Dec 27 2014

యశస్వి|| తమ్ముడూ! పారాహుషార్!! …||

Published by at 1:00 PM under my social views

DSC_0484
************************
నీ బుట్టబొమ్మ నీళ్ళోసుకుందన్నప్పుడు
తండ్రుల సంఘం లోకి వెల్ కమ్ అంటే
మూడు – మూడు సార్లు చెప్పమన్నావ్

ఆశ్చర్యం మా పరం చేసి
ఎంత తాపత్రయ పడ్డావు!!

త్రికం సార్వత్రికం కాని కాన్పని
తెలిసినా.. ముమ్మూర్తులా నీలా వుండే
ముగ్గుర్ని.. కళ్ళారా కనాలనుకున్నావు.
పారాడే క్షణాల కోసం నిరీక్షించావ్

పుట్టకుండానే బిడ్డలు..
లేరని విన్నప్పుడు
నీతోపాటు.. త్రిశంకు స్వర్గం నుండి
ఒక్కసారిగా ఊడిపడ్డట్టైంది.

కీడెంచకూడదని నీ భుజం తట్టి
చెప్పిన మాటలన్నీ తిరిగొచ్చి
నడినెత్తిన కూలబడ్డట్టు..

తలపులన్నీ.. బొప్పికట్టినట్టు..
కేరింతల్ని చాపచుట్టి అటకెక్కించినట్టు..
ఆలోచనల ముప్పిరిలో
ఉక్కిరిబిక్కిరైన వేళ అనిపించినట్టు..

తమ్ముడూ!
అసలెలా ఉంటారో తెలియని
మన పిల్లలు
లేకుండా ఎట్లా పోతారు!

ఈ గ్రహసంచారానికి
వచ్చిన దేవదూతలై ఉంటారు!
ఆట మొదలవ్వడానికి ముందు
పిచ్ ని పరిక్షించడానికి వచ్చిన ఆటగాళ్ళై ఉంటారు!!

జీవ పరిణామ క్రమంలో
ఆ మూర్తులు ఏ స్థితిలో భాగమై ఉంటారు!
పిల్లలందామంటే.. పుట్టుకొచ్చినవారు కాదు
పెద్దలందామంటే.. పేర్లేమో లేవు

వారెవరైనా..
మనకేదో నేర్పాలని వచ్చివెళ్ళారు
మన సంతోషాలకందనిదేదో..
ఇచ్చివెళ్ళారు

జీవితానికి అర్థం కాని బాధని ..
గతానికి వదిలేసి,
భవిష్యత్తు తలుపు గొళ్ళానికి
ఆశనేదేదో తగిలించి వెళ్ళారు

నాగరికత ప్రగతికి కారకులైన ఎందరినో
మనం తలవకుండానే పుట్టుకొచ్చేశాం
జీవనదీప్రవాహంలో ఆసరాలనెన్నో వదిలి
కొత్తసంవత్సరం వాకిలికి కొట్టుకొచ్చేసాం

ఇప్పుడీ కాలం
కోటిఆశలతో పాటు..
ముక్కోటి భయాల్ని మోసుకొచ్చింది.
ఎన్నెన్ని బరువుల్ని మోయలేదు మనం!!

గాజా దాడుల్లో
బీచ్ ఫుట్ బాల్ ఆడుతూ..
ప్రాణం విడిచిన ఆ నలుగురు
ఆఫ్ఘన్ లో వాలీబాల్ ఆడుతూ నేలకరిచిన అరవైలు
పాకిస్తాన్ లో చదువులబడి ఒడిలో కుప్పకూలిన ఆ 153..
వీరంతా పిల్లలేకదా!

ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని
ఈ లోకం లోకి..
ధైర్యాన్ని ఎక్కడ కనాలి!
దైన్యాన్ని ఎక్కడ దాచాలి!!

కొనసాగింపు తరాన్ని
అబద్దపు భరోసాల మధ్య
ఈ లోకానికి
తరలిరమ్మని.. ఎలా బుజ్జగించాలి!!

వాళ్ళెవరో ముందు తరం
ప్రతినిధులల్లే ఇలావచ్చి అలావెళ్ళారు.
మనల్ని పరీక్షించాలని
వెనక్కి మళ్ళారు..

ఏదో ఒకరోజు..
దగ్గర్లోనే కనిపిస్తామని
ఉమ్మనీటి కొలనులో
తానమాడిన
బులబాటాలు తీర్చుకునేందుకు
ఇంకా సమయముందని
మురిపించి పోయారు..

అన్నింటికి సిధ్ధంగా ఉండమని
ఆనందాల ఇంటికి
గంటలు కట్టిపోయారు
All is well అన్న మాటకి
కట్టి ఉన్న గంతలు విప్పిపోయారు..

తమ్ముడూ!
పారాహుషార్!!
ఇప్పుడింక..
2015 కనికట్టు కట్టబోతుంది..
మనల్ని మళ్ళా ఓ పట్టు పట్టబోతుంది

కాలం ఒక గాలం
ఎండమావో ఒయాసిస్సో
దాటేస్తేనే కదా తెలుస్తుంది!!

ప్రేమతో జయించాలి మన కాలాన్ని
వాళ్లే.. మనవాళ్ళై మరలివస్తారన్న
నమ్మకం తోనే నీ.. నా..
కంటిపాపలు.. ఇంకా మెరుస్తునాయిలా!

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa