Jun 20 2013

||బేరం- నేరం||

||బేరం- నేరం||

ఓయ్! తోటకూరా!!.. ఎలా ఇస్తున్నావ్?
‘పదికి 4 కట్టలమ్మా!’
…మరి “8 ఇవ్వవా!!”
‘కిట్టదమ్మా…..’ ‘…..ఐతే పో.’
ఇది నే చూడలేని వ్యధ

ఆటో!.. వస్తావా!!…
“….మీటరు మీద 20 eXtra ఇస్తావా?
ఎందుకివ్వాలి!! వద్దులే బాబు….”
ఇది నే రాయలేని కథ..
నాకు ఈ తంతే .. చీదర.

చిల్లర చాలక చేతుల్ని నలుపుకున్నా..
సరుకుల్ని కొనడం
ఎన్నోసార్లు విరమించుకున్నా కానీ ..
పదిపైసలు కలిసొస్తాయని
అడ్డదిడ్డంగా.. బేరానికి దిగలేను

బేరమేమంత నేరమా!!
అని అడగొద్దు నన్ను అతిశయంగా..
ఆ బేరాలు నాదగ్గర సాగవు

కోట్లు మింగిన గద్దల్ని
సంఘటితంగా గాలికి వదిలేసి..
పిచ్చుకల జీవితాలతో పరాచకాలాడాలని..
తోపుడు బండితో పావుబేరం
కూరల గంపతో సగం బేరం సబబే నని
ఏ బళ్ళో చదివాము! ఈ పాఠాల్ని!!

ఇరవై రూపాయిలు ఆశించే రిక్షావాడికి
పది రూపాయిలే చాలంటావా!!
దుమ్మెత్తిన నీబూటుని గుండెలకు హత్తుకుని
మిసమిసలద్దినోడికి సగం డబ్బులతో సరా!!
పావుకేజీ తూకానికి చటాకు కొసరు కోరతావా
ఇదెక్కడి న్యాయం?

అర్థరూపాయి రేటు పెంచి
ఐదు పైసల డిస్కౌంటులిస్తుంటే..
షాపింగ్‌మాల్ సంస్కృతికి
తలవంచి కొనుక్కునే మనకు..

బేరాలాడడానికి..
అసంఘటిత కార్మిక లోకమే ..
దొరికిందా?

పెట్టుబడిలేక వంకాయల వడ్డీ* కింద
ఉదయాన్నే తొంభై రూకలు అప్పు తెచ్చుకునే వాడు
రాత్రికి వంద తిరిగెలా ఇస్తాడు!! నీ లెక్కల్లో..

బేరగాడి రూపంలో నవ్వుని చిదిమేసుకుని
ఆరిందాగా..అన్యాయంగా.. గదమాయించకు
చేపల మార్కెట్టుని చూపి నను సముదాయించకు..

నీ వలలో ఎవరో పడ్డా పడకున్నా
నీకు రాని వల విసిరే ఒడుపుని,
కాలే కడుపుని.. గౌరవించు..

రేటుని బట్టి వస్తువుండదు సోదరా..
అవసరమే అమ్ముడవుతుంది అంగట్లో
నీ అవసరాల గాలానికి బేరం ఎరవేసి
అర్థాకలిని అమ్ముకోనివ్వకు
అపనమ్మకాన్ని నమ్ముకోనివ్వకు..

ఏ అర్థరాత్రో అవసరమొచ్చినప్పుడు..
ఆటో అన్నని ఆప్యాయంగా అడుగు
మీటరు మాటెత్తకుండా ..
భద్రంగా గమ్యం చేర్చమని..

లాభనష్టాల తరాజును తూచకుండా ..
నాలుగు మాటల్ని పంచుకుంటూ..
రోడ్డు భద్రత చూసుకుంటూ..
ప్రయాణం ముగిసేదాకా..

ఇక లెక్క తేలినట్టే అనుకున్నాకా..
కనీసం కళ్ళలో నవ్వులతో ఒక మెరుపు మెరిసినా
రెండు చేతులు ఒక్క క్షణం పెనవేసుకున్నా
బేరాలాడడం బేకార్ అని..
ఇద్దరు శాశ్వతంగా గుర్తుంచుకున్నట్తే..
నా క్లబ్ లో మరొకరికి సభ్యత్వం దొరికినట్టే..

==19.6.13==

RTS Perm Link

2 responses so far

2 Responses to “||బేరం- నేరం||”

  1. COMMONMANon 20 Jun 2013 at 9:56 PM

    కన్నులు కదలడం లేదు….పెదవులు మాట్లాడటం లేదు..హృదయం మాత్రమే ద్రవిస్తోంది..మార్పు కావాలనిపిస్తోంది..ముందు నేను మారాలనిపిస్తోంది.

  2. రమon 03 Jul 2013 at 4:25 PM

    మీరు రాసినవి అక్షరాలు కాదు…కష్టజీవి ఆవేదన.
    ఇవన్నీ చదువుతున్నప్పుడు వెనువెంటనే పాటించేయాలి అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ ఇవి ఆచరణ సాధ్యమేనా?

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa