Jul 05 2013

యశస్వి || జిందాబాద్ అందామని..

Published by at 12:32 PM under my social views

రాజకీయం చెడ్డాకాదు..
మనుషులందరిలోనూ మంచితనం మాత్రమే లేదు..
మరెందుకు ముందు జైకొట్టి.. వెనక తిడతాం!!

మందుకొట్టి మద్యనిషేధం కావాలనడం
ఎంతకష్టమో తెలుసా మనకు!!
అయినా సరే.. ఓ మాట అడుగుతాను

చెడుకు పట్టం కట్టాక..
మహా ఐతే జరిగేది మరింత చేటు
కాకపోతే.. ఇంకో మాట చెప్పు…..

అబద్దాలు మనకు అరాచకంతోనే మొదలయ్యాయని..!!
ఏమీ చెయ్యకుండా సంపాదించడం ఇలాకాక మరి ఎలా అని..!!
వ్యాపారాలకు ఒప్పందాలేలా జరుగుతాయని!!

కొత్త పదాలతో పాతకాపులే చక్రం తిప్పుతారనీ
పనికి రాని దేశాలతో మాటల యుధ్ధానికి కాలు దువ్వుతారనీ..
డబ్బులున్న దేశాలకు బెట్టుగా తలొగ్గుతారనీ..

ధనవంతులను మరింత బలవంతులుగ మార్చారనీ
చెత్త మనస్తత్వాలను జనరంజకం చేస్తూ..
ఈ పోసుకోలు కబుర్లేనా.. నువ్వు-నేను రోజూ తలచుకునేది!!

ఎడమ- కుడి కొట్టూకుంటేనేకదా..చప్పట్లు మోగేది..
దృశ్య శ్రవణ మాధ్యమాలలో దుమారం రేగేది..
మన ఇంట వినోదం.. వీధిలో చర్చా సాగేది!!

తిట్టుకుంటూనే కొందరిని..
నెత్తిన పెట్టుకుంటున్నాం కద! కడదాక..
కాటికీ పదవిలో ఉండగానే.. సాగనంపుతున్నాం.

ప్రజాస్వామ్యంలో రాజ లాంఛనాల అంతిమ సంస్కారాలు
ఎందుకందిస్తామో తెలుసా!!
రాజకీయ రంగులో తప్పనిసరి విలాపాలు కష్టంగా మోస్తారని..

1. బయటి వారికోసమే బ్రతికేట్టు కనిపించాలి
2. అధికారాన్ని ఆనందించలేని ప్రజాజీవితం గడపాలి
3. తమ గురించి చెడు చెప్పుకోనీకుండా పక్కోడినీ చూడాలి
4. డబ్బులేమీ ముట్టని జీవితాన్ని లోకానికి చూపాలి
5. ఓటు పోతుందేమోనని.. దేన్నీ కాదనలేని అసహాయత వారి వారధి
6. నవ్వడం.. చేతులు కలపడం ఎంతకష్టమో కదా!!
7. తేలిపోయే వాగ్దానాలు తేలిగ్గానే చెయ్యాలి
8. కొత్త ప్రయోజనాలకు తలొగ్గాలి..
9. అత్యంత ఆసక్తికరంగా అనవరతం మెలగాలి..

ఎంత కష్టం ఈ జీవితం!!
అందుకే ఎర్రతివాచీ స్వాగతాలు..
అంతిమంగా.. జాతీయ పతాక అవనతాలు..

ఎక్కడ మొదలెట్టి.. ఎక్కడకు వచ్చాను నేనూ!!.

అబ్రహంలింకన్ గారూ..
మీ తర్వాతా మంచిగా చెప్పడానికి..
ఏం మిగిల్చారు మావారు!!
మీ వారసత్వం బొత్తిగా రాలేదెవరికీ.. సారూ..

Ps: అన్ని పథకాలనూ అనుభవించేసి..
ఒక్క ఓటుని ఖరీదుకు అమ్మేసి..
రాయితీలు..రుణమాఫీ అనుభవించి..

తిన్నది అరక్క..
ఊరికే తిట్టుకుందాం బ్రదరూ..
ప్రజాస్వామ్యం బరువును ఏ గాడిదైనా ఎలా మోస్తుంది!!

జీవితానుభవాల్ని వృధాగా వదిలేసి..
విశ్లేషకులు విమర్శలకే పరిమితమౌతుంటే!!

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa