Apr 18 2014

|| రామ.. రామ||

Published by at 6:28 PM under my social views

images (4)

‘తమీజ్’ ఎవడబ్బసొత్తు భాయీజాన్!
గాయం సలపరించినపుడల్లా
తడుముతున్నావ్ మనసును..
ఎవడ్నడ్డం పెట్టుకుని తిడుతున్నావ్?
మర్యాదాపురుషోత్తముడ్ని తడవ తడవకూ !!

నీకోరంగు నాకోరంగు అని
రక్తానికి రంగులద్దినప్పుడే
మూడురంగుల జెండాలో ధర్మచక్రం తెల్లబోయింది

ఘాతుకానికి ఒడిగట్టింది రామ సంతానమన్నప్పుడే
సహనపు పరిధుల్ని మాట దాటిపోయింది.

మనుషులు మాంసం ముద్దలైన అకృత్యానికి
జయధ్వానాల వేలంవెర్రి ఒకటి..
కళ్ళారా చూసినవాడ్ని
ఓ సందర్భ అశుధ్ధం అది.
భావోద్వేగ ప్రలాపాలను
వారసత్వమనుకునే వెర్రికి పోటీ ఏది?

దిగ్భ్రాంతి చెందిన దేశమంతా
అయ్యో! రామ!! అని నోరుతెరిచినప్పుడు
మనసు చెవిటిదయ్యిందా!!
అదే నావారసత్వమని నువ్వు నమ్మేదెలా!!

ఏ ఆహారంకోసమో
చంపేది మనిషైనప్పుడు
బలయ్యేది మూగజీవమేకదా
ఏ వ్యవహారం కోసమో
బలయ్యేది మనిషైనప్పుడు
చంపేది ఉన్మాదమేగా

దానికి మతాలతో పనుంటుదా
అభిమతాల గొడవ కత్తికి అడ్డంకా!

హింస రచన చేసేవాడెవడైనా కాఫిరే ఈ దేశంలో..
కట్టె ఏరంగులో మండినా దాన్ని మంటే అంటారు
కత్తివేటును ఈ భూమ్మీద ఎక్కడన్నా
కసాయితనమనే అంటారు

బీభత్సానల వర్ణ వివరణలు నాకు చేతకావు
రాజకీయ ఎత్తులను మతంతో మూటకట్టలేను
నీకు అలాయ్-బలాయిచ్చే నీ భాయిని నేను

విధివంచితులంతా నా తోబుట్టువులే
‘ఏదో’ సందర్భాన్ని ఎత్తుకుని కళ్ళొత్తుకోకు
ఏడ్చి- ఏడ్చి కళ్ళొరిసిపోయే ఉన్నా
నీ కళ్ళద్దాలను సర్దుకో

ఇలాంటివి ఎన్నో విన్నాం కన్నాం మోసాం
ఇప్పుడిలా నువ్వూ- నేనూ మిగిలాం
అవమానింపబడి కోల్పోయిన గతాన్ని
ఇద్దరం మర్చిపోలేదెన్నడూ

జరిగినదారుణాలెన్నో..వ్రణాలై స్రవిస్తున్నాయి
తలవాల్చి నే నుంచున్నా మంచినే తలవాలని
చిరుగుల చరిత్రను మరుగునపెట్టాలి మనం
కోతిపుండుని ఎంతకాలం కెలుక్కుందాం!
తోచిన అర్థం వెతుక్కుంటూ

నువ్వొద్దొన్న వాడేమీ నా చుట్టమూ కాదు
వాడొక్కడే నా కున్న నాలుగు దిక్కులూ కాదు
మోడును తిట్టుకుంటావో.. గోడను కట్ట్టుకుంటావో
దుష్టుల దృష్టాంతాలు చూపించి
వీళ్ళే నీవాళ్ళని…గిరిగీసి ‘
ఏ గాడిదను నాగాడిన పెట్టాలనుకుంటున్నావో!!

నేను మాత్రం నీకన్నా పరాయిదేశపు సోదరుడే
ప్రేమాస్పదుడేమోనని తలపట్టుకుంటున్నాను
అయినా సరే.. భారతదేశం నా మాతృభూమి
స్వధర్మనిరతులైన దైవనిందితులు.. నా సహోదరులు
**
(Blasphemy is a passion in India, Apostasy is a practice)
=16.4.2014=

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa