒకడు నా గురించి రాయకపోడు

నా రాతల్లోంచి మీ మాటల్ని వెతుక్కుంటున్నప్పుడు
మరో యశస్వి రాకపోనూపోడు
అయినా సరే అక్షరాలతో పలుకరించే నాకు
అక్షరాలలోనే బ్రతికే జీవితం కావాలి

కవిత్వానికందని భావనేదో
తెమ్మరెలై నా తలపులను తరలించుకుపోవాలి
మనసు మిగిలిపోయి మనిషిగా..
ఏదో ఒకనాడు తెరమరుగైపోవాలి

=17.3.2016=
మనిషిని శాశ్వతంగా బ్రతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు పేపర్లో చదివి.. నవ్వుకుని..

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa