Jan 03 2015

||ఏరకుమీ కసుగాయలు…||

Published by at 3:31 PM under my social views

Stop Violence

 

“పండు పీకేస్తుంది ఆ అమ్మాయి..;
పక్కన కూర్చో(ని) వద్దని టీచర్ కి చెప్పు!..”
డగ్గుత్తిక గొంతువి ఉత్తుత్తి మాటలు కాదని
ఎర్రబడ్డ ఆయువుపట్టు అబద్ధం ఆడలేదని
తేల్చేసినప్పుడు..
ఆశ్చర్యం, భయం, బాధా ఒక్కసారి
తన్నుకొచ్చాయి
బడికెళ్ళి బెంచీ మార్చినంత మాత్రాన
తీరిపోతుందా బాధ్యత !
ఎవరు నేర్పుతున్నారు పసిపిల్లలకి..!
ఎవడో వొకడు..
ఎక్కడో ఓ రాక్షసుడు
మనలో వాడే..
వరుసకి బాబాయో! మామయ్యో!
తాతయ్యో! అన్నో!!
కాకపోతే ఆటోవాడు, పక్కింటంకుల్
బళ్లో టీచరో, డాన్స్ మాస్టరో!
ఎవరైతేనేంలే!
తినలేని కసుగాయల్ని
ముద్దాడనిదెవరు!..
ముద్దులెనక మర్మాల్ని
మర్మాంగాల సలపరింతల్నీ
కొలిచెదెవరు!!
తయారైన పళ్ళ పెద్దరికాల్ని
కళ్ళతోనో- వేళ్లతోనో
తడిమి అంచనా వెయ్యనిదెందరు!!
నన్నో- నిన్నో.
ఎవరైతేనేంలే! ..
పద్దేళ్ళన్నా నిండనప్పుడు
ఆడుకుంటానని..
తీసుకెళ్ళి..చాటుగా..
ఒళ్ళంతా తడిమి
బులబాటం తీర్చుకున్న
పక్కింటక్క ది తప్పుకాదు;
పాలుగారే పాపని
అమ్మా-నాన్నాట ఆడుదామని
చెప్పో-చెప్పకో
చెప్పలేనివేవో..
చొప్పించి చప్పరిస్తే..
తప్పుకాదు
అలవాటైన ఆ పనినే
మరో మారు మనలో ఎవరో చేస్తే..
అసలు తప్పనే అనిపించదు
అకస్మాత్తు గాలివానకి
లేతమొక్కలు కంపించిపోనీ,
జుగుప్సో- ఈప్సితమో
ఖరారైపోయేలోపు
అంతర్మధనంలో..
బిడ్డ దహించుకుపోనీ!
మాట్లాడడానికి.. మనం
మనుషుల్లో ఉండం..
మార్కుల విషయంలో తప్ప
శరీర మార్పుల విషయంలో
మనకు లెక్కలుండవ్.
చిక్కు ప్రశ్నలకు
ఇంటర్నెట్.. సమాధానాలే
ముందు తరాలకు దిక్కవుతాయి..
అవి తప్పకుండా తప్పుదారి తొక్కిస్తాయ్
అన్నీఉన్నవారే..
జాగ్రత్తల్లో దిక్కులేకుండా పోతారు..
పిల్లలేమైతేనేం! నీకేం!!
నీ ఉద్యోగానికో- వ్యాపారానికో
ఢోకా రానివ్వకు!..
కన్నంత మాత్రాన అన్నీ
కనిపెట్టుకోవాలనుందా!
ఎవరిది వారికి తెలియొద్దా!!
అమ్మా- నాన్నలు
అన్నీ పట్టించుకోగలరా!
ఎందుకంటే..
ఈలాంటి మాటల్ని
మర్యాదగల ఇళ్ళల్లో మాట్లాడొద్దు
బయటకు తెలిస్తే..
ఉందో- లేదో తెలియని పరువు
ఉంటుందో!- పోతుందో!!
అమ్మలూ! నాన్నలూ!
మనదేం కాదు తప్పు!!
క్రమశిక్షణో-కార్పణ్యమో
పుట్టినపాపానికి
కొట్టో-ముద్దులుపెట్టో
శరీరం పై మమకారం
తగ్గించేద్దాం..
ఇక ఏ చాక్లెట్ కైనా
బిడ్డ తనువుని
ఎవరికైనా..
కుదవపెట్టగలదు!!
ముద్దే కదా అనుకుంటే!..
రేగిన తేనెతుట్ట
వేడిని
ఎలా తట్టుకోగలదు!
అయినా పర్లేదు!..
అనాదిగా చేస్తున్న పనేగా!!
పిల్లల్ని పక్కలోనో- గదిలోనో పడుకో పెట్టుకుని
గుడ్డి దీపాల వెలుతురులో
మన వేడి చల్లార్చుకుందాం
ఆనక..
వంశాంకురాలు
గాడితప్పి మొలకెత్తాయనో..
పునాస కాపు పిలకలేసాయనో
తప్పు తరం మీద రుద్ది..
తలపై తుండుగుడ్డతో కూలబడదాం
లేదా..
పరువు హత్యలకు తెగబడదాం.
అప్పటి దాక..
ఉతికే పౌడర్ యాడ్ లో
పాప గౌను ఎంతెత్తెగిరిందో
చూసి నవ్వుకుందాం
పిల్లిలా మన మూతుల్ని
తడిచేసుకుని, .. ఠంచనుగా..
మిడ్ నైట్ మసాలా చూసేసాకే..
తుడిచేసుకుని.. ముడిచేసుకుందాం
మస్తుగ.. పండుకుందాం

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa