Mar 01 2016

యశస్వి || ప్రేమాకాశాపు తలపుల్లో.. ||

Published by at 4:20 PM under my social views

girl graphy )

యశస్వి || ప్రేమాకాశాపు తలపుల్లో.. ||
(¯`•.¸.•°*°•.★.•°*°•.¸.•´¯).
మొట్టమొదటగా నన్నెత్తుకున్నది..
మిస్సమ్మ ఆసుపత్రిలో పనిచేసిన ఓ నర్సమ్మ,
చంద్రశేఖరుడే తన బిడ్ద కడుపున పండాడనుకున్న..అమ్మమ్మ
పొలమూరు తాడాల సత్యవతమ్మ,
నా అల్లరికి మురిసిపోయి అలసిపోయే గిరమ్మ ,
నను కని పెంచి భరిస్తున్న యశోదమ్మ

గుండ్రంగా ఉన్నానని చపాతిగాడంటూ దిష్టి తీసేది విద్యపిన్ని,
పుట్టగానే తన పాలు పట్టి ప్రాణాలు నిలబెట్టిన నరసాపురం బేబత్త,
చస్తే మోయాల్సినోడు వాడే నని నాదన్ను నిలబడి
చదివించిన నా పెద్దమ్మ సూర్యావతమ్మ,
కాకినాడలో మూడోబిడ్డలా సాకిన లక్ష్మి చిన్నమ్మ, ఫణీబావక్క

పద్మక్కంటే ఎంత ఎక్కువంటే
నా జేబులో తన బొమ్మ గుండెకు నిరంతరం తగిలేంత
నిన్ను చూసే సీతారామయ్యగారి మనవరాలు
సినిమా తీసారని గొడవాడేంత,
పర్యావరణశాస్త్రంలో పిహెచ్ డీ పొందటమే తేలికంటూ
బిడ్డని కన్నాక నెలరోజులు బ్రతకటం కష్టమైన కన్నీటిచుక్క

వీరు ప్రాతఃస్మరణీయులు కాదు,
నా ప్రాణం పోయేముందు కళ్ళముందు కదలాడేవారు
*
మహారాష్ట్ర బస్మత్నగర్ లో నన్నెతుకు తిరిగిన దాదూ,
నాతో వేలు కొరికించుకున్న హుస్సేన్ అంకుల్ పాపసోనీ,
కాకూ! సతీష్ లా..దే..! అని ఎత్తుకెళ్ళే ఉప్పలప్ప దీపక్క,
ఒకే మంచం మీద నాతో ఆడుకున్న సుబ్బరాజంకుల్ పాప,
అమ్మతో కలిసి పెరిగిన రాజులమ్మ సుబ్బారాయుడు పిన్నీ
మీరంతా ఎక్కడున్నారో ఏమో! గుర్తొస్తారు నాకప్పుడప్పుడు

నా అల్లరి భరించ వల్లకావట్లేదని అమ్మ విసుక్కుంటుంటే
వీడికన్నా బుద్దిమంతుడు ఉండడని నన్ను ఎత్తుకు ముద్దిచ్చిన రాధాటీచర్
ఆమె చెయ్యట్టుకుని పద్మా కాన్వెంట్ కు నే రోజూ నడిచి వెళ్తుంటే
నాలుగో క్లాస్ వాడిపైనా ఆ కాలపు కుర్రాళ్ళంతా కుళ్ళుకునేంత
అప్పట్లో నాకు ఆరాధన బచ్చలి భానుమతి మీద;
సెకండ్ వచ్చానంటే ఆ పిల్ల వెనకాలే ఉన్న భావన

ఇంటికొచ్చాక నాతో ఆడుకునేది కప్పల తనూజ
సెలవొచ్చిందా తనతోపాటే జ్యోతి కాన్వెంట్ కే వెల్లేవాడ్ని ఎంచక్కా
ఆడపిల్లలతో కూర్చొటానికి సిగ్గేసి ఓ రోజు రాజమౌళి పక్కన నక్కా
నువ్వు చెప్పాకే తెలిసింది. నీకన్నా పద్మశ్రీ సారు ఎక్కువేం కాదక్కా!!
తణుకొచ్చాక జానీ అహ్మద్ గారి పాపలు మున్నీ సురయక్కా!
ఎన్ని హిందీ సినిమాలకి తోడొచ్చాను మీతో అంకుల్ కి తెలియకుండా

ఆకివీడు లో హైస్కూలు మొదలు; నాకిష్టం క్లాస్మేట్ ఫరాబాను
ఎక్కడున్నావో ఏమో నిన్ను ముట్టుకోవాలని ఎన్నిసార్లు కొట్టాను!!
సరే! క్లాస్ లీడర్ గా నీకు సారీ చెప్పాలి ఆ తరువాత మళ్ళీ మొట్టాలి
మీ ఆయనకీ పిల్లలకీ ఎపుడోకపుడు మన బాల్యాన్ని పరిచయం చెయ్యాలి

జ్యోతిబాలమందిర్ ఖమ్మంలో కె. అనురాధ, కె. శ్రీదేవి, మమత..
మొజాహుద్దీన్ గాడు నీతో మాట్లాడుతున్నానిని నన్ను కొట్టాడు అనురాధా!
అన్నట్టు మీ ఇంట్లో అంతా ఆడపిల్లలే కదా, ఇంటికొస్తే తమ్ముడొచ్చాడన్నారంతా
ఎక్కడున్నావో తెలిస్తే బాగుండ్ను నీతో రాఖీ కట్టించుకుందామనుకున్నా
పదోక్లాసులో సంస్కృతం మాస్టారు అమ్మాయి గాయత్రి, ఎంత చక్కగా ఉండేదో
మొన్న కనిపించినప్పుడు జుట్టంతా పండిపోయింది. మనసెంత చివుక్కుమన్నాదో!

డిగ్రీలో భారతి, యూత్ ఫెస్టివల్ లో నాతో కలిసి డాన్స్ చేసింది.
మిస్ తణుకు మాధవీ!! నీమీదే కదానే కవిత్వం రాసింది!!
అర్జునుడుపాలెం ధనలక్ష్మి, పెళ్ళిచేసుకోడానికి టైం కావాలంటే
ఎదురు చూసి- చూసి డిగ్రీ ఫెయిలయ్యి వాళ్ళ బావనే పెళ్ళిచేసుకుంది
కాకినాడ భానుగుడి సెంటర్ లో స్వీట్ షాప్ పక్కన టెలిఫోన్ పాప
నీ కళ్ళు చూసి ఎన్నిరాత్రులు నిద్ర మానేశానో కదా!

ఈ మధ్యలో కొన్ని కథలు.. అవి చర్వితచర్వాణాలు,జన్మానుగత ఋణాలు,
మరికొన్నినను విడిచి వెళ్ళిన విస్మృతికిరణాలు
అయినా ఎందుకీవేళ మీపై ఈ తలపులు!!

ముందుంది.. మహిళా దినోత్సవం అని లోకమంతా అంటున్నప్పుడు
నా స్మృతిపథం లో మీరంతా మెదులుతున్నారు
కళ్ళముందు నడయాడే ఆకాశపు సగభాగంల్లోంచి
నిత్యం నాపైన ప్రేమజల్లు కురిపిస్తూనే ఉన్నారు.
(¯`•.¸.•°*°•.★.•°*°•.¸.•´¯).
=01.03.2016=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa