Mar 03 2016

యశస్వి ||~~రెండు 54లు = వందేళ్ళ దీవెనలు ~~||

Published by at 6:01 PM under my social views

marasani yakoob

నాకిద్దరు స్నేహితులు
ఒకడు మరొకడు అంటానికిలేదు
ఇద్దరూ నా మనసు నింపారు
వాళ్లెప్పుడో వ్యక్తి పరిధుల్ని దాటి పోయారు

అయినా ఇక్కడ అనకతప్పదు
ఇద్దర్నీ ఓ గాటిన కట్టి జీవితాన్ని నెట్టేస్తున్నా
కాకతాళీయం ఏమిటంటే..
కట్టకట్టుకున్నట్టు.. ఇద్దరూ ఒక్కరోజునే పుట్టారు.

ఒకడు యాకూబ్ -ఒక యాభైనాలుగేళ్ళపిల్లాడు
(¯`•.¸.•°*°•.★.•°*°•.¸.•´¯)

ప్రవహించే జ్ఞాపకాల్లోంచి సరిహద్దు రేఖను దాటి
ఎడతెగనిప్రయాణం చేస్తూ కవిసంగమాన్ని కనుగొన్నాడు
నదీమూలంలాంటి ఇల్లుని చేరుకున్నాడు.
సూఫీఘర్ అనే కవితా పీఠానికి క్షేత్రపాలకుడు

భక్తుల కోలాటాలను ఓ కంట కనిపెట్టాలని
నిత్వకవితాయజ్ఞాన్ని మాపరంచేసాడు
పచ్చతోరణాన్ని బంగారు వాకిలికి కట్టి
మాసోత్సవాల్ని, సాహితీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటాడు

నల్లకలువల్లాంటి అక్షరాలతో ఆత్మకధల్ని నివేదిస్తాడు
వచనకవిత్వ దేవత కంఠాన్ని అలంకరించిన సంపెంగమాల
తోటిపూలతేనెచుక్కలతో కలిసి భవభావసాగర మధనం చేస్తాడు
కల్లోలకెరటాలతో చిందులేసినా, ఆనందతీరాల విందులు చేస్తాడు

ఒక్క తేనీరు చుక్కకే స్నేహం మత్తెక్కే మత్తేభం
కవిత్వపు చిట్టడివిలో తత్వగానాల శార్దూలము
తన కవితాపాదాలతో ప్రాణాల్ని కట్టిపడేసే మధ్యక్కర
ఛాందసత్వాన్ని కాదన్న కవిరాజవిరాజితం ఈతని జీవితం

తెలంగాణలో పల్లెలు సాహిత్య కేంద్రాలుగా ఎదగాలని
మనిషితనం చుట్టూ కవిత్వ కవచాన్ని తొడగాలని
ఎల్లలులేని సాహిత్యోపాసనకు తెలుగునేలన నడుంకట్టాడు
ఇప్పుడు బొడ్డూడిన బుడ్డోడు కూడా ఈదారినే నడుస్తున్నాడు.

*************************************************************
మరొకడు
మారసాని విజయ్ బాబు-మరో యాభైనాలుగేళ్ళపిల్లాడు
(¯`•.¸.•°*°•.★.•°*°•.¸.•´¯)

నాలో పొటమరించే సందిగ్ధాల సరిహద్దు రేఖలను చెరిపేసి
నాలో విశ్వమానవుడి ఆనవాళ్ళను కనుగొన్నాడు
ఎడతెగనిప్రయాణం చేస్తూ మంచితనాన్ని కలుపుకుని పోతున్నాడు
సమాజాన్ని ఊపిరి చేసుకుని సామాన్యుడి సంతోషానికై తపిస్తున్నాడు

ఒకానొకప్పుడు, అనుభవాన్ని మేధస్సును పణంగాపెట్టి
కొత్తగీతలు అన్న జీవితాన్ని కథరూపంలో కన్నాడు
తుపాకీ అవసరం రాని సురాజ్యం సాధ్యమే అన్న మాట విన్నాక
అరుణతారమీదొట్టు.. అన్నలు ఆ పుస్తకాన్నే చదవొద్దన్నారు

తెల్లకలువల్లాంటి ఆలోచనలతో స్నేహమయుల్ని ఆకర్షిస్తాడు
ప్రపంచ సాహిత్య సౌరభాలతో సంభాషణల్ని పరిపుష్టం చేస్తాడు
ఒడిదుడుకులకు లోనైన ఏ మనోసంద్రమేనా ఇతని కనుసన్నల్లో
ప్రశాంత స్మిత సమీరాల సాంత్వన ను అనుభవించ వలసిందే

ఈ నగుమోము నే నీజగాన ఒంటరినికాదని ఆశ వెలిగించింది
ఆ నిండైన రూపం నన్ను నేను కనుక్కునేందుకు దారి చూపింది
వ్యధకాదు ముందడుగు ప్రధానం అనుకున్న ఆచరణ ఇతనిది
పల్లె పల్లెనా వెలుగులు నింపే స్వయం ఉపాధి క్రతువితనిది

అవయవ దానం చేసాడనో, కొందరి బరువును దించాడనో మాత్రమే
ఈ ఒకేఒక్కడు గొప్పవాడు కాలేదు.

మేమేనాడూ వెలలేని సంతోషాల్నితప్ప పైసా సుఖాల్ని పంచుకోలేదు
నా మిత్రుడు విజయ్ బాబు అందరిలాంటోడు; అయినా కానీ
నా గుండె బరువెక్కినప్పుడు ఒక్క తలపుతోనే తేలిక చేస్తాడు.

*****************************************
ఓ పుట్టిన రోజు పిల్లలూ!
నా గుండెనిండిన అన్నలూ!!
ఈ ఒక్కరోజే మీ గురించి రాస్తున్నాను.

మీరు పరచిన బాటన క్షణక్షణం జీవిస్తున్నాను..
మీ ఆశయాలను మోసుకు పోవాలని తపిస్తున్నాను.

Kavi Yakoob Marasani Vijayababu
= 02.03.2016=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa