Dec 18 2014

యశస్వి||……..అడగకు నన్ను!!…………. ||

Published by at 10:49 AM under my social views

10360893_757569787657689_368824801560977244_n

పక్కెక్కడ తడిపేవో.. నని
నడినిద్రలో నిను నడిపించి
బిగబెట్టిన చిట్టిపొట్ట నా రెండు వేళ్ళ మధ్యనుంచీ
నీరు కారుస్తున్నప్పుడు..
ఓ భయం మాయమౌతుంది.. నాకు

మంట మీద మరిగే నీళ్ళ గిన్నెను
నే మునివేళ్ళమీదే మోసుకు పోతుంటే..
తుంటరిగా నువు అదాటున వచ్చేలోగా..
నీరు తొరుపేసుకున్నప్పుడు..
ఓ భయం మాయమౌతుంది నాకు

సరదా కుమ్ములాటల్లో
నీ పంజా కి ఎదురు నిలచిన తనువు
అదిరి; నెప్పి ఎటువైపు ఎక్కువో
పక్కమీద లెక్కగట్టలేక పోయినా
భయం పోగొట్టుకుంటుంది నిద్రలో…

చిన్ని- చిన్ని భయాలకే బెంబేలెత్తే నేను;
బాధగా నువ్వడిగే ప్రశ్నల్లో..

“అన్నల్ని-అక్కల్ని ……….
వాళ్ళెందుకు కాల్చారని అడిగితే..!!”
ఏ భయం లేకుండా ఎట్లా చెప్పను!

మనిషి ప్రాణం బొమ్మతుపాకీ బిళ్ళలెక్కని;
సిధ్ధాంతం అనే భూతం ఒకటుంటుంటుందని,

రాధ్ధాంతం చెయ్యలనుకునే బూచోళ్ళు
నీ బడి తలుపులు బద్దలుకొట్టుకు
రాకుండా ఉండాలనే స్వార్థం లో..
ఏంచెబుతానో ఏమో!

Question bank
కడుపులో పెట్టుకుతిరిగే నీకు
ఏనాటికైనా ఒక నిజం తెలియాలి
నీ నాన్నకన్నీ తెలియవని..

చనిపోవడానికి
బతికిఉన్నదానికీ మధ్య
లోలకం ఈ జీవితమని..

విద్రోహమో, ప్రమాదమో;
గంటలా మోగినప్పుడల్లా
ఏం నేర్చుకున్నామో ఎవరికి వారు
బేరీజు వేసుకోవాలని..
నీ అంత నువ్వే తెలుసుకుంటావు!

మనుషుల్లో పువ్వులూ-ముళ్ళూ
పులులూ, లేళ్ళు అన్నిగుణాలూ ఉంటాయని..

ఇంగితం మరచిన జ్ఞానంలోనే
జంతువులతో తమని తాము పోల్చుకుంటారని

వైరుధ్యాలూ-వైరాలూ
హింసలూ, హత్యలూ సహజధర్మమని

పసివాడికీ, కసాయికి సమాన స్థాయినిచ్చేది దైవత్వమని
బాణంతో లేడిని చంపడమూ.. మానవత్వమేనని..

మనిషికి కావలసింది మనిషేనని,
మానవత్వం, దైవత్వం రెండూ కాదని
ఏనాటికైనా నీ అంతట నువ్వే తెలుసుకుంటావు

నీ పుస్తకం పోయినప్పుడు
పంచుకోవడంకోసం.. ఇద్దరుండాలని

నువ్వు నడిచేది ముందో-వెనకో తెలుసుకునేందుకు
మరొకడు తోడుండాలని..

నువ్వు- నువ్వు గా ఎదుగుతూ
మరో చెట్టుండే తోటలో పండాలని..

స్వపర పక్షపాతం లేని సాంఘిక న్యాయం ఒకటుండాలని..
కాలం కలల్ని కూల్చినా.. కొనసాగించడానికి
ఒక తరం మిగిలుండాలని..

ఏనాటికైనా ఈ నిజం తెలియాలి
నీ అంత నువ్వే తెలుసుకుంటావు
అప్పటిదాక..
ఈ చిన్ని భయాలతోనే బతకనీ నన్ను

పెద్ద-పెద్ద ప్రశ్నలతో భయపెట్టకు నన్ను..
నిద్రలో ఉన్ననిన్నిలా నడిపించనీ నన్ను..

=17.12.2014= 8.pm
‪#‎IndiawithPakisthan‬

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa