Sep 30 2013

నీ అస్థిత్వం ఒక వస్తువేగా!. ……………………..

pellam.jpeg

ఏమి చేద్దామనుకుంటావురా!
తాత్కాలిక శతమర్కటా!..

అన్నిరోజులూ ఒక్కలానే మొదలౌతాయి మరి..
అమ్మ నేర్పిన అలవాట్లు..
ఉన్నాడో-లేడో తెలియకపోయినా అప్రయత్నంగా చూపులు దేవుని పటం పైనే..

తన శరీరం తప్ప వేరొక ప్రాణేదైనా కనిపిస్తుందేమోనని తేరిపార చూస్తావు..
అద్దంలాంటి ఇంటిని చిందరవందర చేయలేని నీ జేబు సామాన్లు.. విడిచిన బట్టలు
పక్కకిలాగితే ఆక్రమించుకున్నంత జాగా కాదు ఈ ఏకాంతం నీ జీవితంలో
చీమ కూడా కనిపించని అంతస్తుల అద్దెకొంపలోనీ అస్థిత్వం ఒక వస్తువేగా!..

మౌనం మూర్తీభవించిన పనిపిల్ల వచ్చినట్టు తలుపు చప్పుడో..
వెళ్ళినప్పుడు ‘తలుపేసుకో సారూ’ అన్న సూచనో నిన్ను అప్రమత్తం చేసే రెండు క్షణాలు
నువు ప్రాణమున్న జీవానివని గుర్తుచేస్తాయి..

ధ్యానంలోంచి లేచినట్టు.. ఏకాంతమందిరంలోంచి జనజీవన స్రవంతిలోకి
వడివడిగా ఒక దూకు దూకుతావు.
ఇక రోజంతా.. నీదికాదు..ఇక ఇల్లుచేరే వరకూ.. నువ్వు నీలో ఉండవు.
నీవు నావనైనట్టు జనసంద్రాన్ని చీల్చుకుంటూ కనిపించని గమ్యం వైపు సాగిపోతావు

బంధాలు తోడున్నప్పటి ఆకతాయి మనసుకు,
ఆనాటి ఉడికించే మాటలకు అసలు అర్ధాలు ఇప్పుడే తేటతెల్లమవుతాయి.

ఎటుచూసినా ఒక తెలియనితనం నీదికాని పరధ్యానంలో లోకం.
అప్పుడే తెలుసుకుంటావు నీలోకం వేరోకచోటఉన్నదని..
నిన్నే కలవరిస్తున్న నీ నేస్తాలకు నువ్వు అందవు.

మాటల్లో ఒలికేవి పనుల్లో పలికేవి ఎన్నున్నా ..
నీ ధ్యానం లో నిలిచేవి జన్మ బంధాల అనుభుతులేనని..
నిముషాలు యుగాలుగా మారే రోజుల్లో నువ్వో యోగివి..
తపస్సు ఏమిటో అ మాత్రం ఎరుగవా!!

వెనక్కి వచ్చే రైలు బండి కూత కోసం..
సాగనంపిన క్షణం నుండి పడికాపులు కాస్తున్నావ్..
సహచరి ఊరెడితే.. ఏ తోడూ కావాలిరా!
తిరిగివచ్చే తనతప్ప..

రిప్వాన్ విన్కిల్ లాంటి ఎదురుచూపుల జీవితం లో
అప్పుడప్పుడు వినిపించే స్నేహపు పలకరింపులు తప్ప..
సినిమాకథల్లో తప్పులను చూసి నవ్వుకోవడం తప్ప..
ఎదురుచూస్తూ కూర్చోవడం .. తప్పు కాకపోవడం తప్ప.

==29.9.13==

RTS Perm Link

2 responses so far

2 Responses to “నీ అస్థిత్వం ఒక వస్తువేగా!. ……………………..”

 1. మద్దిరాలon 02 Oct 2013 at 6:14 PM

  చక్కని భావాలెన్నియొ
  చిక్కగ పలికించగలుగు చేవది నీకెం
  చక్కగ మదినుండగ ఆ
  చిక్కని భావాలె చెలులఁజేర్చుయశస్వీ

 2. భార్య పైన ప్రేమ పతికి వున్నంతగా
  తల్లి దండ్రికైన చెల్లెలక్క
  బంధువులకునైన ప్రపంచమున మరె
  వ్వరికి లేదనునది వాస్తవమ్మె
  మద్దిరాల శ్రీనివాసులు- సెల్:9010619066

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa