Feb 27 2016

యశస్వి || నాదేశం.. ఓ పూల చెట్టు ||

Published by at 5:18 PM under my social views

kondagogu

పసుపుపూల చెట్టుకో ఎర్రపూవు పూచింది
అంతలోనే తన రంగు చూసి అనుమానం లేచింది
పొరపాటున నేను ఈ మట్టిలోన పుట్టానని
కలిసున్నా మీరు నన్ను విడదీసే చూస్తారని

వదిలేస్తే తనమటుకు స్వతంత్రంగా ఉంటానని
అందంగా ఊగుతూనే బింకంగా చెప్పింది
పూలు కొన్ని నవ్వాయి, తల్లివేరుని అడిగాయి
పిల్ల అనే మాటల్లో మర్మమెంత ఉందోనని

రాలుపూల పిల్లల్ని మోసి ఉన్న తల్లికదా
మాట విన్న వెంటనె ఒల్లుజలదరించింది
దుఃఖమెంత వస్తున్నా మాట తమాయించింది
ప్రేమతోనె పిల్లల్ని ఇలా పలుకరించింది

మీరు లేని రోజుల్లో మాట ఒకటి చెబుతాను
మొక్కలా నేనప్పుడు ఆకులనే కన్నాను
నేలతల్లి సారాన్ని నీళ్ళతోటి పీల్చాను
మొగ్గతొడిగాకే నన్ను నేను కనుగొన్నది

ఏరంగో ఏమిటో లోకమంత పచ్చ నాకు
పూలమొక్కని అంటారని నన్ను నేను విన్నది
తోటలోన నాలానే మొక్కలెన్నో ఉన్నవి
గాలిపలకరింపులే తప్ప నడిచినే వెళ్ళలేను

ఏ పిట్టో ఏ పురుగో వచ్చి నాపై వాలేది
పక్కమొక్క కేసరాల పుప్పొడిని రాల్చేది
బలమైన పూలని రంగు రంగు బాలల్ని
అందంగా కంటున్నా నందుకే”.. అన్నది

ఎర్రపువ్వా! ఏమయింది నీకసలా
నీచుట్టూ పసుపుంటే గొప్ప నువ్వు కాదా!
ఏదోరోజు అందరూ రాలిపోయెవారేగా
రంగు మరచి పువ్వువని మురిసిపోవేలా!

ఎవరోఒకరు ఎపుడోకపుడు దూసేస్తారు
దండకోసమో పూజకోసమో మోసేస్తారు
అయితే మాత్రం మమ్మల్నిపుడే వదిలేస్తావా!
పరోపకార పరమార్థానికి విడిపోతావా!!

నువ్వెక్కడున్నా నిన్ను పువ్వనే పిలుస్తారు
గంధాన్ని బట్టే నీ పేరు జపిస్తారు
నువ్వు పుట్టడానికో కారణముంది
అది తెలుసుకున్నాకే మాకు వీడ్కోలు తెలపాలి

నీలాంటి పువ్వుల్లో నువ్వొకత్తవే లేవు
అలా ఉండడం వల్లే నువ్వు నువ్వుకావు
నీకు నువ్వే శత్రువ్వి అవుతావ్
కలిసి ఉంటేనే నీ గొప్పని అందరం ఒప్పుకుంటారు

నీలానే నేనూ మూలాల్ని మరిస్తే
ఈ గాలి నన్ను మోసుకెళ్ళిపోయేదా
నీరు-నేల నన్ను నిలవనిచ్చేనా
వసంతమే తరలొచ్చి మన ఇంట విరిసేనా

ఓ చిన్నారి పువ్వా, చెరగని చిరునవ్వా
నీతల్లి ఇల్లూ, నీతోట ఊరు
నీరంగు ఏమైన నువు గోగుపూవు
వెన్నెల్ని కురిపించే పనిమానుకోకు

ఏ గాలి నిను మోసి ఏ కోనకెగసినా
ఏదేశమేగినా ఎందుకాలిడినా
నమ్మినదెమైన, నమ్మనివెన్నున్నా..
ఒకే మట్టి నిన్ను నన్ను కలిపి మోస్తుంది

రాలాక చేరాలి ఆ మట్టినే ఎవరైన
మూలాలు మట్టి, కాలాలు మట్టి
మట్టి కణం, చెట్టుఋణం కాదు గాని
నీలోని అణువణువున మూలరూపం మట్టి

మట్టి మాట పక్కనెట్టి
వెయ్యి నువ్వు మాట్లాడు
అయ్యన్నీ అబద్దాలు
నను కన్న మట్టితోడు

తోడపుట్టిన పూలన్నీఅవునని తలూపాయి
అంతలేసి మాటలన్నచెట్టుతో పాటుగా
వీచెగాలి సైతం పాట వంతపాడింది

పంతం పట్టిన పువ్వుకి కోపమొచ్చినట్టుంది
ఇంకాఎరుపెక్కి నన్నిలా చూస్తుంది!!
అలాంటి రంగుపువ్వులను ఇంకా కనాలనే
ఈ దేశం మొక్క ఎదురుచూస్తుంది

=27.2.2016=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa