Mar 15 2016

యశస్వి ||అమ్మ చీర||

Published by at 7:22 PM under my social views

65_page1

ఏ వంటకో, ఇంటిపనికో అమ్మ అంకితమైనప్పుడు
నన్ను ఉయ్యాలలూగించిన నిద్ర భరోసా
నాన్నఆ చేతిని వదలకున్నా
మరోచేయితో కలిసి దూలానికి ఊగేది అమ్మచీర

నన్ను నేలమీద పడకుండా
కాపాడిన అమ్మచీరే
నా వెన్నుకు పరుపయ్యేది
తలకు దిండయ్యేది

పాలకక్కుల గుడ్డయ్యేది,
మొలకింద మెత్తని గోచీగా మారేది
నలుగు తానాల వేళ తడిచేది, మురిచేదీ,
తుడిచేది, మడిచేదీ అమ్మచీరే

శ్రమ చిందిన చుక్కలు ఆ వంటినుంచి
ఈ చీరకంటే సౌరభమయ్యేవి

ఆ మత్తులోనే నా శైశవం సుస్తుగా నిద్దరోయేది
అడుగుల తడబాటు రోజుల్లో
మోకాళ్ళకు మెత్తగా మారిన అమ్మచీరే

సైకిళ్ళాటల రోజుల్లో
కొట్టుకుపోయిన కాళ్ళ రక్తాన్ని పీల్చేసి
దూదిపింజగానూ, గాజుగుడ్దగానూ
మారిపోయేది

నెత్తుర్నీ రసినీ గాయాలతో ఎత్తుకుని
హత్తుకునేది అమ్మచీరే
నాకోసం ఏడ్చే కన్నుల్ని ముక్కునీ తుడిచేదీ అమ్మచీరే,

నాకు భయమేసినప్పుడల్లా
నను దాచేదీ, ఆకలేసినప్పుడల్లా ముడివిప్పేదీ
అవసరానికి డబ్బుముడిగా బొడ్డున దోపబడేదీ అమ్మచీరే.

నవరసాల్ని పండిమ్చుకున్న ఆ అమ్మచీరే
వందలమంది ముందర నే రంగస్థలమెక్కి వీరంగమౌతున్నప్పుడు
నా అడుగులకు లయబద్దంగా నాట్యం చేసింది
వంటి చెమరింతల్నిపీల్చుకుంది

నా వెన్ను కింద ఆహార్యమై
వడిసిపట్టింది అమ్మచీరే

చదువులకై ఇంటిని వదిలెళ్ళిన రోజుల్లో
నా రహస్య వేదననూ, నిశీధిరోదననూ తనలో ఇముడ్చుకునెందుకే
నా దిండు పైకి చేరుకుని
నా గుండె కింద పరచుకున్నదీ అమ్మచీరే

నాతో పెనవేసుకున్నరాగ బంధం
అది అమ్మ మేను సుగంధం
ఎప్పుడైనా అమ్మకు ఓ చీర కొందామనుకున్నా
అంగడి మొత్తం మీద అమ్మకానికి దొరకనిది
వెతికి పట్టుకోవడంనా వల్లకాదని తేలిపోయింది
అమ్మ చీరకు ప్రత్యామ్నాయం లేకపోయింది

చీరలు వాడినవి కొన్ని కనిపిస్తునే ఉన్నాయి
అవి మాత్రం అలుపెరని అమ్మలా
ఏ వంటగదిలో మసిగుడ్దగానో
కిటికీకి తెరగానో తమ పనిని చేస్తునే ఉన్నాయి

ఏదోనాడు ఓ చీరకొంగు కరుకుగా తగిలినా
అది నాకు అమ్మచీరనే జ్ఞప్తికి తెస్తుంది
నా కళ్ళ తడిని రహస్యంగా తుడుచుకుని
ఆ కొంగునూ మెత్తగా మారుస్తాను

నా తడిని పీల్చిన దేదైనా ఇట్టే అమ్మచీరైపోతుంది
అక్షరాలైనా, అమ్మడైనా అందమైన స్పందనైనా
అమ్మకాని అమ్మాయి నా జీవితాన లేదు
నచ్చిన ఏబొమ్మతోనైనా అమ్మచీరే పంచుకున్నాను

ఎవరేమనుకున్నా నేనెప్పటికీ
అమ్మచీరతోనే ఉంటాను
ఎదుట ఎవరున్నా
అమ్మచీరనే కళ్ళకు కట్టుకుంటాను

=15.3.2019=
ఓ వార్త చదివాక…
అమ్మాయిలే అమ్మచీర అనుభూతులు పంచుకోవాలా! నేను కాదా!! అనిపించి
‪#‎inmymotherssari‬

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa