Aug 27 2014

యశస్వి || దమన చక్రాలు||

Published by at 1:07 PM under my social views

hqdefault

గమనించారో లేదో
మహా నగర వేగంలో
చక్రాల కిందే పడి నలిగిపోతున్నాం
108 సైరన్ల మీద ఒట్టు
కాలచక్రం పరిగెట్టిస్తుంటే
బండి చక్రం కింద పిగిలిపోతున్నాం
అదేబండైతే ఏమిలెండి
పేచీపెట్టి కొనిపించుకున్న
మీ కుర్రాడి కలల మోటారుసైకిలే కావచ్చు
మీరే ఇష్టంగా పుట్టినరోజుకిచ్చిన కారే కావచ్చు
కంగారెట్టి రప్పించుకుంటున్న కంపెనీ బండే కావచ్చు
ఏదైనా ఓ చక్రాల బండి
బతికి బట్టకడితే
ప్రమాదం తరువాతా..
మళ్ళీ..వెక్కిరింతకు.. ఓ చక్రాల బండే
ఒకప్పుడు బ్రతుకుతెరువుకై మనిషి
చక్రాన్ని కనుగొన్నాడన్నారు
ఇప్పుడు బ్రతుకు తీపికై
చక్రాన్ని తప్పుకు నడవమంటున్నారు
ఇప్పుడేమో కాలాన్ని ఇరుసుకర్రలకు కట్టేసి
చక్రం అంచున అంటుకున్న దుమ్ములా
ప్రమాదం అంచుకు జారిపోతున్నాం
ఎక్కడో అక్కడ రాలిపడిపోతున్నాం
నడిపేవాడితో శని జట్టుకడుతున్నాడు
నడిచేవాడిపై యముడు మొగ్గుచూపుతున్నాడు
సూర్యుడితో నిమిత్తం లేకుండా
పాదచారి ఆ కొడుకుల బారిన పడిపోతున్నాడు
తల్లిదండ్రులారా! ఒక్కమాట..
పిల్లలకు విద్యాబుద్దులు చెప్పించడంలో
మొదటిది లేకున్నా పర్వాలేదు
రెండవదానివద్ద బోర్లాపడొద్దు
నిర్లక్ష్యానికి నిష్ఠూరాలాడేకన్నా
బిడ్దలు విసుక్కున్నా జాగ్రత్తలు చెప్పుకుందాం
రేపటికి రెండోరోజు కాకుండా చూసుకుందాం

=27.8.2014=

RTS Perm Link

One response so far

One Response to “యశస్వి || దమన చక్రాలు||”

  1. YasaswiSateeshon 27 Aug 2014 at 1:09 PM

    [నా సహచరుడి అమ్మాయి కాంపస్ నియామకాల్లో ఎంపికైన ఉద్యోగానికి మొదటిరోజువెళ్ళి వస్తూ రోడ్డు దాటుతుంటే.. నిన్న ఓ బైక్ రైడర్ గుద్దేసిఆపకుండా వెళ్ళిపోయాడు.. ఆ అమ్మాయి కాలుమీదకి మరో వాహనం ఎక్కేసింది.. ఇప్పుడు ఆపరేషన్..జరుగుతుంది]

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa