Feb 22 2016

యశస్వి || అక్క.. దొరసానమ్మకు..||

Published by at 8:01 PM under my social views

11133842_1056954077653774_1879749844690564980_n

మస్త్ మల్లి.. నా వయసోడు..
బాగా చదువుకున్నోడు; ఎదిగినా
పసితనాన్ని ఎప్పుడూ పోగొట్టుకోనోడు
పదేళ్ళకిందటే అన్ని ఖండాల్లో
ఎత్తైన శిఖరాలు ఎక్కేసినోడు

నాకు తెలిసిన ఓ పిల్లాడు
ఎవరెస్ట్ ఎక్కింది మనోడేనని
పేపర్లో రాసేముందే
నాతో మాటాడించాడు

అంటార్కిటికా శిఖరాలనుంచి
మెక్సికో అగాధాల వరకూ
విజయాన్ని శ్వాసించిన
సాహసితో నా సంభాషణ

సముద్రాల నీరు ఉప్పన
పర్వతాల పైన చల్లన కన్నా
జీవదగ్నిపర్వతపు ప్రశాంతత లా ఉన్నా
నిక్కార్సైన అనుభవాల ఉప్పెనని ఆ గొంతున విన్నా

అతడు ఆశకి ఆవేశానికి మధ్య జీవితాన్ని నిలబెట్టి
ఆచరణకి చోటిచ్చే గీతను నమ్మాడు
నేల తల్లి ఆకాశాన్ని ముద్దాడే నగనగాన్నా
మన జాతీయపతాకాన్ని రెపరెపలాడించాడు

మిరిచూస్తే దీవించే ధవళకాంతుల్ని
అరిస్తే నవ్వే కొండలోయల్ని
అడుగుల్ని తుడిచేస్తున్న శీతగాలుల్ని
ప్రపంచపు పైటంచున నుంచునే ప్రేమించాడు

ఒంటరిగా స్వేఛగా ఉన్నప్పుడు
ద్యాసగా గాలిపీల్చడాన్ని ఉపాసించినోడు
వందలమందికి బ్రతుకుపాఠాన్ని ఉపదేశించినోడు
ఓ కొండమీద ఆరోజు వానపాటలో మైమరచిపోయాడు

దమవాండ్ శిఖరాగ్రాన చాక్లెట్ వదిలినంత తేలిగ్గా
ఏరుకు తెచ్చుకున్న రాళ్ళ స్మృతులను వదిలేసి
పెన్న కాలవ కంట కన్నీరై నిలిచిపోయాడు
జీవినగంగాసాగరానికి చేరుకున్నాడన్నారు

తోడబుట్టిన నీకు మాత్రమే తెలిసిన నిజం
వదిలివెళ్ళింది తనపైప్రాణమని
ఆత్మీయుడై తనలో జీవిస్తున్నాడని
అది నిరూపించేందుకే కొండబాటపట్టావని…

ఇప్పుడు తమ్ముడు నడిచినబాటనే నువ్వు ఎగరేసిన బావుటావి
(డాక్టరు వృత్తి, చలువగది జీవితం ఇవ్వని సంతృప్తి)
ప్రకృతి వొడిలో ఉన్న ఆనందాన్నిఅందుకున్నదానివి
చిలీదేశపు చిటారుకొమ్మన ఆగిన ప్రయాణాన్ని
కొనసాగించి తమ్ముడ్ని తనలో మళ్ళీ కనుక్కున్న సమాధానానివి

ఇప్పుడు ట్రెస్‌ క్యూసెస్‌ శిఖరాగ్రపు చల్లగాలి
మీ అనుబంధపు వెచ్చదన్నాన్ని అనుభవిస్తుంది
తమ్ముడే ప్రేరణగా అక్కఆచరణనే లోకమంతా గానం చేస్తుంది

అక్కా!
మస్తాన్ బాబుఎక్కిన శిఖరాలను
మరొకరు అందుకోవడమే అసలైన నివాళి అని చేసి చూపావు
కీర్తిని శిఖరాలకు వదిలేయకుండా
స్ఫూర్తిగా మలచి నిలపాలని పాఠం నేర్పావు

పర్వతారోహణ ఓ ఆటే కావచ్చు
దానికి ఆకాశమే హద్దుగావచ్చు
దిగ్దిగంతాల హద్దుల్నీ చెరిపేసి
నడకమానేసి కూర్చున్న
కోట్లాది తమ్ముళ్ళకు
వెలుగందుకునే కొత్తపుంతలు తొక్కి చూపావు

ఆగిపోయిన చోటనే
ఎవరో ఒకరు మళ్ళా మొదలెట్టాలని..
మరలిపోయిన ఓ సత్యాన్ని మళ్ళా పుట్టించి
ప్రవాహంలో కొట్టుకుపోకుండా
జీవితాల్ని గట్టున నిలబెట్టావు

= 22.2.2016=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa