Nov 05 2015

యశస్వి|| =ఉద్యోగపరీక్ష=||

Published by at 1:20 PM under my social views

holiday-a-soldier
తండ్రి: ఆగాగు కుమారా! ఏమంటివి! ఏమంటీవీ!
మద్యపాన వ్యసన వ్యతిరేక దినోత్సవమున కార్యాలమునకేగిన కార్యమేమి అందువా!
ఎంతమాట..! ఎంతమాట..!!
ఇది తప్పనిసరి పనియే గానీ, తప్పుగాదే!..
ఉద్యోగమూ ఓ మత్తేకదా! అని అది నా తప్పనే అందువా! కాదూ, కాకూడదూ..
ఓ కన్నా!
నీతండ్రి జీవనవిధానమే అట్టిది.
అతి ఆహ్లాదకరమైన బాల్యమున ఉంటివి కదా నీవు ..
నా ఉద్యోగనిర్వహణ లోతుపాతులతో.. నీకేమి పని!.
అయిననూ తెలియజెప్పెద..ఆలకించినచో కొలదిఅయిననూ అవగతమవునని ఆశ.
ఈకాలమున ఉద్యోగము సంపాదించుకునుటకన్నా నిలుపుకునుట కష్టము కదా!
అటుల నిలుపుకునే పనిలో భాగమై మదీయ పనిలో మమేకమవడాన్ని నీవంటి బాలకులు, నీ తల్లి వంటి వాచాలకులూ వ్యసనమందురు.
అది ఏమి వింత!
సెలవున్నా లేకున్నా ఉదయాన్నేలేచి నువు పళ్ళుతోమండంలేదా! అది ఏమి వ్యసనము.!!
పాలు తాగడంలేదా! చదువుకోవడంలేదా!
తరగతిలో అందరికన్నా ముందుండాలని ఉబలాటపడుతున్నావే! అది ఏమి వ్యసనము!
విడుదలైన ప్రతి సినిమా చూడాలనుకుంటున్నావే! అది ఏమి వ్యసనము!
ఆదివారం ఐమాక్స్ కి వెళ్ళాలని ఏల అనుకుందువో,
చికెన్ బిర్యానీ తినాలని ఏలా అనుకుందువో
అపార్ట్మెంట్ స్నేహితులతో ఆడుకోవాలని ఏలా అనుకుందువో,
నీ రెండు చేతులతో నా పొట్టను బంధించి బడిమీద ఊరంతా తిప్పాలని ఏల అనుకుందువో, సాయంత్రపు వేళల అస్మత్ భార్యయగు నీతల్లి ప్రీత్యర్థమై మిఠాయి వాలా అంగడికి పోయి స్వీటు తెద్దుమని గడిగడికీ ఏల గిల్లుచుందువో..
… …. …
నాతో చెప్పింతువేమయ్యా.. ఇవన్నియూ నీ వ్యసనములు కావా!
నీ తండ్రి ఉద్యోగి, తాతలిరువురూ వుద్యోగులే!..
బహుశా వారి తండ్రులూ ఆనాడు ఉద్యోగులైవుందురు.
ఆ ఉద్యోగమే మనకు పట్టెడు కూడు పెట్టు చున్నది.
అన్నముపెట్టెడి వ్యవసాయమును వదిలి ఈ నగరమునకు వచ్చితిమి కదా! ఇక మిగిలినది బానిసత్వమే..
నీ బడియందు ఆదివారము సెలవున్నచో నీకు హోంవర్కు ఇవ్వడంలేదా!;
ప్రాజెక్టు వర్కు అని పేరు జెప్పి పిచ్చి- పనులు, అదే.. నీవి ఏక్టివిటీస్ అందువే అటువంటివి.. అది నువ్వు నా మెడలు వొంచి చేయించడం లేదా!
అటువంటిదే నా ఈ మద్యపాన వ్యసన వ్యతిరేక దినోత్సవమున కార్యాలమున కేగిన కార్యము. ఇంట ఉండి..
మొబైల్ ఫోన్ అనబడెడి నా ఉద్యోగనిర్వహణాయుధమును ఎన్నిసార్లు వాడవలె!
వాడితినిబో! …
ఇంట ఉండి లాభమేమున్నదని నీ తల్లి ఏల సణగవలే!
సనిగిణది బో..
నేనేమి మాటలాడుచుంటినో, ఎవరెవరితో వాదులాడు చుంటినో, వేడుకొనుచుంటినో వేడుకలా చూచియునూ..
చూచినది చూచినట్లుండక..
నా ఆ ఉపయుక్త పరికరమును, మరోసతిగానో, తన సవతిగానో నిష్ఠురలాడు గృహలక్ష్మి చూపులూ గృచ్చుకుని..
లక్ష్మీ కటాక్ష వీక్ష్ణములకు ఆటంకమొచ్చెటి ఘడియలేమి ఉన్నయ్యో నని నేను వగచి..
టెలివిజన్ సీరియల్ లో పాత్రల ఆలోచనలవలే పైకి గొణిగిన.. ఆ లక్ష్మి ఎవరని.. నాపైకి దండెత్తివచ్చెడి నీ తల్లి రూపము కాన వచ్చి.. జీవితకాలపు కలచెదిరి, ఇచటకు అరుదెంచితినేమోయని ఏమరపాటున కూడా వెరవకు.. కుమారా!
ఈ నెల మానవవనరుల విభాగము వారు పై అధికారికి నా ప్రమోషను కోసరమై పంపిన ఫైలు అందిందని ఉప్పందగా.. ఒట్టి ఇంక్రిమెంటు జీతాన్నీ, జీవితాన్నీ.. ఊహించలేక.. పరిగెట్టుకుని మరీ బస్సెక్కి విధినిర్వహణలో దూరితిని..
ఇప్పుడు చెప్పు కుమారా!
నాదీ ఓ వ్యసనమేనా!
=* గాంధీజయంతి* 2015=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa