Aug 16 2013

యశస్వి || చివరి సారి..

Published by at 8:09 AM under my social views

వాన చినుకులు బయట-లోపల పడుతున్నాయని..
తనకే తెలుసనుకుంటున్నాయి విడివిడిగా..
కలిసి నడుస్తున్న జంట అడుగులు

విడిపోవాల్సిన తరుణంలో
ఆఖరి కలయిక అని తెలిసీ
మనసు విప్పాననుకున్నాడు అతడు..

జారిపోతున్న మనసుని పొదవిపట్టుకుంటూ..
సున్నితంగా యధాస్థానంలో పెట్టాలన్న ప్రయత్నం
ఆమెది.

ఇక్కడ మాటల బరువును తూయలేము.
అసలు వాళ్ళమాటలు వాళ్ళైనా వింటున్నారా!!
విడిపోతున్న మలుపులో భావం అతకని
పదాల పలవరింతలు..

సంవత్సరాల తరబడి
ఎన్నో మాటల్లో తొంగిచూసిన తడి
ఎదకి చేరుతుందన్న ఆశల ఆవిరి
ఇవేమీ పట్టని అలజడి అతనిలో

మరలిపోక తప్పదన్న నిజాన్ని
నీకే ముందు చెప్పానన్న అర్థంలో

ఆపాదించిన పొడిమాటల
చిక్కదనపు లెక్కల్లో ఆమె..

అపోహలుండేవి ఆమెకు..

తలఎత్తి నడిచేది
తన చూపు తాకాలనేనని,

తలదించి మాట్లాడేది
తన సౌందర్యం మాటలకు అడ్డురాకూడదనీ..

గోదారి పరవళ్ళను చూడకుండా
చీకటి సముద్రంలోకి
తనను నెట్టేస్తుందని అతని బెంగని..

అపోహలుండేవి ఆమెకు..

అతడో సున్నిత భావాల బావి అని తెలిసినా
ఆమెకు తెలియని లెక్కలెన్నో..

విప్పారిన కళ్ళ వెలుగును..
గుప్పిట పట్టి అందించేందుకే
తన బిడ్డ కబుర్ల్లను మళ్ళీ-మళ్ళీ అడిగేవాడని..

వీడ్కోలు చెప్పిన ప్రతిసారీ
శాంతిమంత్రం మదిలో మెదిలేదనీ..

తను ఆడపిల్లయితే అచ్చం అలానే ఉండేవాడిననీ..
ఆమెకు చెప్పిందీ లేదూ..ఆమె వినిపించుకోదు..

కవలపిల్లలు విడిపోతున్నట్టు
ఆఖరిసారిగా కలసి నడుస్తున్నారు
వాన చినుకుల్లో….
ఎప్పటిలాగే సంఘజీవుల్లా
ఎవరి మనసును వారే దూరం జరుపుకుంటూ..

కంటి చెమ్మను ఆపలేని దేవుడు..
నుదుటి గీత దాటరని తెలిసి
నవ్వుకుంటున్నాడు..

==12.8.13==

RTS Perm Link

2 responses so far

2 Responses to “యశస్వి || చివరి సారి..”

  1. kanistaon 20 Aug 2013 at 6:08 PM

    నా మ‌న‌సు నీ సొగ‌సునే కోరుకుంటోంద‌ని తెలిసి
    చుక్కాని లేని నావ‌లాంటి నా జీవితాన్ని తీరం చేర్చాల‌ని…
    వెలుగు చొక్కా తొడుక్కున్న చీక‌టిలా…
    నీ నిశ్శబ్దమే అంగీకార సూచ‌కంగా…

    ఓ చెలీ!

    ఎంత‌కాల‌మైనా … నీకోసం నిరీక్షిస్తూ…

  2. fathimaon 21 Aug 2013 at 10:15 AM

    ప్రతి అక్షరమూ తన వంతు భావానికి బాసటగా నిలిచింది, మీ శైలి అనితర సాద్యం ఇది అతిశయోక్తి కాదు, చాలా బాగా ఉంది.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa