Aug 26 2014

my foreword to varchaswi poetry book లోకాస్సమస్తా… “‘యశస్వీయం’”

Published by at 5:01 PM under my social views

loka loka2 copy
Everything has been said before, but since nobody listens, we have to keep going back and beginning all over again
-André Paul Guillaume Gide
(French critic, essayist, novelist NobePrize winner in Literature )

సోదరా! వర్చస్వీ!!
నీ మాటకాయాలని గానీ నీ కళావిష్కరణకు నా మేళతాళాలా! నీ వాత్సల్యంలో తడిసినవాడినవడం చేత.. నీ ఆశల ఆదేశాలు తుడిచేయలేక, ఈ కృతికి ఫలశ్రుతిని కూర్చ సాహసించాల్సి వచ్చిందిగానీ కవీరవి వర్చస్సును లోకపరంచేయ నాతరమా ! “మన వనం మనది. మన పరిమళం ఇద్దరిదీ” అన్న నీమాటకు కట్టుబడి ఈ క్విడ్ ప్రో కోకు నడుంకట్టాను..
అప్పుడెప్పుడో “ఒక్కమాట” కవితత్వాలలో ఓపీట వేసినందుకేనా నన్నిలా సరసవచోవిభూషితుల నడుమనిలా నిలబెట్టావు!  అయినా ‘ఎవ్విరిథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ క్విడ్ ప్రో కో’ అనే కదూ అన్నావు నువ్వు!! ఈ క్విడ్ ప్రో కో రగడ గుసగుసలను మాయ మాటలకు వదిలేసి.. కాసేపు నీ కవిత్వ రసాస్వాదన గురించి ముచ్చటిస్తాను.
ఎవరెవరి స్వభావాలు వారివారి వ్యక్తిత్వానికి శీర్షికలవుతాయి. అటువంటిదే ఈ కవితా సంకలనం ”లోకాస్సమస్తా..” ఆలోచనల్లో కర్పూరాన్ని వెలిగించడం, చెప్పీ చెప్పకుండానే కనువిప్పు కలిగించడం, నీ కుంచెకు అలవాటేగా! ఇప్పుడది కలానికీ అబ్బినట్టుంది; రాసి రంగుల్లోమ్ముంచుతున్నావిలా. రససిధ్ధికి ఎవడు పుస్తెకట్టె! అని అనుముల కృష్ణమూర్తిగారు అన్నారని విన్నాను. రసానుభూతికి అందించలేనిది కవిత కాదని నమ్మాను. అదేదో బ్రహ్మ పదార్థమో, బూతుపదమో అనే భ్రమల్లో ఉండే వచనకవుల కాలంలో నిజానికి తప్ప ఏ ఇజానికీ లొంగకుండా శ్రవణపేయ పద గుంఫనతో లోకకల్యాణం కోరే కవిత్వాన్ని రాసి ఆస్వాదింపజేయడం సాహసమే. అందుకు అభినందించాలి నిన్ను. “నేనే నీ సొంతమైనప్పుడు అక్షరాలు అనుభూతుల్ని మాత్రమే మిగల్చాలి.. కవిత్వం మనలోనికి ఇంకి “లోకమంతా తెల్లకాగితమవ్వాలి..“ అని నా తొలికవిత్వసంపుటిని వెలువరిస్తూ ఆకాంక్షించాను.. నువ్వేమో లోకాస్సమస్తా.. అంటూ.. అర్ధోక్తం ఆపావు.. అయినా అర్థవంతంగానే ఉన్నది.. పూరణ స్ఫురించని వారండరుగానీ.. మంచిమాటకు పునరుక్తి దోషమంటదని ”లోకాస్సమస్తా.. సుఖినోభవన్తు “ అని పూరిస్తున్నాను.

“అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా? ఆదిమూలమా! ..” అని జ్ఞానబోధ చేస్తారు త్యాగరాజు. నిజమే కదా! ఏది నిజమైన సుఖాన్నిస్తుందో తెలీక కొంత, యుక్తాయుక్త విచక్షణ లేక కొంత కలత చెందుతాం.
ధర్మాసక్తిని పెంపొందించే సాహిత్యమే దుఃఖరాహిత్యానికి కారణమౌతుందనే స్పృహ పుచ్చా లక్ష్మీనారాయణ వర్చస్వి అనే ‘పేరున్న’ చిత్రకారుడ్ని ‘వర్చస్వీయం’ కథా సంకలనం, కధకుడిగా దశాబ్దాలక్రితమే (1997) పరిచయం చేసిందన్న విషయం తెలుగుసాహితీజనులు కొందరికి తెలుసు.
తను ప్రచురించిన మొదటి కథ ‘తెలీదు’ శీర్షికన అక్షరాల్లోనూ.. ఎక్కాల్లోనూ చెప్పినా ఐదు పదులు యాభైసార్లు తెలీదు.. తెలీదు అంటూ తెలియచెప్పడంలో చూపిన నేర్పరితనాన్ని లోకం ఎప్పుడునేర్చుకుందో తెలీదు.. ఇప్పుడిలా నాద్వారా కవి వర్చస్విని తెలియనివ్వమని లోకాస్సమస్తా… సిధ్ధమైపోయింది.. శుభమస్తు.
అవునన్నా.. కాదన్నా లోకానికి వర్చస్వి వ్యంగ్యచిత్రకారుడిగానే పరిచయం.. సాంకేతికతను అందిబుచ్చుకున్నచేయి తనస్మార్ట్ ఫోన్ పైనే క్షణాల్లో ఎన్నోబొమ్మల్ని ఆవిష్కరిస్తుంది. కొందరు సాహిత్యకారులంటారు.. చిత్రకారుడి పనితనం కవితలోనూ కలగాలని.. ఇది వర్చస్వికి వర్తించదు బొమ్మల్ని గీసినంత తేలిగ్గా ఇతను కవితలల్లగలడు.. నా ఉద్దేశం కుంచెకే తిరిగినచేయనో.. కలం చేసుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తాడనో కాదు.. నే చెప్పాలనుకున్నదల్లా.. కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే అక్షరార్చన చేస్తాడని.. చిత్రకళా జగత్తులోంచి తెలుగు సాహితీ సౌరభాలను గుబాళింపజేసిన వారెందరో ఉన్నారు. అడవి బాపిరాజు, తుమ్మపూడి సంజీవదేవ్, అలిశెట్టి ప్రభాకర్ వంటి పూర్వకవుల నుంచి, శీలావీర్రాజు, సుధామ వంటి సీనియర్ కవులూ, సంకిస రామశాస్త్రి .. తదితర సమాకాలీన కవులూ.. ఎందరో అటు కుంచెతోనూ ఇటు కలంతోను కాగితాల లోంచి, కాన్వాసుల్లోంచి కవ్వడులై కవనవనాన్నీ రాగరంజితం చేశారు; చేస్తున్నారు. ఈకోవకు చెందిన కవులరచనలు వారి చిత్రకళా నైపుణ్యంతో పరిపుష్ఠమై కోమలత్వం, లాలిత్యాలను కలిగి మనకళ్ళకు పదచిత్రాలను కట్టించడంలో ముందుంటాయి. వర్చస్వి ఇందుకు మినహాయింపు కాదు పైపెచ్చు ప్రబంధకాలపు పదబంధాలను కాలాతిక్రమణ భావన కలగనివ్వని చందాన వచనకవిత్వంలో పొదిగి, శాశ్వతత్వాన్ని కవితార్ధానికి యుక్తిగా ప్రయోగించగలడు. కవోష్ణరుధిరార్ణవం, నవనవోన్మేషణమౌ నవ్య స్నేహవనం, సంతృప్త మహా శ్వేత కాంతి వంటి పదబంధాలు రసభావసౌందర్యానికి పెద్దపీట వేసినా తన అంతరంగాన్ని అలతి పదాల్లో అందించడానికే అగ్రతాంబూలం ఇచ్చాడు. ఇది ఉదాహరణలతో తూచే సందర్భం, సమీక్ష కాదుగాబట్టి కవితత్వాన్ని పంచడంలోనే పరిమితమౌతున్నాను.

కవిగా ఇతడు ఉన్నతుడు, కవిత్వానికీ హుందాతనాన్ని పంచగల నేర్పరి. కవికి ఉన్న లోకోత్తరమైన స్థానాన్ని ఉన్నతోన్నతంగా ఉంచాలన్న తలంపే తప్ప నీతులు, నిబంధనలు ఉసిగొల్పులు, ఉద్రేకవాక్కులు ఇతని కవి సమయాలు కావు.
“ఎండిన మనసు మళ్ళలో కుదుళ్ళు కడదాం..వీలుచూస్కుని నాలుగు చక్కటి మాటల మొక్కల్ని నాటేద్దాం..ఇప్పటికే తడారిపోయిన ఎడారి పెదాలపై కాసిన్ని నిర్మలమైన నవ్వుల జల్లుల్ని చల్లి చూద్దాం.., మరో స్నేహ ప్రస్థానాన్ని పండిద్దాం”. ఇదీ ఈ కవితత్వం.
అలా అని తప్పుడు లోకాన్ని నిగ్గదీయని వెనుకబాటు ఈ కలానికి ఏ నరానా లేదు..
ముఖాన్ని కప్పుకు తిరగాల్సిన కలికాలమొచ్చిందని ఆడపిల్లల పాట్లకి వగస్తూనే..
“మట్టిగొట్టుకున్న మగతనాలు పడతుల ముఖాన యాసిడ్లు కొడుతుంటే పూడుకుపోయిన గొంతులు ఇప్పుడిలా వెకిలిగా ప్రశ్నించడమేమి”టంటాడు. “దౌర్జన్యం చేసిన దౌర్భాగ్యపు ముఖాలమీద ఉమ్ము కూడా వేయడం ఎందుకులెమ్మంటూ.. నోటికి అడ్డంగా కప్పుకుంటున్న క్షమాతెమ్మెరలు!! ముఖాన కట్టుకునే.. స్టోళ్ళు” అంటాడు. వంపుతీరిన సకార దేహం మాత్రమే చూసే కళ్ళకు పురుషల ద్వంద్వ నైజాల్ని చీల్చే చుర కత్తీనీ, విశ్వాన్నీ- ఆత్మవిశ్వాసాన్నీ నింపుకున్న క్రావడిదొన్నెనూ చూపిస్తాడు.. ఏ తల్లి కన్నబిడ్డో అని దీవించేంత మమకారం కలుగుతుంది ఇతని కవితా పలుకులు వింటే. స్ర్తీని, ఆమె ఆలోచనలను యథాతధంగా ఆమోదించలేనితనం ఈ లోకం లోపమే.
పుట్టి బట్ట కట్టినందుకు లోకంతో జట్టుకట్టినందుకూనూ అమ్మ పాదాలకు మొక్కి అక్షరప్రాశన నుంచీ ఆటాడుకుంటున్నాడు. ’ఉమ్మనీటిని చిమ్ముకుంటూ బొడ్డూడగొట్టుకుని మరీబిడ్డడు ఒడ్డున పడేది, అమ్మ కాళ్ళకి మొక్కాలనే..’ ఇది ఉత్తమ సంస్కారం.. జన్మ సంస్కారానికే కొత్తభాష్యం. ఈ పాదాలు. మానవతాజ్యోతీ, ఆనందవిభూతీ కలగలిసిన సౌందర్య భావన.!
ఇతని కలానికి కొన్ని పరిమితులున్నాయి.. అవి కవి ఐనవాడికి ఉండాలి కూడా. సుఖాన్ని, సంతోషాన్ని, హాయినీ హ్లాదాన్ని తప్పనీకుండా రసరమ్య సమ్యక్ స్రష్టగానే
మిగిలిపోవాలనుకుంటాడు
మానవత్వాన్ని మరచి హత్యాచార యత్నం చేయబూనే వాడిని తిట్టడానికి పదాలు వెతుక్కుంటాడు.. వాడి కాముకత్వానికి-అవాక్కై అరవాక్యం కూడా రాల్చలేడు.. చివరికి లోకహితం కోరి కవితాగొంతుక చించుకుని నీచత్వపు నాశనం కోరుకుంటాడు…. చీకట్లు పారద్రోలాలనే.

ఈ కవికి ఎన్నో కలలు. అవి మనవల్ల సాకారమవ్వాలని కలం పట్టాడు…
గద్దలు తిరగని రాజ్యాలని ఆహ్వానిద్దామని.. చెట్టపట్టాలేసుకుని నడవాలని, ధరణీమాత పవిత్ర పాదాన పచ్చదనాల పసుపు పారాణి పెట్టాలని…. జడత్వాన్ని వదలి ఒకానొక చైతన్య కవిత్వంగా ప్రతిఒక్కరూ ప్రవహించాలని..

వర్చస్వి కవిత్వం రాసేందుకు పెద్ద-పెద్ద కారణాలు వెతుక్కోడు.
‘అంతరించిపోతున్న పిచ్చి పిచ్చుక కంఠం నన్నప్పుడప్పుడు రెచ్చ గొడితే చాలు!…
ఏ నది ఒడ్డునో సుతారంగా నా వొళ్ళో రాలే రెల్లు పూలు
గిల్లికజ్జాలాడుతూ ఘొల్లుమంటే చాలు..!
నాలుగు రాకాసి చినుకులు హాయిగా తునాతునకలు చేసినా చాలు… !
ఎప్పుడో ఎవడిదో ఎక్కడో దారి తప్పిన మానవత్వం
గట్టెక్కి గాడిన పడి గుండెల్ని గిలిగింతలు పెడితే చాలు!…
పదే పదే పదివేలై నా ఎదలో కవితగా వ్రాలు’! … అంటాడు.. అనుకుంటాడు.

ఇలా ఎన్నైనా చెప్పగలను కవితాజలధికి పరిధులు గీయకుండా, తన మానాన ముసిరింతై కురిసిపోయే ఇతగాడి గురించి. గజల్ లక్షణాలనే గజల్ గా మార్చి వినిపించిన ప్రయోగశీలి, పాబ్లో నెరుడా ‘పదం’ని చొరవచేసి ఘుమఘుమతావుల గుమ్మరింతల మేఘమైనది ఆనాడితడొక్కడే.

వర్చస్వి కవిత్వంలో గమనించాల్సినవి అందులోంచి నేర్వాల్సినవి చాలా ఉన్నాయి..
ముఖ్యంగా నవకవులు కత్తికి-కలానికీ మధ్య అంతరం గ్రహించాలి. కవి ఒక మెట్టు పైకెక్కి చెప్పినా తప్పులేదు కానీ అస్థిత్వవాదాల చాటున నక్కి, గతం గాయాల రసినీ పుసినీ కాగితాలకెక్కించరాదు. పక్కవాడిని మనిషిగా చూడలేనితనం బుజంతట్టి లేపలేని తటస్థత ఎన్నడూ క్షమార్హం కాదు.
నలిగినమనసుల్లో బాధను కవి పంచుకోవాల్సిందే. అది కష్టజీవికి ఇరువైపులా దన్నుగానిలబడాల్సిన బాధ్యత. నిరంతరం ‘నిన్నెవ్వరో అణిచేశారని’ పాచిపళ్ళ పాట పాడటం జాతిద్రోహం. మానవుని ముంచెత్తే భావాలు, అనుభవాలు సమస్యలు అవి ఎలాంటివైనా సరే- వాటికి స్వాదుత్వమిచ్చి, స్వస్థపరచి రసస్థాయికి చేర్చినప్పుడే… అవి ఆనందానుభూతిని కలిగిస్తాయి. కవి కర్తవ్యమిది.

కవి చేయవలసిన పని మానవుడ్ని సేదతీర్చడం, అభయమివ్వడం, ఆనంద పరచడం తద్విరుద్దమైన రచన కవిత కాబోదు.

తమ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుని ఏ సృజనకారుడూ మనలేడు. ఈ విషయాలపై స్పష్టత వున్నవాడు వర్చస్వి. అందుకే ఏం రాసినా అది సగం కవితే అన్నాడు.. శీర్షికతో సహా. మిగిలిన సగం మనదగ్గరున్న రంగులతో నింపుకోమన్నాడు. నిండుగ చెబితే వినే కాలం కాదని ఆలోచనలు రేకెత్తించడానికే అక్షరాలను కళ్ళవెంబడి పరిగెత్తించాడు.

ఇదీ ఓప్రారంభమేగా ..

ఎడబాటు వడగాల్పులు ఎడాపెడా కొడ్తున్న సాహితీలోకంలోకి వృష్టిసృష్టికి సమాయత్తమవుతున్న శీతలమేఘపు చిరుగర్జనలా అక్షరాన్ని దీక్షగా సాక్షాత్కరింపజేసుకుని మరీ వచ్చాడు తొలకరి మిణుకు కణికై.
ఇక మనముందున్నది తన్మయత్వంలో తడిసిపోవడమే.

లోకాస్సమస్తా.. సుఖినో భవంతు.

యశస్వి’ సతీష్
కవిసంగమం

RTS Perm Link

One response so far

One Response to “my foreword to varchaswi poetry book లోకాస్సమస్తా… “‘యశస్వీయం’””

  1. YasaswiSateeshon 26 Aug 2014 at 5:05 PM

    http://kinige.com/book/Lokaassamastaa

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa