Jan 28 2016

యశస్వి ||సుక్కల్లో కూకున్నోడా! ..|| ..a tribute to Rohith Chakravarthi

Published by at 3:23 PM under my social views

111 copy

అరె అబ్బాయ్! ఎలా ఉన్నావ్!!
నువ్ పోయాక ఈడేం బాలే !..
మనుసులం.. పెకృతినే కాదు..
ప్రవృత్తినే మర్సి పోయాం

అందరూ రాసెత్తన్నారు కానీ,
నిన్నూ నన్నూ ఇడదీసే రాతలే రాత్తున్నారు..

అన్నట్టు నీకెతిరేకంగా ఎవలో మాటాడారని
ఆల్లోఆల్లు మాటా- మాటా అనేసుకున్నారు గానీ,
ఈ రోజుకి అంతా సప్పడిపోయారురా!
సుక్కదొరకదనేమో ! అరె నిన్ను మర్సిపోయారొరే!

అరెరే! అది నువ్ కూసున్న సుక్కకానరాదని కాదెహే!
అప్పుడప్పుడు నోరు సేదు చేసుకుంటామే! అద్గది.

అందరూ కలసి నీ మాటల్ని నిజం సేసారు తెల్దా!
మన పేమలన్నీ కట్టుకున్నాయని, కుట్టుకున్నాయనీ
మరి నమ్మకాలేమో రంగులద్దుకున్నాయని..
మన నిక్కచ్చితనం తెచ్చిపెట్టుకున్నదని,

అయినా నొప్పిలేని ప్రేమలు లబించేయడానికి..
ఇదేమన్నా సొర్గమనుకున్నావేమిట్రా!

కొత్తేంకాదు ఈడెప్పుడూ ఇంతే!!
మడిసంటే మనసని నీకెవ్వుడు చెప్పాడ్రా!!
ఊరకనే ఏదారికాదారి విడిపోతాయనుకుంటన్నావా!
మంది కదరా రాసి పూసి ఇడదీసేయాలి!!

తట్టుకు నిలబడాలంటే గుట్టెవడు చెప్పడొరేయ్!
తట్టుకు నిలబడాలంతే!!

నువ్ పోవడమేం కొత్త కాదురా
నీ పేరే కొత్త మాకు
చచ్చేకా ఎవర్నీ మెచ్చుకోలేని మడుసులం
బతికున్నంతసేపు గుచ్చేసుకుంటన్నాం ఎత్తి పొడేసి

ఎదవల్ని ఎదవలని తిట్టేది ఎదవలే!!
ముద్ద ముద్దకీ సెప్పాలేంట్రా!

నీకెలా ఈ లోకం మీన మనసు పోయిందో అలాగే మాకూనూ;
అల్లానే బొత్తిగా దేశమంటే గౌరవం లేకుండ్రా పోయిందిరా!!
అబ్బాయ్! కన్నీళ్ళు కార్సదొన్నావ్ కానీ..
తిట్టుకు సావద్దొనలేకపోయావా!

పోకుండుండాలిగాని!
నువ్వేపొయ్యాక మంచీ-సెడూ దేనికిరా!

ఉండి వంద తప్పులు సేయ్!
తప్పుకాదరోయ్! పోయి తప్పుసేసావురా!
అందరి కల్లో నీళ్ళే..
ఇటూ అటూ కూడానెహే! మల్లా అడగాలేటీ!!

ఇంతకాలం గమ్మునుండి ఇప్పుడెందుకు నిన్ను తలిసానంటావా!
మడిసినిగదరా! గుర్తొస్తుండావు..

నువ్ చమించేసినా నీ సావు
మా సంతోసాల్ని సంపేసింది తమ్మీ!
ఇలా ఓ మారు సూడు సుక్కల్లోంచి..
అంబేత్కరన్నమీదొట్టు. నిను తల్వకపొయినా బతికేస్తాంలేరా!

నీ మీద సెయ్య ఎయ్యలేక ఇలా కుదేలైపోయ్ మనేదలో ఉన్నోళ్ళకి
ఓ మారు నీ నవ్వు సూపరా..

అరె! నేను ఆడెవడ్నో అవుతానన్నావ్ గా !!
ఆడెవరో మాకుతెల్దుగానీ నువ్ మాకు ఎక్కువేరా!
ఏదోలా బేగొచ్చెయ్! మల్లా!
నీకు లేకపొయినా మాకు ఉండాది..నమ్మకం.

సుక్కల్లో కూకున్న సిన్నోడా!
నువ్ మల్లా రావాల్రా!!

సదువుకున్నొడికి సదువే బలం..
ఎలాగైనా బతికేయొచ్చు!
ఈ ఒక్కటి ఆడ.. నేర్చేసుకుని..
మళ్ళొచ్చేయ్!! ఏందీ!!

ఈ పట్టు లోకాన్నీ సదివిదిగాన్లే!
నీ మీదొట్టుగా నిన్నెల్లగొట్టం.
ఈ పట్టు నువ్ మాతోడుండాల..
ఈ నేలనేలాల.. ఇన్పడిందా !! మర్సిపొమాకు! ఆ!!

|| సుభాషితాలను నేర్వని.. లేత తరానికి…. 26.01.2016||

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa