Dec 30 2014

||నాన్న-సునామీ||

Published by at 5:19 PM under my social views

securedownload *******************************

ఓ తప్పిపోయిన పాపా!

నీకో నిజం

నీ అమ్మా నాన్నా బ్రతికున్నారు’

తమ్ముడు సునామీలో చనిపోయినా

నీకోసం వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు

 

అపూర్వా! ఎక్కడున్నావు తల్లీ!.. అన్న

గుండె ఘోష..

పదేళ్లనుంచీ మారుమోగుతుంది

సాగర తీరమంతా!!

 

తన బుల్-బుల్ కోసం

నీ తండ్రి ఈ వెల్లంగని గుండెల్లోని..

ఇసుక రేణువుల్నన్నింటినీ

ఆవేదనతో తడిపేస్తున్నాడు

 

నువ్వు కొట్టుకుపోయింది కార్ నికోబార్ ద్వీపంలోనైనా..

ఇక్కడ నిను చూసినవాళ్లు

నువ్వు బ్రతికున్నావన్న భరోసాను ఇచ్చారు

ఏ కోలార్ తెగలోనో కలిసి ఉండే

నమ్మకంతో పాటు..

వెతుక్కోవడానికి మరో రాష్ట్రాన్ని

ఆ  తండ్రికి మిగిల్చారు

 

పిచ్చాడిలా తచ్చాడుతున్నాడు

నీ ఫొటోలను పంచుతూ

బ్రతికున్నావన్న ఆశతో!

కనబడ్డ వారినల్లా అడుగుతున్నాడు

 

ఓ తప్పిపోయిన పాపా!

నీకో నిజం

సంవత్సరం ముగిసే ఈ వారంలో

మీ నాన్న తప్పకుండా

నాగపట్నం వస్తూంటాడు

ఏ రోజన్నా కనిపిస్తావన్న ఆశను

తూర్పున మొలిచే తొలికిరణానికి

తగిలించి నీకై అంజనం వేస్తాడు.

 

ఎందుకంటే.. ఏమని చెప్పను!!

నిన్ను మళ్ళా అక్కున జేర్చుకుందామనుకునే

మనిషి కదా వాడు

ఏ మాటలు సరిపోతాయ్

తను ఏరికోరి పెట్టుకున్న

నీ పేరుని అడుగు చెబుతుంది

నువ్వు తన అపూర్వవని

 

ఎప్పుడో ముంచేసిందనుకున్న

సునామీ వెల్లువెత్తుతోంది..

ఇంకా అ తండ్రి గుండెల్లో

ప్రేమ పాశమై నీకోసం

 

నువ్వు పుట్టినప్పుడు

ఉప్పొంగిన ఆనందం ముంగిట

సునామీ ఎప్పటికీ

ఓడిపోతుందని..

నువ్వు చూడని నీ తమ్ముడు

అమర్త్య అరుణ్ ని అడిగినా చెబుతాడు..

 

తనపేరేమిటంటే.. ఎప్పటికీ సడలని..

నీ తండ్రి ఆశ.. అని..

 

నువ్వు తిరిగి రావడంలో అద్భుతం కన్నా’

అవసరమే ఎక్కువని..

వేలాది వేదనల  నిశీధి వెన్నలల

సాగరఘోషను విషణ్ణ వదనంతో

భరిస్తున్న రవి శంకరుడు సాగర తీరంలో

నీకై పడిగాపులు కాస్తున్నాడని,

 

ఎన్నిసార్లు కడిగిందో కెరటం

మీ నాన్న పాదాలను..

ఒక రాకాసి కెరటమై

మిము విడదీసిన పాపానికి

 

ఎన్ని మార్లు ఎగరేశిందో.. గాలి

నీ బొమ్మ ముద్రించిన కరపత్రాలని,

ఈ తీరం వెంబడి..

 

 

ఓ తప్పిపోయిన పాపా!

నిన్ను కాలం కనుగున్నా లేకున్నా

నీకో నిజం..

 

ఎందుకులే ఆడపిల్ల అనుకునే

ఈ లోకం లో

నీ నాన్న తనం ఓ పచ్చి నిజం

 

నువ్వెక్కడున్నావో ఉప్పందించమని

ఒక్క సముద్రం చుక్కనైనా చెప్పమను

కని పెంచిన మమకారం

నిన్ను చేరే క్షణం

కన్నార్పకుండా చూడగలదా

యావత్ ప్రపంచం!!

 

ఇట్లు
నీకై.. ఓ కన్నీటి కెరటం

 

=29.12.2014=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa